– సీహెచ్. నిర్మల, నార్కట్‌పల్లి.
స్థలం చూసుకొని.. అంటే, కొలుచుకొని ఎదురుగా వచ్చే రోడ్డుకు అటువైపు, ఇటువైపు స్థలం కొలతవేసి, స్థలానికి ఎన్ని ఫీట్లల్లో ఎదురు వీధి వస్తుంది అనేది ముందు ఎంచుకోండి. అప్పుడు దక్షిణ భాగంలో ఇల్లును ప్లాన్ చేయండి. దక్షిణ భాగానికి, ఎదురుగా వచ్చే వీధిపోటును కలుపుకోండి. అప్పుడు ఆ వీధి.. దానికి తూర్పు వీధిచూపు అవుతుంది. అందులో ఇల్లు కట్టండి. ఇదే మీకు ప్రధానమైన స్థలం. ముందుగా వీధి చూపు కలుపుకొన్న భాగానికి దక్షిణం – పడమర – ఉత్తరం కాంపౌండు కట్టండి. అందులో ముందు ఇల్లు కట్టుకోండి. పక్క స్థలం అంటే.. ఉత్తరం స్థలం ఇతరులకు అమ్మండి. లేదా ఖాళీగా పెట్టి కార్ పార్కింగ్ కోసం వాడుకోండి. అది కూడా బయటినుంచి బయటికే వాడుకోండి. ఉత్తరం స్థలంలో ఎలాంటి నిర్మాణం చేయకండి. అంతేకాదు.. ఆ స్థలం ఇతరుల పేరుమీద రిజిస్టర్ చేయండి. అది మనది కానప్పుడే.. మనకు ఉన్నది బలం అవుతుంది.
మీ అనుమానం సరైనదే కానీ.. నీళ్ల సంపు – బావి వేరు. నీళ్ల ట్యాంక్ – నీళ్ల హౌజ్ వేరు. అలాగే.. నేలమీద వేరు. ఇంటిమీద వేరు. నేల మీద అంటే.. భూమిని తవ్వి, నీళ్ల సంపును కడుతున్నాం. బావిని కూడా అంతే! భూమి లోతుకు వెళ్లి నీళ్లు తెచ్చుకుంటాం. ఇంటి మీద నీళ్లను పెట్టుకుంటాం. అంటే, దాని స్థితి – స్వరూపం మారిపోతున్నది కదా! నైరుతిలో గొయ్యి (అంటే నేల మీద) పనికి రాదు. ఇంటి మీద ఈశాన్యంలో నీళ్ల ట్యాంక్ బరువు పనికి రాదు. బరువు అంటే.. అక్కడ స్లాబ్ మోయదు అని కాదు. ఆ దిశ సున్నితమైనది. అది మూతపడొద్దు. ఓపెన్‌గా, ఖాళీగా ఉండాలి అని. దానిని ఉపయోగించాలి. నడవాలి అని అర్థం. ఇల్లు అనేది అమరికతో ఉంటుంది. ఒకటి ‘స్థానం’ ప్రధానంగా.. ఒకటి ‘వాస్తు’ ప్రధానంగా నడుస్తుంది. పోలీస్ చేతిలో తుపాకీ ఉండటం నేరం కాదు. అదే, సాధారణ వ్యక్తి చేతిలో తుపాకీ ఉండటం నేరం అవుతుంది. వస్తువు అదే.. వ్యక్తిని బట్టి, స్థానాన్ని బట్టి ప్రాధాన్యతలు మారుతాయి. ఇలాంటివి వాస్తులో ఎన్నో ఉంటాయి.
అందుకే కదా.. వీధిపోట్లకు ఎదురుగా దేవాలయాలు కడుతారు. ఏదైనా ఇంటికి నైరుతి వీధిశూల ఉంది అనేకదా.. గణపతి విగ్రహం (బొమ్మ) ఎదురుగా పెడతారు. దాని అర్థం.. ఆ వీధిపోటు ఆయనను ఏమీ చేయదు అనే కదా! నిజానికి ఇంటిని అలా కాపాడుకోవడం తప్పు. ఎదురుగా గుడి కట్టాలి. ఒక ఆలయం నిర్మించేటప్పుడు చాలావరకు ‘మాడ వీధులు’ తీసుకొని కట్టాలి. తద్వారా ఆ ఆలయానికి, ఆ ఊరి ప్రజలకు ఎంతో సహజీవనం ఉంటుంది. పోతే.. వీధిపోటును గణపతి ఆలయం, అమ్మవారి ఆలయం నివారిస్తుంది అనేది శాస్త్రీయ వచనం. అలాగే, ఆలయ స్థలాలు దిశాత్మకంగా ఉండి, ఆగమ శాస్త్రంతో నిర్మిస్తే.. ఎంతో వృద్ధిని పొందుతాయి ఆలయాలు.. అవే జీవాలయాలు. ఒక రోగాన్ని రూపుమాపాలంటే.. ఒక ఔషధం ఎలాగైతే ఉందో.. అలా ఆలయం శక్తి అనంతం కాబట్టి, సాధారణ వీధులు గణపతిని, అమ్మవారిని ఏమీ నష్టపరచవు అని మనం అర్థం చేసుకోవాలి.
మీ ఉద్దేశంలో గచ్చు ఇల్లు ప్రధానం. కాబట్టి దానికి తగిన ప్లానింగ్ ముందుగా మీరు సిద్ధం చేయాలి. రెండు గదులు అనేది తరువాత అంశం. డూప్లెక్స్ కట్టడం వేరు. అవసరానికి ఇంటిమీద రెండు గదులు వేసుకోవడం వేరు. మీరు కట్టేది డూప్లెక్స్ భవనం కాదు. కాబట్టి, మెట్లు ఇంట్లోంచే కావాలనేది వదిలేయండి. ఇంట్లో మెట్లు పెట్టి ఛత్రశాల (గచ్చు) ఇల్లు కట్టడం కుదరదు. మీరు మెట్లు ఇంటికి ఆగ్నేయంలో కానీ, వాయవ్యంలో కానీ పెట్టుకోండి. అంటే, బయటినుంచి బయటికే వాడుకోవాలి అన్నమాట. ఇక గచ్చు ఇల్లులో సెంటర్ ఓపెన్ చేయాలి. దానిని సరిగ్గా ఇంటి నాభిస్థానం చూసి, అది వచ్చేలా సమస్థితిలో స్లాబ్ కట్ చేయండి. రెండు గదులు అయినా.. ఒక్క గది అయినా ఇంటిమీద నైరుతిని కలుపుకొంటూ వేయండి. ‘ఛత్రశాల భవనం’ అంటున్నారు. అంటే.. పైన నాలుగు మూలల్లో పిరమిడ్‌లాగా పైకప్పులు వేస్తే.. పైన గదులు రావు. చూసుకోండి.