వర్షం కురిసే ప్రతి చినుకూ ఆనందాన్ని తెస్తుంది. కాని దాన్ని ఆస్వాదించాలంటే శరీరం కూడా సన్నద్ధంగా ఉండాలి. ఆరోగ్యం అనేది ఒక్క రోజు జాగ్రత్త కాదు. ప్రతి రోజూ తీసుకునే నిర్ణయాల సమాహారం. అందుకే మన ఇంటి వాతావరణాన్ని మెరుగుపరచుకోవాలి. జీవనశైలిని చక్కదిద్దుకోవాలి. శరీరం చెప్పే మాట వినాలి. ఇలాంటి చిన్నచిన్న జాగ్రత్తలతో సీజన్ వ్యాధుల బారినపడకుండా మనల్ని మనం కాపాడుకోవచ్చు. ఒక్కమాటలో చెప్పాలంటే అప్రమత్తతే ఈ వానాకాలంలో ఆరోగ్యానికి మనం పట్టే గొడుగు.
ఎండాకాలంలో వేడిగాలులు, భారీ ఉష్ణోగ్రతలతో సతమతం అయిన ప్రజలకు వానాకాలం ఎక్కడ లేని ఉపశమాన్ని అందిస్తుంది. వేసవి ఉష్ణోగ్రతలు తగ్గినా గాలిలో తేమ ఎక్కువగా ఉంటుంది. వర్షపు నీరు నిల్వ ఉండటం వల్ల దోమల సంఖ్య పెరుగుతుంది. తాగునీటి వనరులు కలుషితమయ్యే అవకాశం పెరుగుతుంది. వైరస్, బ్యాక్టీరియా, ఫంగస్‌లాంటి సూక్ష్మజీవులు వ్యాప్తి చెందడానికి అనుకూల పరిస్థితులు ఏర్పడతాయి. పాఠశాలలు తిరిగి ప్రారంభం కావడంతో జనసంచారం పెరుగుతుంది. అంటువ్యాధులు త్వరగా వ్యాప్తి చెందే ప్రమాదం ఉంటుంది. అందుకే ఈ సీజన్లో ఎక్కువగా కనిపించే వ్యాధులు, వాటి లక్షణాల గురించి తెలుసుకుంటే మనం భద్రంగా ఉండగలం.

వర్షాకాలంలో అనేక రకాల ఆరోగ్య సమస్యలు ఒకేసారి దాడిచేసే అవకాశం ఉంటుంది. కొందరికి జలుబు, దగ్గు, జ్వరం వస్తే… మరికొందరిని ఉదర సంబంధిత సమస్యలు ఇబ్బంది పెడతాయి. ఇంకొందరికి దోమకాటు వల్ల వచ్చే జ్వరాలు, చర్మ సమస్యలు, కళ్ల ఇన్ఫెక్షన్లు ఎదురవుతాయి. పిల్లలు పాఠశాలల్లో, పెద్దలు కార్యాలయాల్లో, వృద్ధులు ఇంటి పరిసరాల్లో కూడా ఈ ఇన్ఫెక్షన్ల బారిన పడే అవకాశం ఉంటుంది. గతంలో మలేరియా, టైఫాయిడ్, కలరా, వైరల్ జ్వరాలు ఎక్కువగా కనిపించేవి. ప్రస్తుతం డెంగ్యూ, చికున్‌గున్యా, వైరల్ ఫ్లూ, అప్పుడప్పుడు లెప్టోస్పిరోసిస్ వంటి వ్యాధులు కూడా నమోదవుతున్నాయి. వాతావరణ మార్పులు, పట్టణీకరణ, మురుగు నీటి నిల్వల వల్ల దోమల ద్వారా వ్యాపించే వ్యాధుల కాలవ్యవధి కూడా పెరుగుతున్నది. ఇది మనం మరింత అప్రమత్తంగా ఉండవలసిన అవసరాన్ని చాటుతున్నది.

కొన్ని జాగ్రత్తలు తీసుకుంటే వ్యాధుల బారినపడకుండా వానాకాలం నుంచి బయటపడొచ్చు. మందుల కంటే మంచి అలవాట్లతోనే పూర్తి రక్షణ సాధ్యం అవుతుంది. ఇంటి పరిసరాలను శుభ్రంగా ఉంచడం, నిల్వ నీరు లేకుండా చూడడం అన్నిటికన్నా ముఖ్యం. చేతులు తరచూ కడుక్కోవడం, తాగటానికి సురక్షితమైన నీరు ఎంచుకోవటం చేయాలి. దోమలు కుట్టకుండా జాగ్రత్తలు తీసుకోవాలి. వర్షాకాలం వచ్చినప్పుడు ఇంట్లో అందరికీ ఒకే రకమైన జాగ్రత్తలు సరిపోవు. చిన్నారులు, మహిళలు, వృద్ధులు… ఇలా ప్రతి వర్గానికీ వాళ్లవాళ్ల శరీర ధర్మాన్ని బట్టి అవసరాలు మారతాయి. పరిశుభ్రత పాటించడం, ఆరోగ్యకరమైన ఆహారం తీసుకోవడం వంటి అలవాట్లు కుటుంబ సంస్కృతిలో భాగం కావాలి. ముఖ్యంగా పిల్లలు, గర్భిణులు, వృద్ధులు ఉన్న ఇళ్లలో కొంత అదనపు అప్రమత్తత అవసరం. ఇంట్లో ఒక్కరికి జ్వరం వస్తే అది మిగతా వారికీ సోకకుండా చూసుకోవాలి.

పిల్లలు వర్షంలో ఆడుకోవటానికి ఇష్టపడతారు. చాలామంది పెద్దవాళ్లలోనూ ఈ సరదా కనిపిస్తుంది. కానీ, వర్షంలో బాగా తడవడం వల్ల జ్వరం వచ్చే ప్రమాదం ఎక్కువ. బయట ఆహారపదార్థాలు తినటం ఆరోగ్యానికి హాని చేస్తుంది. పాఠశాల నుంచి పిల్లలు కావచ్చు, బయట నుంచి వచ్చిన పెద్దవాళ్లు కావచ్చు ఇంటికి వచ్చిన వెంటనే చేతులు, కాళ్లు శుభ్రంగా కడుక్కోవాలి. పిల్లలు వానలో తడిసి వస్తే వెంటనే తడి దుస్తులను మార్చి వేరేవి వేయాలి. కాచి చల్లార్చిన నీటిని తాగటం పిల్లలకు అలవాటు చేయాలి. ఫ్రిజ్‌లో నీళ్లు తాగటాన్ని ఎంత తగ్గిస్తే అంత మంచిది. బయట అమ్మే కట్ ఫ్రూట్స్, నిల్వ ఆహారం, రంగురంగుల పానీయాల కంటే ఇంట్లో తయారైన తాజా ఆహారం ఇవ్వడం మేలు.
సీజనల్ వ్యాధులను పూర్తిగా ఆపడం ఎవరి చేతిలోనూ ఉండకపోవచ్చు. కానీ, అవి ఇంట్లో ఒకరి నుంచి మరొకరికి వ్యాపించకుండా చూడడం మాత్రం కుటుంబం చేతిలోనే ఉంటుంది. అనారోగ్యంతో ఉన్న వ్యక్తికి విశ్రాంతి కల్పించాలి. జ్వరం సోకిన పిల్లలను పాఠశాలకు పంపకూడదు. అది వ్యక్తిగతంగా వారితో పాటు తోటి విద్యార్థులను కూడా ఇబ్బంది పెడుతుంది. వేళకి నిద్రపోవడం, ఒత్తిడిని తగ్గించుకోవడం, శరీరం చెప్పే చిన్న మార్పులను కూడా గమనించడం వంటి వాటి ద్వారా రక్షణ పొందవచ్చు. వర్షాకాలంలో తేమ ఎక్కువగా ఉండటం వల్ల బ్యాక్టీరియా, వైరస్లు, ఫంగస్ వేగంగా పెరుగుతాయి. అందుకే సులభంగా జీర్ణమయ్యే, పోషకాలు ఎక్కువగా ఉండే ఆహారం తీసుకోవడం మంచిది. విటమిన్-సి, యాంటి ఆక్సిడెంట్లు, ప్రొటీన్, ఫైబర్ సమృద్ధిగా ఉండేలా చూసుకోవాలి. ముఖ్యంగా వేడివేడి ఆహారం తీసుకోవాలి. రోడ్డు పక్కన తిళ్లు తగ్గించాలి.

జ్వరం రాగానే యాంటి బయాటిక్స్ తీసుకుంటే తేలిగ్గా తగ్గిపోతుంది అనుకుంటారు కొందరు. ప్రతి జ్వరం ఒకే కారణంతో రాదు. కొన్ని జ్వరాలు వైరస్ల వల్ల వస్తాయి. అలాంటి సందర్భాల్లో యాంటి బయాటిక్స్ అవసరం ఉండదు. వైద్యుడి సలహా మేరకే మందులు వాడాలి. వర్షంలో తడిస్తేనే జ్వరం వస్తుంది అన్నది కూడా అపోహే. దోమల కాటు, కలుషితమైన నీరు, పాడైన ఆహారం, పరిశుభ్రత లోపం వంటి అనేక కారణాలతో కూడా సీజనల్ వ్యాధులు వస్తాయి. అలాగే అన్ని దోమలు ఒకేలా ఉండవు. కొన్ని రకాల దోమలు పగటి వేళల్లో కూడా కుడతాయి. అందువల్ల పగలు, రాత్రి అనే తేడా లేకుండా దోమల నుంచి రక్షణ చర్యలు తీసుకోవడం అవసరం. జ్వరం తగ్గితే చికిత్సను మధ్యలోనే ఆపేయొచ్చు అనుకోకుండా… వైద్యుడు సూచించిన చికిత్సను పూర్తిగా కొనసాగించాలి. లక్షణాలు తగ్గాయని మందులను సొంత నిర్ణయంతో ఆపేయడం మంచిది కాదు. ఎరుకతో సాగితే వానాకాలం ఏరువాకలా సాగిపోతుంది!
ప్రతి కుటుంబం రోజూ ఒకసారి ఈ చిన్న విషయాలను చూసుకోవాలి. ఇంట్లో తాగునీరు సురక్షితంగా ఉందా? ఎవరైనా జ్వరం లేదా దగ్గుతో ఉన్నారా? పిల్లలు బయట ఆహారం తిన్నారా? ఇంటి చుట్టూ నీరు నిల్వ ఉందా? అనే విషయాలను గమనించడం చాలా ముఖ్యం. ఎక్కడా చెత్త పేరుకు పోకుండా చూసుకోవాలి. కూలర్లు, డ్రమ్‌లు మూత పెట్టాలి. ఈ కొద్ది చెక్ లిస్ట్‌ను అలవాటుగా మార్చుకుంటే చాలా అనారోగ్య సమస్యలను ముందుగానే నివారించవచ్చు.
ఇంట్లో ఒక చిన్న హెల్త్ కార్నర్ ఏర్పాటు చేసుకోవడం మంచిది. అందులో థర్మామీటర్, ఓఆర్ఎస్ ప్యాకెట్లు, మాస్క్‌లు, కొన్ని ప్రాథమిక మందులు, శుభ్రమైన నీటి బాటిల్ ఉంచాలి. వెంటనే ఉపయోగించుకునేలా ఒకేచోట ఉంచితే అత్యవసర పరిస్థితుల్లో చాలా ఉపయోగపడుతుంది.
మన శరీరం కొన్నిసార్లు స్పష్టమైన హెచ్చరికలు ఇస్తుంది. వాటిని గుర్తించడం కీలకం. జ్వరం రెండు మూడు రోజులకుపైగా తగ్గకపోయినా, పదేపదే ఎక్కువగా వస్తున్నా, శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది అనిపించినా, తీవ్ర నీరసం, తలతిరగడం, స్పృహ కోల్పోయే పరిస్థితి వచ్చినా వెంటనే వైద్యుడిని సంప్రదించాలి. అలాగే విరేచనాలు, వాంతులు ఆగకపోవడం, నీరు లేదా ఆహారం తీసుకోలేకపోవడం వల్ల శరీరం బలహీనపడితే ఆలస్యం చేయడం మంచిది కాదు. చిన్నారుల విషయంలో మరింత అప్రమత్తంగా ఉండాలి. వారు అసాధారణంగా నీరసంగా కనిపించినా, ఆడుకోవడం మానేయడం, పాలు లేదా ఆహారం తీసుకోకపోవడం వంటి మార్పులు చోటుచేసుకున్నా తేలికగా తీసుకోకూడదు. వృద్ధుల్లో కూడా ఎక్కువ రోజులు జ్వరం ఉండటం, గందరగోళంగా మాట్లాడటం, నడవడానికి ఇబ్బంది పడటం లేదా శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది కలగడం వంటి లక్షణాలు కనిపిస్తే వెంటనే వైద్య పరీక్షలు చేయించాలి. అనారోగ్యం వచ్చినప్పుడు ఇంటి చిట్కాలు కొంత ఉపశమనం ఇవ్వొచ్చు. కానీ, అవి వైద్య చికిత్సకు ప్రత్యామ్నాయం కావని గుర్తించాలి. పిల్లలకు జ్వరం, వాంతులు, విరేచనాలు వచ్చినప్పుడు ‘ఒకటి రెండు రోజుల్లో తగ్గిపోతుంది‘ అని నిర్లక్ష్యం చేయకుండా అవసరమైతే వెంటనే వైద్యుడిని సంప్రదించాలి.