మై డియర్ దొంగ సిరీస్, శుభం సినిమాలతో తెలుగు ప్రేక్షకులను మెప్పించిన టాలీవుడ్ నటి షాలిని కొండేపూడి. యాడ్ కంపెనీ స్థాపించి సత్తా చాటిన ఈ చిన్నది సినిమాల్లోనూ రాణిస్తున్నది. ప్రస్తుతం లెజెండరీ డైరెక్టర్ సింగీతం శ్రీనివాస్ దర్శకత్వం వహించిన ‘సింగ్ గీతం’ సినిమాలో కీలక పాత్ర పోషించింది. భవిష్యత్తులో దర్శకురాలిగా కామెడీ సినిమాలు తీయడమే తన లక్ష్యం అని చెబుతున్న షాలిని పంచుకున్న కార్వాన్ కబుర్లు ఇవి..
హైదరాబాద్‌లో పుట్టిపెరగడం వల్ల అనుదీప్, సిద్ధు జొన్నలగడ్డ, ప్రియదర్శి, అభినవ్ గోమఠం మంచి స్నేహితులయ్యారు. సిద్ధూలాగా అభిమానుల్ని ఎంటర్టైన్ చేయాలనుకుంటాను. శేఖర్ కమ్ముల డైరెక్షన్ అంటే ఎంతో ఇష్టం. గోదావరి సినిమా ఎన్నిసార్లు చూశానో! సంగీతం అంటే ఇష్టం. అప్పుడప్పుడూ పాటలు పాడటం, గిటార్ ప్లే చేయడం వంటివి ఇన్‌స్టాలో పోస్ట్ చేస్తుంటాను. తరచూ మనసుకు నచ్చిన చోటికి వెళ్తుంటాను.
ఎంసీజే పూర్తి చేసిన నేను 2008లో రేడియో జాకీగా కెరీర్ ప్రారంభించాను. కొన్నాళ్ల తరువాత కంటెంట్ క్రియేటర్ అవతారమెత్తాను. ఆ తరువాత మై డ్రీమ్ సంస్థలో సహాయ దర్శకురాలిగా పనిచేశాను. మనకంటూ ఓ గుర్తింపు ఉండాలనే ఆలోచనతో ‘నట్‌షెల్’ అడ్వైర్టెజింగ్ను ఏర్పాటు చేశాను.
భారతీయ సినీ చరిత్రలోనే తొలి మ్యూజికల్ కామెడి ఫిల్మ్ ‘సింగ్ గీతం’. ఇలాంటి జోనర్లో పనిచేయడం చాలా ఆనందంగా ఉంది. ఈ సినిమాలో నా పాత్ర నెగెటివ్ షేడ్‌లో ఉంటుంది. తాను అనుకున్నది సాధించాలనుకునే మనస్తత్వంతో పాటు తాను నమ్మిందే నిజమని భావించే పాత్ర నాది. నిజంగా సింగీతం శ్రీనివాస్ గారిలాంటి లెజెండరీ దర్శకుడితో కలిసి పనిచేయడం గొప్ప వరంగా భావిస్తాను.
నేను చేసే పనిని ప్రేమిస్తాను. నచ్చిన పని చేయడంలో కష్టమొచ్చినా తట్టుకొని నిలబడతాను. నాకు స్క్రిప్ట్ రాయడం, దర్శకత్వం వహించడం అంటే ఎంతో ఇష్టం. ఇవి చేయడానికి ఎంత కష్టమైనా ఎదుర్కోవాలనిపిస్తుంది. నేను నటించిన ‘మై డియర్ దొంగ’ కథ నేను రాసిందే. ఇలా విభిన్న పనులను చేయాలనుకుంటాను.
ఈ మధ్య కథలన్నీ రొటీన్‌గా ఉంటున్నాయి. మంచి కథలు, మంచి పాత్రల కోసం నేను నిత్యం ఎదురుచూస్తుంటాను. అలాంటి పాత్రలు వస్తే ప్రతి నెలా ఒక సినిమా చేయాలని ఉంటుంది. ఈ సినిమాను ఆదరించినట్లే నా కథలనూ ఆదరిస్తారనే నమ్మకమైతే ఉంది. అందుకే నా తరువాతి సినిమా కోసం నేనే కథరాస్తున్నాను. అది కామెడీ జోనర్లో సాగుతుంది. ఈ చిత్రానికి నేనే దర్శకత్వం కూడా వహిస్తాను. ప్రేక్షకులను హాయిగా నవ్వించే సినిమాలు అందించాలనే ఆలోచనతోనే ఈ నిర్ణయం తీసుకున్నా.