దిశలు లేకుండా భూమి అనేది ఉండదు. ఏ స్థలమైనా ఏదో ఒక దిశను కలిగి ఉంటుంది. ఆ దిశలు పెద్దవైనా కావచ్చు. చిన్నవైనా కావచ్చు. అంటే విదిక్కులు. ఈశాన్యం, ఆగ్నేయం, నైరుతి, వాయవ్యం.. ఇవి సహజంగా మూలల్లో వస్తాయి. అయితే, కొన్ని ప్రదేశాలలో ఇవే ప్రధాన దిశలుగా, వీధులుగా ఉంటాయి. వాటిని విదిక్కుల స్థలాలు అంటారు. ప్రధాన దిశలు ఉండేలా, అవికూడా దిక్సూచికి కచ్చితంగా ఉండేలా లే అవుట్లు చేయలేని వెంచర్స్ ఇప్పుడు ఎన్నో ఉన్నాయి. వాటివల్లే ఈ సమస్య ఎక్కువగా కనిపిస్తున్నది. ఇలాంటి దిశల ఇండ్లలో కూడా ఎంతోమంది ఉంటారు. అలా ఎన్నో నగరాలు, పల్లెలు కూడా ఉన్నాయి. అయితే దేనిశాతం దానికే ఉంటుంది. దేని విలువ దానికే ఉంటుంది. నిత్యం మంచి పోషక విలువలున్న ఆహారం తినాలి అని అందరూ చెప్పడం మనకు తెలుసు. కానీ, సమాజంలో అందరికీ అది సాధ్యం అవుతుందా? ఇదీ అంతే! అయితే వాస్తవం మాత్రం మనం తప్పక చెప్పుకోవాలి. విరుద్ధ భావాలను ఉత్పన్నం చేసేవి విదిక్కులు. అవి వ్యక్తిని పూర్ణ స్థితికి తీసుకుపోలేవు. కాబట్టి, వాటిని వ్యాపారాలకు వినియోగించాలి. అంతకుమించి ఏమీ చెప్పకూడదు. మనిషి – తన కుటుంబం – అభివృద్ధి అనేది వేరు. చాలామంది అభివృద్ధి అంటే.. సుఖం, హోదా, తరగని ఆస్తి అనుకుంటారు. ఇవి ఏ.. నీచ వ్యాపారం చేసినా దక్కుతాయి. అవేవీ కాని అనంతానందం మనిషి లక్ష్యం. అది పొందాలంటే.. శాస్ర్తాన్ని అనుసరించి నడవాల్సిందే! ఎవరూ మినహాయింపు కాదు.
‘నీటికి అగ్ని పడదు. అగ్నికి నీరు పడదు’ అనేది సత్యమే! కానీ, స్థానాలు మారినప్పుడు కింద – పైన అనే ప్రశ్న రాదు. మీ అపార్ట్మెంట్లో మీ నెత్తిమీద ఉన్న కుటుంబం.. ఆ స్థానాన్ని ఎలా వాడుతున్నదో మీరు ఎలా నిర్ణయిస్తారు? కాబట్టి, మీ సందేహం అనవసరం. కింద పొయ్యి ఉన్నా.. పొయ్యిపక్కనే యుటిలిటీ దక్షిణ – ఆగ్నేయంలో పెట్టుకుంటాం. అదేవిధంగా పైన ఆ స్థానంలోనే టాయిలెట్ కట్టుకుంటాం. కాబట్టి దోషం లేదు. ఒక అవసరం కోసం ఒక స్థానాన్ని కేటాయిస్తారు. దానిని శాస్త్రం చెప్పినట్టు మీరు పైన బెడ్రూమ్ చేసుకొని వాడుకోండి. దోషం లేదు. టాయిలెట్లో లీకేజీ రాకుండా చూసుకోండి చాలు. ఆగ్నేయ భాగంలో పడకగది రావచ్చు. టాయిలెట్ రావచ్చు.
మీకున్న రెండు ఇండ్లూ ముఖ్యమే! మీకు ఇక్కడ నగరంలో తిరగడానికి ఒక కారు, ఢిల్లీలో తిరగడానికి మరొక కారు పెట్టుకున్నారు అనుకోండి. అందులో బాగాలేని కారు ఎక్కడ ఉన్నా.. మీకు ఏమైనా ఉపయోగం ఉంటుందా? తిరగలేనివి, అవసరానికి పనికిరానివి ఎన్ని ఉంటే ఏంటి? ఇండ్లు ఎన్ని ఉన్నా మీరు ఆయా ప్రదేశాలకు వెళ్లినప్పుడు మాత్రమే వాటిలో ఉంటున్నా.. అవి చక్కగా శాస్త్ర ప్రకారం ఉండాల్సిన అవసరం ఉంది. నగరంలో – పల్లెటూళ్లలో అనేది కాదు విషయం.. అవి మీరు నివసించే గృహాలు. బాగా ఉండాల్సిందే! జీవితం.. ‘క్షణం – మరణం.. క్షణం – జన్మ’. ఏ క్షణం ఏ దానిదో తెలియనిది మన జీవితం. కాబట్టి, ఉన్నవి బాగుంటే.. ఆపై ప్రకృతే మనకు ఎల్లవేళలా తోడూనీడలా ఉండి కాపాడుతుంది.
దక్షిణంలో ఇల్లు కట్టుకోవడం ఎంతో శుభదాయకం. ఇల్లు కట్టడంలో దక్షిణం స్థలం నిర్ణయించడంలో జాగ్రత్త వహిస్తే.. దక్షిణం ఇల్లు ఎప్పుడూ దోషాన్ని ఇవ్వదు. దక్షిణం ఎప్పుడూ చెడ్డది కాదు. దక్షిణం రోడ్డు ఉన్నప్పుడు దక్షిణంలో మెట్లు పెట్టుకోవచ్చు. అంటే.. దక్షిణ – నైరుతిలో మెట్లు పెట్టుకొని, దక్షిణ – ఆగ్నేయం నుంచి సింహద్వారానికి నడక సాగాలి. దక్షిణం మెట్లు వచ్చినప్పుడు ఉత్తరంలో తప్పకుండా బాల్కనీ రావాలి. ఉత్తరం ఖాళీ వదలకుండా నిర్మాణం చేయడం, ఉత్తరం ద్వారం, తూర్పు ద్వారం లేకుండా దక్షిణం వీధి ఉన్న ఇల్లు కడితే దుష్ఫలితాలు వస్తాయి. దక్షిణం స్థలం విదిక్కులతో ఉంటే ఇల్లు కట్టకూడదు. దానిని కమర్షియల్గా వాడుకోవాలి. అంతేకానీ చక్కని దక్షిణం స్థలంలో శాస్త్రప్రకారం ఇల్లు కట్టి.. ఎందరో గొప్పగా ఎదిగినవాళ్లు ఉన్నారు.