వెచ్చదనాన్ని ఇస్తే.. స్వెటర్. ఆ స్వెటరే తీయదనాన్ని పంచితే.. స్వీటర్ అనొచ్చేమో! స్వెటర్ వెచ్చగా ఉంటుందనే తెలుసు. కానీ తియ్యగా ఉండే స్వెటర్ గురించి విన్నారా? చలికాలంలో పెట్టుకొనే టోపీలు తెలిసినవే. కానీ చటుక్కున చప్పరించే టోపీలను ఎక్కడైనా చూశారా? ఇక్కడ కనిపిస్తున్నవన్నీ అచ్చంగా అలాంటివే! నేటితరం బేకర్లు చేసిన నిటెడ్ కేకులు, టోపీలు… చలికాలపు హాట్‌హాట్ ట్రెండ్!
ఊలుదారం మెలికలతో స్వెటర్ రూపుదిద్దుకుంటుంది.. నిజం. క్రీమ్ నింపిన పైపింగ్ బ్యాగ్ స్వెటర్‌ను ఆవిష్కరిస్తుంది.. నిజం. అవును, రెండూ నిజాలే. ఒకటి చలికాలం శరీరానికి… మరొకటి నేటి కాలం కేక్ ప్రియులకు. ఎప్పటికప్పుడు మారుతున్న జనం అభిరుచులకు తగ్గట్టు కొత్త లుక్‌లో కనిపించే ఆహారంలో కేక్ ముందుంటుంది. ఫంక్షన్ ఏదైనా సెంటర్ ఆఫ్ ఎట్రాక్షన్ తానే అనిపించుకునేలా ముస్తాబు అవుతున్నది. శీతకాలంలోనూ తన ప్రత్యేకతను అదే స్థాయిలో చూపిస్తున్నది. చూడగానే నిజమైన స్వెటర్, టోపీలను తలపించేలా వస్తున్న ఈ కేకులు చల్లని వాతావరణంలో ఓ థ్రిల్లింగ్ ట్రెండ్!
స్వెటర్ కొనుక్కోవాలంటే మనకు ఎన్ని రకాల ఆప్షన్లు ఉంటాయో.. అన్నీ ఇందులో ఉన్నాయి. బోలెడు రంగుల్లో, రకరకాల వెరైటీల్లో ఈ కేకుల్ని తయారు చేస్తున్నారు. ఆడవాళ్ల స్వెటర్లా.. గులాబీ రంగులు, పువ్వులు, తీగల డిజైన్‌తోనూ వస్తున్నాయి. బాక్స్‌లో మడతపెట్టినట్టు కూడా ఉంటున్నాయి. ఉలెన్ టోపీలను పోలిన కేకులనూ రూపొందిస్తున్నారు.
పైన పామ్పామ్లతో .. రకరకాల డిజైన్లూ మాడళ్లూ వచ్చేలా కూడా ముస్తాబు చేస్తున్నారు. ఊలు అల్లికలా కనిపించేందుకు ఐసింగ్ కోసం #21, #3, స్టార్… ఇలా రకరకాల పైపింగ్ టిప్‌లను వాడుతున్నారు. మనం కోరుకునే డిజైన్‌ను బట్టి ఈ టిప్లనూ ఎంచుకోవాలి. చేయితిరిగిన బేకర్లు అప్లోడ్ చేసిన రెసిపీలు ఆన్లైన్లో దొరుకుతున్నాయి. ఆ ఫార్ములా ప్రకారం మనమూ తయారు చేసుకోవచ్చు. ఇంతకీ, మీకు ఏ స్వెటర్ నచ్చింది?