నైరుతి స్థలం దోషమని కాదు. ఆ స్థలాన్ని అజాగ్రత్తగా నిర్మిస్తే.. అనేక దోషాలు కలుగుతాయని అర్థం. దక్షిణం – పడమర వీధులు ఉన్న స్థలం నైరుతి. ఇందులో దిశ సరిగ్గా లేకున్నా.. దక్షిణం, పడమరలు లోతు కలిగి, కాలువలు ఉండి, పెద్ద నాలాలు ఉన్నా.. నైరుతికి వాలు కలిగి ఉండే రోడ్లు ఉన్నా.. పిల్లల భవిష్యత్ అగమ్యగోచరంగా ఉంటుంది అనేది శాస్త్రం హెచ్చరిక. దానికి సరైన వాస్తుబలం ఉంటే.. అది గొప్ప స్థలంగా నిలుస్తుంది. ఇందులో ఈశాన్యం పల్లంగా ఉండి, నైరుతి ఎత్తు ఉండాలి. ఈశాన్యం భాగం ఎక్కువ ఖాళీ వదిలి, అంటే.. ఉత్తరం – తూర్పు వదిలి, దక్షిణం – పడమర ప్రదక్షిణ నిమిత్తం వదిలి ఇల్లు నిర్మించాలి. హద్దుల మీద ఇల్లు కట్టకూడదు. స్థలానికి దిశ సరిగ్గా కుదిరి ఉండాలి. స్థలం మూలమట్టానికి ఉండాలి. గదులు కూడా మూలమట్టానికి కట్టాలి. దగ్గరలో దక్షిణం – పడమరల్లో చెరువులు, వాగులు ఉండవద్దు. అలా.. అన్నీ బాగుంటే, నైరుతి ఇల్లు దోషం కాదు.

ఆలయాన్ని చాలా శాస్త్ర సమ్మతంగా (ఆగమం అనుసరించి) నిర్మించాలి. దేవాలయ నిర్మాణం ఎంత గొప్పదో.. దానిని సక్రమంగా నిర్మించడం, చక్కగా నిర్వహించడం కూడా అంతే ముఖ్యం. ఆలయాన్ని కట్టి వదిలివేయకూడదు. శివాలయాన్ని గ్రామానికి వెలిముఖంగా కట్టాలి అనేది నియమం. అంటే.. శివాలయానికి వెనక భాగంలో ఊరు ఉండాలి. అప్పుడే ఊరు వృద్ధి పొందుతుంది. అలాగే, ఆలయం ఎక్కడ నిర్మించినా.. దానికి మాడవీధులు తప్పనిసరిగా ఉండాలి. నాలుగు వైపులా వీధులు ఉంటే ఆలయ శుద్ధి, పల్లె అభివృద్ధి మెండుగా ఉంటాయి. పడమర ముఖంగా శివాలయం నిర్మిస్తే.. ఆ గుడికి అభిముఖంగా గ్రామం ఉంటే.. దోషం ఉండదని శాస్త్ర వాక్కు. ఆలయం నిర్మాణం, దాని పూర్తి వివరాలు అన్నీ క్షుణ్నంగా తెలుసుకొని నిర్మించండి. అప్పుడే, అందరికీ ధన్యత కలుగుతుంది.

ఇంటి ముందు వరండా పెట్టుకుంటే, దానికి పిల్లర్లు ఉండాలి. అయితే, అది ఇంటిలో భాగంకాదు. తూర్పున వసారా లేదా వరండా అంటాం. అయితే, మీరు ఆ వరండాలో ఆగ్నేయం మెట్లు పెట్టారు. దానికింద టాయిలెట్ కట్టారు. దోషం లేదు. మెట్ల కింద టాయిలెట్ రాకూడదు అనేది నిజమే! ఎప్పుడు అంటే.. పిల్లర్లు లేని బాల్కనీ కింద. మెట్లను ఇంటి కాంపౌండును ఆనుకొని టాయిలెట్ కడితే.. అది ఆగ్నేయం మూతపడినట్లు అవుతుంది. ఇంటికి ప్రదక్షిణం చేసే సందు ఉండదు. అది దోషం. అలా ఉండొద్దు. అలాకాకుండా, ఇంటి ప్రదక్షిణం వదిలి, తూర్పు వరండాలో ఆగ్నేయంలో టాయిలెట్‌ను కట్టుకోవచ్చు. ఎందుకంటే, పిల్లర్ల భూమిని ఆనుకొని తూర్పు వరండా వేశారు కాబట్టి. అక్కడ మెట్లు ఉన్నా ఫర్వాలేదు. ప్రదక్షిణం పోలేదు కదా!

భూమి అంతటా ఒకలాగే కనిపిస్తుంది. మనుషుల గుంపు, వారి అవయవాలు ఒకేలా ఉంటాయి. కానీ, అందరూ ఒకే మనసును కలిగి ఉంటారా? మనసు ఎంతో వేరుగా ఉంటుంది. అందుకే, రూపం వేరు.. స్వరూపం వేరు. స్వరూపం.. అంతరంగాన్ని సూచిస్తుంది. ఎవరికి తగిన భూమిని వాళ్లు ఎంచుకోవడం అంత సులభం కూడా కాదు. సృష్టి మూడు గుణాలతో జరిగింది. వాటినే త్రిగుణాలు అంటారు. సత్వ – రజస్ – తమో గుణాలు. భూమిలో, ప్రకృతిలో ఉన్నవి అవే! అందుకే, పండితుడు.. యజమాని, అతని కుటుంబ వ్యక్తిత్వాన్ని బట్టి ఆయా భూములు పనికి రావనీ, పనికి వస్తాయనీ స్థల నిర్ధారణ చేస్తాడు. అందులో ఆయా వ్యక్తులు శోభిస్తారు. దానినే తగిన ఎంపిక అంటారు. పైకి అంతా ఒకేలా ఉన్నా.. భూమి గుణ – గణాలను బట్టి ఎంచుకోవడం ఒక వరం. వ్యక్తి వైభవం – పతనం అనేది స్థలాన్ని బట్టే ఉంటుంది.