Shraddha Srinath | దక్షిణాదిన వరుస సినిమాలతో దూసుకుపోతున్న కన్నడ భామ శ్రద్ధా శ్రీనాథ్. ‘జెర్సీ’ సినిమాతో టాలీవుడ్లో ఎంట్రీ ఇచ్చిన ఈ భామ తాజాగా ‘డాకు మహారాజ్’తో మరో హిట్ ఖాతాలో వేసుకుంది. తెలుగు, తమిళం, మలయాళం, కన్నడతోపాటు హిందీ సినిమాల్లోనూ రాణిస్తున్నది ఈ బ్యూటీ. కమర్షియల్ హీరోయిన్గా కన్నా.. మంచి నటిగా గుర్తింపు తెచ్చుకోవడమే తన లక్ష్యమంటున్న శ్రద్ధా శ్రీనాథ్ పంచుకున్న కబుర్లు..
మాది ఆర్మీ ఫ్యామిలీ. నాన్నకు తరచూ బదిలీలు అయ్యేవి. దాంతో రెండేండ్లకో రాష్ట్రం మారుతూ.. భిన్న సంస్కృతుల నేపథ్యంలో పెరిగాను. వెళ్లిన ప్రతిచోటా ఓ కొత్తదనం పలకరించేది. సినిమాల్లోనూ నేను అదే పంథాను అనుసరిస్తున్నాను. పాత్రల ఎంపికలో కొత్తదనం ఉండేలా చూసుకుంటున్నాను. డిఫరెంట్ రోల్స్ చేసినప్పుడే కదా.. నటిగా మనకంటూ ప్రత్యేకమైన గుర్తింపు వస్తుంది! అంతేకాదు, ఏడాదికి ఐదారు సినిమాలు చేస్తూ పరుగులు తీసే రకం కాదు నేను. ఒకటి రెండు సినిమాలే చేసినా.. మంచి కథల్లో భాగం అవ్వాలని కోరుకుంటున్నా.
దక్షిణాది భాషా చిత్రాలతోపాటు హిందీలోనూ మంచి కథలు వస్తే నటిస్తున్నా. మాతృభాష కన్నడ తర్వాత నాకు తెలుగు సౌకర్యంగా అనిపిస్తుంది. తెలుగులో నా మొదటి సినిమా ‘జెర్సీ’మంచి విజయాన్ని అందుకుంది. తర్వాత మంచి అవకాశాలు వచ్చాయి. ‘డాకు మహారాజ్’తో టాలీవుడ్లో నా జర్నీ స్పీడందుకుంటుందని భావిస్తున్నా.
ఏదైనా కథ నా దగ్గరికి వచ్చినప్పుడు స్క్రిప్ట్ ఎంత స్ట్రాంగ్‌గా ఉందో ఆలోచిస్తాను. అలాగే నా పాత్రకు తగిన ప్రాధాన్యం ఉన్నదో, లేదో చూస్తాను. ఒక ప్రేక్షకురాలిగా ఎలాంటి సినిమా నేను ఇష్టపడతానో.. అలాంటి కథలు ఎంచుకుంటాను. పీరియాడిక్ కథలంటే నాకు చాలా ఇష్టం. ‘పొన్నియిన్ సెల్వన్’ తరహా సినిమాల్లో భాగం కావాలనే కోరిక ఉంది. నిజ జీవితానికి దగ్గరగా ఉన్న కథలు మరీ ఇష్టం.
హీరో బాలకృష్ణతో కలిసి నటించడం గొప్ప అనుభూతినిచ్చింది. ఆయన దగ్గర చాలా విషయాలు నేర్చుకున్నా. అంత సీనియర్ నటుడైనా.. దర్శకుడు చెప్పేది శ్రద్ధగా వింటారు. ఆయన ఉత్సాహం నన్నెంతో ఆశ్యర్యపరిచింది. సెట్లో ఆయనుంటే సందడే సందడి. ఎంతో సరదాగా ఉంటారు.
ఒకసారి ఆస్ట్రోనాట్ కావాలనుకునేదాన్ని, మరోసారి న్యూస్‌రీడర్ అయితే బాగుంటుందని అనుకునేదాన్ని. కానీ, ఒక ఏజ్ వచ్చాక లాయర్ కావాలనుకున్నా. ‘లా’లో జాయిన్ అయ్యాను. తర్వాత నటనను కెరీర్‌గా మలుచుకున్నా. సినిమాల్లోకి వచ్చిన కొత్తలో ‘ఈ అమ్మాయి ఏడాది కన్నా ఎక్కువ కాలం ఇండస్ట్రీలో ఉండదు’ అన్న మాటలు వినిపించాయి. అయితే, వాటికి నేను స్పందించలేదు. ఇండస్ట్రీలో నిలదొక్కుకొని వారికి సమాధానం ఇవ్వాలనుకున్నా!
నాకు ఇండస్ట్రీలో గాడ్‌ఫాదర్స్ లేరు. ప్రతి సినిమా ఒక పాఠమే! జెర్సీ తర్వాత చక్కని విజయాలు అందుకున్నాను. సినిమాహిట్టయినా, ఫ్లాప్ అయినా ఒకేలా రిసీవ్ చేసుకుంటాను. నేను ఎంత నిజాయతీగా పనిచేశానన్నదే ముఖ్యం. ఫలితం గురించి ఎప్పుడూ ఆలోచించను.సినిమాలపై వచ్చే విమర్శలు సీరియస్‌గా తీసుకోను.