‘మనిషి కష్టపడితే భూమి సోమరిగా ఉండద’ని సామెత. దీనికి నిదర్శనం అస్సాం రాష్ట్రం చిరాంగ్ జిల్లా పంబారికి చెందిన 62 ఏండ్ల రైతు సరబేశ్వర్ బసుంతరి. పేదరికంతో మొదలైన ఆయన జీవితం ఇప్పుడు భారతదేశ రైతాంగానికి స్ఫూర్తిదాయకంగా మారింది. పంబారి గ్రామం మానస్ జాతీయ పార్క్ సమీపంలో ఉంటుంది. దీంతో బసుంతరి సాగుచేసే పంటలకు నిరంతరం వన్యమృగాల బెడద ఉండేది.
కాగా, 1980, 90 దశకాల్లో ఈ ప్రాంతంలో బోడో ల్యాండ్ ఉద్యమ ఆందోళనలు చెలరేగాయి. అలా ఐదో తరగతి వరకే చదువుకున్న బసుంతరి వ్యవసాయ జీవితం సవాళ్లతో మొదలైంది. ఇంతలో కొంతమంది గ్రామస్తులు తమ పొలాలను వదిలిపెట్టి, ఇతర ప్రాంతాలకు వలసవెళ్లడం ప్రారంభించారు. దాంతో ఆయన వారి పొలాలను కౌలుకు తీసుకుని సాగుచేయడానికి సిద్ధపడ్డారు.
వ్యవసాయం పట్ల బసుంతరి చూపుతున్న శ్రద్ధ స్థానిక వ్యవసాయ విభాగం వరకూ వెళ్లింది. దీంతో వాళ్లు ఆయనకు 1,700 రూపాయల ఆర్థికసాయం అందించారు. ఈ మొత్తాన్ని ఆయన తన పొలంలో ఓ చేపల చెరువు తవ్వకానికి వాడుకున్నారు. ఆ తర్వాత 2003లో బోడోలాండ్ టెరిటోరియల్ కౌన్సిల్ నుంచి అదనపు సాయం అందింది. అలా చేపల పెంపకం నుంచి నిమ్మ, అరటి, మామిడి, వక్క, లిచి, నారింజ, జామతోటల సాగువైపు మళ్లింది.
అదనంగా పందుల పెంపకమూ చేపట్టారు. ఇప్పుడాయన పొలంలో చేపల చెరువులు, పందుల శాలలు, పండ్లతోటలే దర్శనమిస్తాయి. ఓ ఇరవై మంది బృందంతో బసుంతరి ఏడాదంతా పొలంలో కష్టపడుతూనే ఉంటారు. అయితే, గతంలో తమ గ్రామంలో బతుకు గడవడం కష్టమైపోవడంతో బసుంతరి ఓ ఆరేళ్లపాటు మేఘాలయాలోని బొగ్గు గనుల్లో పనిచేయాల్సి వచ్చింది. బాల్యంలో అనుభవించిన పేదరికం, చాలీచాలని వ్యవసాయం, గనుల్లో పని ఆయనకు ఎన్నో జీవితపాఠాలను నేర్పాయి. ఆ తర్వాత తన ఊరికే వెళ్లి వ్యవసాయానికి అంకితమైపోయారు.
ఇప్పుడు వినూత్నమైన ఆలోచనలు, ఆచరణలతో ఒకప్పటి బీడుభూమిలో బంగారం పండిస్తున్నారు. అదే ఆయనకు అస్సాం రాష్ట్ర ప్రభుత్వం నుంచి ‘అస్సాం గౌరవ్’ పురస్కారం ఇవ్వడానికి కారణమైంది. ఈ ఏడాది భారత ప్రభుత్వం దేశ నాలుగో అత్యున్నత పౌర పురస్కారం పద్మశ్రీతో గౌరవించింది. ప్రస్తుతం బసుంతరి చిరాంగ్లోని మత్స్యశాఖ విభాగం, కృషి విజ్ఞానకేంద్ర సలహాసంఘంలో సభ్యుడిగా సేవలు అందిస్తున్నారు. ఎన్ని సాధించినప్పటికీ ఆయన మాత్రం ఎంతో అణకువగా ఉంటారు. పట్టుదల, కొత్త ఆవిష్కరణలకు బసుంతరి జీవితం గొప్ప ఉదాహరణ.