వీధినాటకాన్ని ఊరేగిస్తూ..
రేడియో మోగింది.. యక్షగానాలు మందగించాయి. టీవీ వచ్చింది.. తోలుబొమ్మలు చిన్నబుచ్చుకున్నాయి. సినిమా రంగులద్దుకుంది.. ఒగ్గు కథలు తగ్గిపోయాయి. దృశ్య మాధ్యమాలు జనాలకు దగ్గరయ్యే కొద్దీ.. జానపద కళలు అదృశ్యమవుతూ వచ్చాయి. కాలంతో పరుగులు తీస్తున్న సమాజం..
రేడియో మోగింది.. యక్షగానాలు మందగించాయి. టీవీ వచ్చింది.. తోలుబొమ్మలు చిన్నబుచ్చుకున్నాయి. సినిమా రంగులద్దుకుంది.. ఒగ్గు కథలు తగ్గిపోయాయి. దృశ్య మాధ్యమాలు జనాలకు దగ్గరయ్యే కొద్దీ.. జానపద కళలు అదృశ్యమవుతూ వచ్చాయి. కాలంతో పరుగులు తీస్తున్న సమాజం.. నాగరికత నిర్మాణంలో భాగమైన సంప్రదాయ కళలను విస్మరిస్తూ వస్తున్నది. కానీ, నిర్మల్ జిల్లా భైంసాకు చెందిన నార్సెరపోల్ల మల్లేశ్ నలుగురితో పాటు నారాయణ అనలేదు! ముత్తాతల నాడు మహారాజులు పోషించిన వీధి నాటకాలకు మహారాజ పోషకుడిగా మారాడు. గురువుల నుంచి తనకు అబ్బిన వీధి నాటకాన్ని భుజానికెత్తుకొని ఊరూరా ఊరేగిస్తున్నాడు.
సా పట్టణంలోని బట్టిగల్లీలో నా మకాం. ఇప్పుడు ఉంటున్న ఇంటి జాగా, కొద్దిపాటి ఎవుసం భూమి తప్ప.. పెద్దల నుంచి వారసత్వంగా వచ్చిన ఆస్తిపాస్తులేమీ లేవు. ఇరవై ఐదేండ్ల కిందట నేర్చుకున్న కళనే నాకు అతిపెద్ద ఆస్తి. బట్టి గల్లీలో మా పెద్దల కాలం నుంచి ఉన్న స్థలంలో మూడేండ్ల క్రితం కట్టుకున్న ఇల్లు కూడా మా ఆలూమగల కష్టార్జితమే. మాకు ఇద్దరు ఆడపిల్లలు. రెక్కల కష్టం మీదనే బతకాల. అందుకే ఏ సీజన్లో ఏ పని దొరికితే ఆ పనికి వెళ్తం. చేన్ల పనులు ఏమీ లేనప్పుడు గంజ్‌లో హమాలీ పనికి కూడా వెళ్తుంటా. వీధి నాటకం ఉందంటే మాత్రం పనికి డుమ్మా!
పాటలన్నీ నోటికి వస్తయ్…
వీధి నాటకం నాకు మా ఇంటి పెద్దల నుంచి అబ్బిన విద్య కాదు. ఈ కళలో నాకు తొలి గురువు మేదరి లక్ష్మణ్ పంతులు. ఆయనది మా మైస (భైంసా)నే. అప్పుడు నాకు పద్దెనిమిదేండ్లు ఉంటయనుకుంటా. నాతోటివాళ్లు, ఇంకా కొందరు అప్పటి పిలగాండ్లతో కలిసి ఆయన దగ్గరే ‘బాలనాగమ్మ’ ఆట నేర్చుకున్నం. తర్వాత ఆరేండ్లకు నిజామాబాద్ జిల్లా పెగడాపల్లి గంగారాం పంతులు దగ్గర ‘నల్లపోచమ్మ’ నాటకంలో శిక్షణ తీసుకున్నం. నేను ఐదో తరగతి దాకా సదివిన. ఏ పాటైనా, ఎంత పెద్ద డైలాగ్ అయినా నేర్చుకోవడానికి ఎక్కువ సమయం పట్టేది కాదు. నాటకాల్లోని పాటలన్నీ నాకు ఇప్పటికీ నోటికి వస్తయ్. మొత్తం 12 నాటకాలలో రకరకాల ఏశాలు కట్టిన. ‘మేం ఆట నేర్చుకోవాలనుకుంటున్నాం’ అని ఎవరు ఫోన్ చేసినా వెంటనే ఆ ఊరి తోవ పట్టుకొని వెళ్లిపోతుంటా. ఆట నేర్పే పంతుళ్లు.. మా భైంసాతోపాటు, సుట్టుముట్టు పల్లెల్లో ఐదారుగురు దాకా ఉంటరు. అందరం కలిసి నాటకాలు ప్రదర్శించిన సందర్భాలు కూడా ఉన్నాయి. నేను, నాకు సాయంగా ఉండే రాజు కలిసి శిక్షణ ఇస్తుంటం. ఇప్పటికి 15 జట్లు తయారైనయ్. నల్లపోచమ్మ, బాలనాగమ్మ, ఎల్లమ్మ, ప్రహ్లాదుడు వంటి ఆటలే కాకుండా కోలాటం కూడా నేర్పిస్తం. కళ మీద అభిమానం, శ్రద్ధ ఉంటే ఒక ఆట (నాటకం) నేర్చుకోవడానికి కనీసం 45 రోజులైనా పడ్తది. ‘నల్లపోచమ్మ’ నాటక ప్రదర్శన వరుసగా నాలుగు రోజులు ఉంటుంది. నందిపేట మండలంలోని చౌడమ్మ కొండూరు జట్టు ప్రదర్శించే ‘నల్లపోచమ్మ’ ఆటకు మస్తు పేరు ఉంది. వాళ్లు బాగా శ్రద్ధగా నేర్చుకున్నరు.
‘ఆట’ కావాలనుకున్న…
ఆట పేరు చెప్తే నాకు కాలు నిలువది. అలా నెలలో ఏ పది రోజులో ఇంట్ల ఉంటా. మిగతా రోజులన్నీ ఏ ఆట కాడనో, ఏ భజన కాడనో ఉంటా. ఇట్లా ఆటలు, కోలాటాలు అనుకుంటూ.. తిండీతిప్పలు లేకుండా, యాళ్లాపాళ్లా ఎరుగకుండా తిరుగుతుంటే మా బాయి (భార్య) ఓసారి పుట్టింటికి ఎళ్లిపోయింది. అప్పుడు మా అత్తామామలు నన్ను పిలిపించుకొని ‘గీ ఆటలు గీటలు మానేసి బుద్ధిగ పని చేసుకో’ అని చెప్పిండ్రు. నేను అప్పుడే వాళ్లకు గట్టిగజెప్పిన.. ‘మీ బిడ్డ నా వెంట రాకపోతే పాయె.. ఆటలు మానేది లేద’ని! మా మామ కూడా ఇట్లాంటి నాటకాలు ఏసినోడే! నన్ను అందుకే అర్థం చేస్కోని, ఆమెను నాతోటి పంపిండు. నా భార్య వనిత బీడీలు చేస్తది. పెద్ద కూతురు మనోజ్ఞ మొన్ననే పదోతరగతి అయిపోయింది. నా చిన్న బిడ్డ మనీష ఇప్పుడు స్కూళ్లు తెరిస్తే పదోతరగతిలకు పోతది. నా బిడ్డలిద్దరూ బాగా చదువుకొని ప్రయోజకులు కావాలన్న ఆశ తప్ప.. వేరే బాధ లేదు. నేను నేర్చుకొని, ఇతరులకు నేర్పుతున్న కళ నాకు ఇంత మంది వారసులను తీసుకొస్తున్నది, అదే సంతోషం!
నార్సెరపోల్ల మల్లేశ్
నేను నేర్చుకొని, పది మందికి నేర్పుతున్న. వీధి నాటకాల్లో ప్రతిదీ ఒక నీతిని చెప్తది. జానపద గాథలన్నీ అన్యాయంపై పోరాటం చేసినవే ఉంటాయి. ఆట నేర్పించమని వస్తున్న ఎంతో మంది యువకులు ఈ వీరగాథల్లోని సారాంశాన్ని గ్రహించాలి. మంచిని ప్రచారం చేయాలి. అన్యాయాల్ని, అక్రమాల్ని ఎదిరించాలి.
Read Today's Latest Sunday News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Nishad Kumar | చరిత్ర సృష్టించిన నిషద్ కుమార్.. నిన్న లాంగ్ జంప్, ఇవాళ హైజంప్‌లో గోల్డ్‌మెడల్
కొల్చారంలో విద్యుత్ ట్రాన్స్ఫార్మర్ దగ్ధం.. గ్రామంలో విద్యుత్ సరఫరా నిలిపివేత
Rudravanam PS | మారుమూల గ్రామం మిస్టరీతో ఆకట్టుకుంటున్న ‘రుద్రవనం పీఎస్’ ట్రైలర్!
కర్ణాటక జల దోపిడీని అడ్డుకోవాలి.. రేవంత్ సర్కార్ తక్షణమే స్పందించాలి.. శ్రీనివాస్ గౌడ్ డిమాండ్
Dussehra Celebrations | ఎర్రవెల్లిలో కేసీఆర్ ఇంట దసరా వేడుకలు..
ట్రెండింగ్ వార్తలు
Instagram Reels | రీల్స్ మోజులో బిడ్డను మరిచిన తల్లిదండ్రులు.. అలల్లో కొట్టుకుపోతున్న చిన్నారిని కాపాడిన యువకుడు!
Kavathe Ekand Dussehra | దీపావళికి కాదు.. దసరా రాత్రంతా బాణసంచా కాల్చే గ్రామం!
Palapitta | దసరా వేళ కనిపించని పాలపిట్టలు.. తెలంగాణ రాష్ట్ర పక్షి కనుమరుగవుతోందా?
Bastar Dussehra | రావణ దహనం లేని దసరా.. 75 రోజులపాటు జరిగే బస్తర్ ఉత్సవం ప్రత్యేకత ఇదే!
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం

