గౌతమ బుద్ధుడు రాజభవనం వదిలి ఒక రాత్రి తన సేవకుడు ఛన్నతో గుర్రంపై అడవిగుండా అనోమా నది వద్దకు వెళుతుంటే – ‘నువ్వేం చేస్తున్నావో తెలుసా ? రాజభవనం అంటే ఏమనుకుంటున్నావు, రాజకుమారుడిగా అద్భుతమైన జీవితాన్ని వదిలి అడవుల్లో బతుకుతావా?’ అని సేవకుడు రాజభవనంలో జీవితం గురించి వివరిస్తుంటే గౌతముడు చిరునవ్వుతో… ‘నువ్వు రాజభవనాన్ని బయటి నుంచి చూశావు, నేను అందులో నివసించాను. అదో బందీఖానా నువ్వు అనుకుంటున్నట్టు అదో అద్భుత జీవితం కాదు’ అంటాడు. మొట్టమొదటి ఉచిత వెబ్ ఆధారిత మెయిల్ అయిన హాట్ మెయిల్‌ను కనిపెట్టిన సబీర్ భాటియా కూడా ఓ ఇంటర్వ్యూలో సరిగ్గా ఇలానే మాట్లాడాడు. ఆయన మాటలు వింటుంటే గౌతముడు రాజభవనం వీడి అడవి బాట పట్టడం గుర్తుకు వస్తుంది.

డబ్బు మీద ఆసక్తి, దాని ప్రభావం ఒక దశ వరకూ ఉంటాయి. అవసరాలు తీరిన తరువాత డబ్బు మీద ప్రేమ కన్నా సమాజంపై విస్తృత ప్రభావం చూపడం పైన, మానవుల జీవితాలు మార్చడం పైన ఆసక్తి ఉంటుంది అని చెబుతారు సబీర్ భాటియా. ఆ మాటలు అనేందుకు ఆయన అర్హుడు కూడా. ఎందుకంటే ముప్పై ఏండ్లు రాకముందే వేల కోట్ల రూపాయలను చూశారు మరి! ఆ తర్వాత ఎన్నో అంశాలనూ పరిశీలించారు. అది ఆయన అనుభవం. ఈ రోజుల్లో మెయిల్ లేనిదే మనకు జీవితం గడవదు. అలాంటి మెయిల్
ఆవిష్కర్త, మనకు మెయిల్ సేవలను ఉచితంగా అందజేసిన మెయిల్ బ్రహ్మ ఈ భాటియా.
మనం ఇప్పుడు విరివిగా ఉపయోగించే ఈ మెయిల్ 1995 ప్రాంతంలో లేదు. ఐటీ కంపెనీలు తమ కంపెనీలోని కంప్యూటర్ల నుంచి కంపెనీ వారికే మెయిల్ చేసుకోవడం తప్ప ప్రస్తుత వెబ్ ఆధారిత ఈ మెయిల్ ఉండేది కాదు. సబీర్ భాటియా తన సహోద్యోగి, మిత్రుడు జాక్ స్మిత్ తో కలిసి వెబ్ ఆధారిత ఈ మెయిల్ హాట్ మెయిల్‌ను సృష్టించాడు. తమ అవసరమే తమకు ఈ మెయిల్ సృష్టించే అవకాశం కల్పించింది అని చెబుతాడు భాటియా. ఒకసారి పనిచేసే చోట ఏవో కారణాల వల్ల వీళ్లు ఉపయోగించే మెయిల్‌ను బ్లాక్ చేశారట. దీంతో ఎక్కడి నుంచైనా వినియోగించుకునేలా వెబ్ ఆధారంగా పనిచేసే మెయిల్‌ను తామే సొంతంగా తయారు చేసుకున్నారు.
ఈ ఆలోచనను విస్తరించేందుకు ప్రయత్నాలు మొదలు పెట్టారు. వీళ్లేమో అమెరికాలో ఉద్యోగులు. పెద్దగా పెట్టుబడి లేదు. 19 మంది వెంచర్ క్యాపిటలిస్ట్‌లను కలిస్తే చివరకు ఒక్కరు మూడు లక్షల డాలర్లు ఇన్వెస్ట్ చేయడానికి ముందుకు వచ్చారు. ఉచిత ఈ మెయిల్ గురించి భాటియా మిత్రులు, బంధువులు అందరికీ పరిచయం చేశాడు. అమెరికాలో జర్నలిస్ట్‌లను కలిసి వారికి ఉచిత ఈ మెయిల్ ఓపెన్ చేసి ఇచ్చేవాడు. అమెరికాలోని బిజినెస్ వీక్ పత్రికలో ‘ఉచిత ఈ మెయిల్’ అనే శీర్షికతో పెద్ద వార్త వచ్చే సరికి అప్పటి వరకు రోజుకు వెయ్యి, రెండు వేల మంది అకౌంట్ ఓపెన్ చేసేవారు. పత్రికలో వచ్చాక రోజుకు పది వేల మంది కొత్తగా అకౌంట్ ఓపెన్ చేశారు.
1995 అక్టోబర్‌లో ఈ మెయిల్ గురించి ఆలోచన రాగా, అన్ని ఏర్పాట్లు చేసుకొని స్మిత్‌తో కలిసి 1996లో హాట్ మెయిల్ ప్రారంభించారు. 1997లో మైక్రోసాఫ్ట్ స్థాపకుడు బిల్ గేట్స్ నుంచి పిలుపు వచ్చింది. హాట్ మెయిల్ పని తీరుపై ప్రజెంటేషన్ తరువాత బిల్‌గేట్స్ భాటియాతో మనం కలిసి పని చేద్దాం, లేదంటే మైక్రో సాఫ్ట్ సొంతంగా మెయిల్ తయారు చేస్తుంది అని చెప్పారు. 350 మిలియన్ డాలర్లకు హాట్ మెయిల్‌ను కొనేందుకు బిల్ గేట్స్ ఆఫర్ ఇస్తే భాటియా తిరస్కరించారు. 450 మిలియన్ డాలర్లు కావాలి అని ప్రతిపాదించారు. అంటే ఇప్పటి లెక్క ప్రకారం 3,814కోట్ల రూపాయలు. ‘ఈ బేరం ఆడుతున్న సమయంలో నా బ్యాంకులో కేవలం ఐదు వేల డాలర్లు ఉన్నాయి. అంటే ఇప్పటి లెక్క ప్రకారం నాలుగున్నర లక్షల రూపాయలు.
ఏ ధైర్యం, ఏ శక్తి బిల్ గేట్స్ ప్రతిపాదనను తిరస్కరించేట్టు చేసిందో తెలియదు కానీ తల్లిదండ్రులు, బంధువులు, ఉద్యోగులు, స్మిత్ అంతా నన్ను దోషిగా చూశారు. చివరకు నేను కూడా తప్పు చేశానా? అని నన్ను నేను నిందించుకున్నాను. వారం తరువాత గేట్స్ ప్రతినిధుల నుంచి మళ్లీ కబురు అందింది. మనసులో ఎలా ఉన్నా బేరంలో తగ్గలేదు. చివరకు 450 మిలియన్ డాలర్లకు హాట్ మెయిల్‌ను మైక్రోసాఫ్ట్ కొనుగోలు చేసింది’ అంటూ అప్పటి విషయాలను గుర్తు చేసుకుంటారు భాటియా. 3,814 కోట్ల రూపాయల ఆస్తి ఉన్న భాటియా వయసు అప్పుడు కేవలం 29 సంవత్సరాలు మాత్రమే. ఆ సమయానికి పెళ్లి కూడా కాలేదు.
భాటియాది చండీగఢ్. తండ్రి సైనికాధికారి. తల్లి బ్యాంకు ఉద్యోగి. 1968లో జన్మించాడు. బిట్స్ పిలానీ చదివి అమెరికాలోని సిలికాన్ వ్యాలీలో ఐటీ కంపెనీలో చేరారు. హాట్ మెయిల్ అమ్మిన తరువాత అమెరికాలో విలాసవంతమైన జీవితం గడిపారు. పెద్ద పెద్ద కార్లే కాదు సొంతానికి ఒక విమానం కూడా కొన్నారు. ఇప్పుడు భాటియా వయసు 56 సంవత్సరాలు. ఆనాటి విలాసవంతమైన జీవితం, పడవలాంటి కార్ల గురించి అడిగితే ‘ఆ కార్లు, విమానాలు, షిప్‌లు అన్నీ ఉట్టి బొమ్మలు అంటారు’ వేదాంత ధోరణిలో. వాటన్నింటిలో తిరిగాక, తరువాత ఏమిటీ? అనే ప్రశ్న తనను ఆలోచనలో పడేసింది అంటూ చెప్పుకొస్తారు.
హిందూ ఫిలాసఫీ గొప్పది, ఇదంతా మాయ అంటారు. ఈ విలాసాలు ఏవీ నాకు సంతృప్తిని ఇవ్వలేదు. మనుషులతో అనుబంధాలకు మించిన సంపద లేదని చెబుతారు. సంపద అవసరమే కానీ ఒక్క సంపద మాత్రమే సంతృప్తిని ఇవ్వదు. ఈ మానవ జాతిపై మనదైన ముద్ర ఉండాలి అనే తపన కొత్త వాటిని ఆవిష్కరించేట్టు చేస్తుంది. అమెరికాలో ఉన్నట్టు మన దగ్గర కొత్త ఆలోచనలకు అవకాశాలు తక్కువ. సిలికాన్ వ్యాలీలో వంద స్టార్టప్‌లకు ఒకటి రెండు విజయవంతం అయినా వెంచర్ కాపిటలిస్ట్ ఇన్వెస్ట్ చేయడానికి ముందుకు వస్తారని, మన దేశంలో మాత్రం.. ఎంత ఇన్వెస్ట్ చేస్తున్నారు, ఎంత లాభం అని అప్పటికప్పుడే లెక్కలు వేసుకుంటారని భారత్‌లోని పరిస్థితిని వివరిస్తుంటారు.
సత్య నాదెళ్ల , సుందర్ పిచాయ్లాంటి వారు గొప్ప మేనేజర్లే కానీ ఆవిష్కర్తలు కాదనీ, మన సాఫ్ట్వేర్ కంపెనీలు ఐటీ కార్మికులతో పని చేయిస్తున్నాయి కానీ కొత్త ఆవిష్కరణలు చేయడం లేదని నిర్మొహమాటంగా చెబుతారు. హాట్ మెయిల్ అమ్మిన తరువాత వచ్చిన మొత్తంతో పలు కంపెనీల్లో ఇన్వెస్ట్ చేశారాయన.
విలాసవంతమైన జీవితంపై తనకు ఆసక్తి పోయిందనీ, సంతృప్తికరమైన జీవితం గడుపుతున్నాననీ చెబుతారు. ప్రపంచంలో అత్యధిక శాతం యువత మన దేశంలోనే ఉంది. వీళ్లే కొత్త వాతావరణానికి ఆవిష్కరణలకు శ్రీకారం చుడతారు అని ఆశిస్తున్నా అని చెప్పే ఆయన, తనదైన శైలిలోనూ వినూత్న ఆలోచనలు చేస్తూ ప్రస్తుతం ఇండియాలోనే గడుపుతున్నారు.
– బుద్దా మురళి, 98499 98087