తలపు బుక్ హోమ్.. పఠనాసక్తిని పెంచే పుస్తకాల దుకాణం
ఓ ముగ్గురు స్నేహితులు కలిస్తే వీకెండ్ ప్లాన్స్, విహారయాత్రల గురించి మాట్లాడుకుంటారు. కానీ వీళ్లు మాత్రం చాలా డిఫరెంట్.. ఈ రోజు ఏ బుక్ చదివావు? ఈ ఆదివారం ఏ నవల కొందాం అని పుస్తకాల కబుర్లు చెప్పుకొంటారు. అలాగని వాళ్లు నడివయసు వారేం కాదు. నిండా ముప్పయ్ ఏండ్లు నిండని యువత. తమ లాంటి సాహితీ ప్రియుల కోసం ‘తలపు బుక్ హోమ్' పేరుతో పుస్తకాల దుకాణాన్నే ఏర్పాటు చేశారు. ఈ తరానికి తలపుల్లో పఠనాసక్తిని రేకెత్తించడానికి పాటుపడుతున్నారు. అంతేకాదు, తమతో చదరంగం ఆడి గెలిచిన వారికి కోరుకున్న పుస్తకాన్ని బహుమతిగా ‘చదివి’స్తున్నారు!
ముగ్గురి తలపు.. సాహిత్యం గెలుపు!
వనపర్తికి చెందిన మూర్తి రాసమోని బీటెక్ పూర్తి చేసి ఫిల్మ్‌మేకర్‌గా తన కెరీర్ ప్రారంభించాడు. మంచి సాహిత్య ప్రియుడు. దేవరకొండ బాలగంగాధర్ తిలక్ రచనలకు వీరాభిమాని. విశాఖపట్నానికి చెందిన మారుతి అశోక్ ఆనంద్ రచయిత, సినిమాలకు పాటలు రాయడంతో పాటు షార్ట్ఫిల్మ్మేకర్గా రాణిస్తున్నాడు. ఇద్దరి అభిరుచులూ దాదాపు ఒకటే! సామాజిక మాధ్యమాల్లో ఏర్పడిన పరిచయం స్నేహంగా మారింది. 2022లో సినిమా ప్రయత్నాల కోసం హైదరాబాద్ బాట పట్టాడు ఆనంద్. ఇక్కడికి వచ్చాక రోజూ మూర్తిని కలిసేవాడు. కెఫేలో రోజంతా గడిపేవారు. ఉదయాన్నే తమకు నచ్చిన సాహిత్యాన్ని తీసుకొని కెఫేకు వెళ్లడం చదవడం, సినిమాల గురించి చర్చించడం.. ఇదే దినచర్యగా మారింది. ఇదే సమయంలో ప్రైవేట్ ఉద్యోగం చేస్తున్న ప్రత్యూష ఆనంద్ రాసిన చంద్రలహరి, సంతకం పుస్తకాలు చదివింది. అవి ఆమెకు బాగా నచ్చేశాయి. రచయిత ఆనంద్‌ను కలుసుకొని తన ఆనందాన్ని పంచుకుంది. అలా మూర్తి, ఆనంద్‌లకు సాహిత్య స్నేహితురాలైంది. రోజూ ఆఫీస్‌కు వెళ్లే ముందు వీళ్లుండే కెఫేకు పోయి ఓ గంట సాహితీ చర్చ చేసేది ప్రత్యూష.

Murthy, Pratyusha, Ashok
ఒకరి ఆలోచన నుంచి
సాధారణంగా వీకెండ్ అంటే గుర్తుకొచ్చేది షాపింగ్‌లు, ఔటింగ్‌లు. కానీ, ఈ ముగ్గురు మాత్రం ఆదివారమొస్తే చాలు.. కొత్త పుస్తకాలు ఏమొచ్చాయి? సెకండ్ హ్యాండ్ పుస్తకాల్లో మంచి నవలలు ఏమున్నాయి? అంటూ కోఠి, అబిడ్స్ అంతా చుట్టేస్తుంటారు. మరోవైపు ఆనంద్‌కు సొంతంగా బుక్ హౌస్ ఏర్పాటు చేయాలని కోరిక ఉండేది. ఆ విషయాన్ని తన ఇద్దరు మిత్రులకు చెప్పడంతో సరే అంటూ ముందుకు సాగారు. కోచింగ్ సెంటర్లకు కేంద్రమైన అమీర్‌పేటలో ఈ ఏడాది సెప్టెంబర్‌లో ‘తలపు బుక్ హోమ్’ ప్రారంభించారు. చదివిన కథ, నవలలోని పాత్రలు మన తలపునకు (స్మరణ) తీసుకురావాలనే ఉద్దేశంతో ఆ పేరు పెట్టామంటారు ముగ్గురూ! శ్రీశ్రీ, చలం, గోపీచంద్, రంగనాయకమ్మ, గుంటూరు శేషేంద్ర శర్మ, మరెందరో లబ్ధప్రతిష్ఠులైన రచయితల రచనలను ఈ బుక్ హోమ్‌లో ఏర్పాటుచేశారు.
చెస్‌లో గెలిస్తే
పుస్తకాల దుకాణాలు అందరూ పెడతారు. కానీ, పాఠకులు కూర్చొని చదువుకునేందుకు ఎలాంటి ఏర్పాట్లు చేయరు. ఈ హోమ్‌లో పెద్ద హాల్ ఉంది. పుస్తకం కొనుక్కొని అక్కడే ఎంతసేపైనా కూర్చొని చదువుకోవచ్చు. అంతేకాదు సాహిత్యాన్ని పాఠకులకు చేరవేయడం కోసం వినూత్న ప్రయత్నానికి శ్రీకారం చుట్టారు వీళ్లు. ప్రతి రోజూ సాయంత్రం 5 గంటల తర్వాత వచ్చే పాఠకులకు ఒక ఆఫర్ ప్రకటించారు. నిర్వాహకులలో ఒకరైన ఆనంద్‌తో చదరంగం ఆడి గెలిచిన వ్యక్తికి తాను నచ్చిన పుస్తకాన్ని బహుమతిగా అందిస్తున్నారు. క్రీడాసక్తి ఉన్నవాళ్లు ఆటలో గెలిచి పఠనాసక్తిని పెంచుకుంటారనే ఆశతో ఈ వెసులుబాటు కల్పించామని చెబుతున్నారు. జెన్‌జీ పాఠకుల కోసం ప్రత్యేక సందర్భాల్లో డిస్కౌంట్ ప్రకటిస్తున్నారు. సోషల్ మీడియాలో పుస్తకాలకు ప్రచారం కల్పిస్తున్నారు. ఆ పోస్ట్ చూపించిన వారికి డిస్కౌంట్ అందిస్తున్నారు. సెలవులతో సంబంధం లేకుండా ఈ పుస్తకాలయం అనునిత్యం తెరిచే ఉంటుంది.

Chess
త్వరలోనే..
‘బుక్ హోమ్ చుట్టుపక్కల ఐటీ ఉద్యోగాలు చేసేవారు అధికం. పని ఒత్తిడిని తగ్గించుకోవడానికి కొందరు పుస్తకాల కోసం వస్తున్నారు. ఇక్కడే కూర్చొని చదువుకుంటున్నారు. వాసిరెడ్డి సీతాదేవి నుంచి ఇటీవల వచ్చిన రవిమంత్రి లాంటి రచయితల పుస్తకాలపై కూడా కొందరు చర్చలు నిర్వహిస్తున్నారు’ అని నిర్వాహకులు తెలుపుతున్నారు. ‘ఈ పని మొదలు పెట్టేముందు మా ఇండ్లలో చెప్పాం. ఈ రోజుల్లో పుస్తకాలు ఎవరు చదువుతున్నారు? మీ ముగ్గురు చదివినంత మాత్రన అందరూ చదవాలని రూల్ లేదు కదా’ అని పెదవి విరిచారు. అయినా మేం వెనక్కి తగ్గలేదు. ఇప్పుడు మంచి స్పందన వస్తున్నది’ అని చెబుతున్నారు. ప్రారంభించిన కొన్ని నెలల్లోనే సాహితీ పరిమళాలు వెదజల్లుతున్న తలుపు బుక్ హోమ్ భవిష్యత్తులో పబ్లిషర్‌గా మారనుంది. సాహిత్య సమావేశాలకూ వేదిక కానున్నది.
– రాజు పిల్లనగోయిన

Books
Read Today's Latest Sunday News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి
Viral dance | ఆఫీస్ దీపావళి వేడుకల్లో యువతి డ్యాన్స్.. ఇంటర్నెట్లో ఏకంగా రెండు కోట్ల వ్యూస్.. Video

