చెర్రీ చెట్టు అందానికి, చెర్రీ పండ్లు రుచికి ప్రసిద్ధి. శాన్ఫ్రాన్సిస్కో నగరానికి వెళ్లినప్పుడు మొదటిసారి చెర్రీ చెట్లను చూశాను. అక్కడ చెర్రీ తోటలు, ఆల్మండ్ తోటలు విస్తారంగా ఉంటాయి. చెర్రీ చెట్టు ఇరవై నుంచి ఇరవై అయిదు అడుగుల దాకా ఎదుగుతుంది. అంతకన్నా ఎక్కువ పెరగకుండా కొమ్మలు కత్తిరిస్తారు. చెట్టు నిండా పచ్చని ఆకులు, ఎర్రని పండ్లు ఉంటాయి! చెర్రీపండ్లు గుత్తులు, గుత్తులుగా విరగకాసి కన్నుల పండువగా ఉంటుంది. చెర్రీ పండు రేగుపండు అంత ఉంటుంది. రేగు పండులాగే ఒకే విత్తనం కలిగి ఉంటుంది. కొంచెం తియ్యగా, కొంచెం పుల్లగా… రుచి భలేగా ఉంటుంది. ఈ పండ్లనే మధ్యాహ్నం భోజనంలా కడుపునిండా తినొచ్చు.
చెర్రీ పండ్లు అమెరికాకు సంబంధించినవనే అపోహ ఉంది. ఇవి చల్లని వాతావరణంలోనే కాకుండా కొంత సమశీతోష్ణ వాతావరణంలోనూ పెరిగే చెట్లు. హైదరాబాద్ నగరం చుట్టుపక్కల చెర్రీ తోటలు పెంచుతున్నారు. చెర్రీ తోటలు మనదేశంలో హిమాచల్‌ప్రదేశ్, ఉత్తరాఖండ్‌లో విస్తారంగా ఉన్నాయి. దక్షిణాదిలోనూ ఔత్సాహిక రైతులు వాణిజ్యపరంగా సాగుచేస్తున్నారు. మనీలా చెర్రీ అనే రకం చెట్టు అధిక తేమను, సమశీతోష్ణ స్థితులను తట్టుకోవడంతో ఈ రకం ఎక్కువగా పెంచుతున్నారు.
చెర్రీ తోటలకు చీడపీడల బెడద తక్కువ. వినియోగదారుల అవసరార్థం చక్కెర లేని చెర్రీ పండ్లనూ మార్కెట్లో తీసుకువచ్చారు. మిద్దెతోటల్లో కుండీల్లో కూడా చెర్రీ చెట్లను పెంచుకుంటున్నారు. ఇంటి అలంకరణ కోసం మరుగుజ్జు చెర్రీ చెట్లు, పొద రకం చెర్రీ చెట్లను పెంచుకుంటారు. శీతాకాలంలో చెట్టు నిండా పువ్వులు పూసినప్పుడు కన్నులకు ఇంపుగా కనిపిస్తుంది.
చెర్రీపండ్లతో రకరకాల వంటకాలు కూడా తయారు చేస్తారు. వీటితో చేసిన జామ్ భలే రుచిగా ఉంటుంది. చెర్రీ ఎంత రుచికరమైన పండో అంతే స్థాయిలో పోషక విలువలు గలది. ఈ పండులో పీచు పదార్థం అధికంగా ఉంటుంది. చెర్రీ తినడం వల్ల జీర్ణ సమస్యలు, వాత సమస్యలు పోతాయి. ఇది జీర్ణక్రియను మెరుగు పరుస్తుంది. డైటింగ్ చేసేవారికి మంచి ఆహారం. ఈ పండ్లను, కేకులు, బేకరీ తినుబండారాలు, బిస్కెట్లు, స్మూతీ, స్వీట్స్ తయారీలో ఎక్కువగా ఉపయోగిస్తారు.
-ఎమ్మెల్సీ సురభి వాణీదేవి, పీవీ కూతురు