విప్లవ చైతన్యం
ఆశ్చర్యకరంగా ఓ రోజు బుచ్చిరెడ్డి సార్ మా ఇంటికి వచ్చారు. బుచ్చిరెడ్డి సార్ అంటే నేను చదువుకున్న గవర్నమెంట్ స్కూల్లో టీచర్. ఆయన నాకెప్పుడూ చదువు చెప్పలేదు. కానీ, నా టెన్త్ అయిపోయి నేను ఆ స్కూల్ నుంచి వెళ్లిపోయాక బదిలీ మీద వచ్చారు.
చదువు నేర్పిన రోజుల్లో- 4, రమాయణం
గంగుల బుచ్చిరెడ్డి సార్ వాళ్లది మా ఊరి పక్కన ఉన్న రాఘవపూర్. ఆయన భార్య ఇందిర కూడా గవర్నమెంట్ టీచర్. భార్యాభర్తలిద్దరూ మా స్కూల్లోనే పనిచేసే వారు. ఇందిరా టీచర్ చాలా అందంగా ఉండేది. నాకైతే ఆమెను చూస్తే సినీ నటి కాంచన గుర్తుకొచ్చేది. ఆమె చాలా మంచి టీచర్ అనీ, స్ట్రిక్టుగా ఉంటుందనీ పేరు తెచ్చుకుంది. అందుకు పూర్తి విరుద్ధంగా బుచ్చిరెడ్డి సార్ ఉండేవాడు. ఆయన చదువు చాలా బాగా చెప్పేవాడనీ, పిల్లలతో ఎక్కువ చనువుగా ఉండేవాడనీ, వాళ్లని స్నేహితుల్లాగా చూసేవాడనీ, పిల్లలతో జోకులేస్తూ సరదాగా ఉండేవాడనీ అందరూ చెప్పేవారు. అంతేకాదు, ఆయనది చాలా హెల్పింగ్ నేచర్. ఎంతోమంది పేద విద్యార్థులకు చదువుకోడానికి సహాయం చేసేవాడు. పుస్తకాలకు గానీ , ఫీజులకు గానీ చాలా ఆర్థిక సహాయం అందించేవాడు. ఎంతో మందికి ఫీజులు కట్టేవాడు, నోట్ బుక్స్, పుస్తకాలు, పెన్నులు, పెన్సిళ్లు కొనిచ్చేవాడు అని అందరూ అనుకునేవారు.
అమ్మాయిలందరికీ బుచ్చిరెడ్డి సార్ అంటే ఆరాధనా భావం ఉండేది. ఎందుకంటే అప్పట్లో ఉండే మగటీచర్ల లాగా కాకుండా ఆయన కొంచెం మోడ్రన్‌గా, స్మార్ట్‌గా కనిపించడమూ, స్టూడెంట్ ఫ్రెండ్లీగా ఉండటం వల్లనేమో! అప్పట్లోనే ఆయన టీ షర్టులు వేసుకుంటూ ఉండేవాడు. తన స్టూడెంటూ, మా కజిన్ సంధ్య వాళ్ల ఇంటికి కూడా ఆయన తరచూ వచ్చి వెళుతుండేవాడు. అప్పుడప్పుడు కథల పుస్తకాలు, నవలలు వాళ్ల అమ్మ చదవడానికి సార్ వాళ్లింటి నుంచి సంధ్య తెచ్చుకుంటూ ఉండేది. ఆయనకు సంధ్య అంటే వాత్సల్యం ఉండేది. మా ఇంటి పక్కనే గనుక ఆయన్ని ఎప్పుడైనా చూసినప్పుడు ‘ఈయన ఎవరిలాగానో ఉంటాడబ్బా, ఎవరు..ఎవరు?’ అని అక్కా, నేనూ అనుకున్నాక తోచింది ఏమిటంటే ఆయన హిందీ హీరో వినోద్ మెహ్రాలా, అప్పుడప్పుడూ రాజేంద్ర కుమార్లా అనిపించేవాడు.
ఈ క్రమంలో బుచ్చిరెడ్డి సార్ మా ఇంటికి ఓరోజు రావడం నాకు కొంచెం ఆశ్చర్యాన్ని కలిగించింది. ఇంతకూ ఆయన వచ్చిన పని ఏంటంటే వాళ్ల పిల్లలిద్దరికీ ట్యూషన్ చెప్పమని. నేను కొంచెం తటపటాయించి సార్! మీరిద్దరూ టీచర్లే, ఇంట్లో చెప్పుకోవచ్చు కదా! అందులోనూ మీ పిల్లలు చిన్న క్లాసుల వాళ్లు, ఇక్కడేమో నేను చెప్పేది సెవెంత్ నుంచి పై క్లాసుల వాళ్లకి. చిన్నపిల్లలు ఇంత దూరం ఏం నడుస్తారు? అన్నాను. నేను ఇంటర్ పూర్తి చేసి, డిగ్రీ చదువుకుంటున్నాను, వాళ్లేమో డిగ్రీ, బీఈడీ చేసినవాళ్లు. ఆయన అడిగితే నాకు ఏమనాలో తోచలేదు. వెంటనే ఆయన లేదమ్మా! డిగ్రీలు ఉండటం ముఖ్యం కాదు, పిల్లలకు అర్థమయ్యేలా చెప్పడం ముఖ్యం. మీరు చాలా బాగా చదువు చెప్తారని అందరూ అనుకుంటున్నారు. అంతేకాదు, తల్లిదండ్రులు టీచర్లు అయినంత మాత్రాన సొంత పిల్లలకు ఏమీ చదువు చెప్పుకోలేరు. పిల్లలు వినరు కూడా! మీరే ఎట్లా అయినా వీలు చేసుకొని చెప్పండి అని అడిగారు. నేను కాదనలేకపోయాను.
వాళ్లకు ఇద్దరు అబ్బాయిలు విప్లవ్, చైతన్య. చాలా ముద్దుగా, హిందీ సినిమాల్లో చిన్నపిల్లల్లా ఉండేవారు. ఎందుకంటే హిందీ సినిమాల్లో అప్పటికే మగపిల్లలకు ఎరుపు, పసుపు, ముదురు నీలం లాంటి రంగుల టీ షర్టులు, డిజైనర్ షర్టులు, టైటు నిక్కర్లు వేసేవారు. తెలుగు సినిమాల్లో చిన్నపిల్లల పాత్రలకు లూజు నిక్కర్లు, పెద్దవాళ్లకు లాగా ప్లెయిన్ షర్టులు, గళ్ల అంగీలు వేసేవాళ్లు. ఈ విప్లవ్, చైతన్యలు ఇద్దరూ రంగు రంగుల టీ షర్టులూ, రెడీమేడ్ షర్టులూ, ప్రింటెడ్వీ, పొట్టి పొట్టి నిక్కర్ల్లు వేసుకునేవాళ్లు.
బుచ్చిరెడ్డి సార్ ఇంకొక మాట కూడా అన్నారు ‘ఇదేందీ.. మీరు నైంత్, టెంత్ పిల్లలకు ఒక్కొక్కళ్లకూ పది రూపాయలు తీసుకుంటారట!’ అని. ఎక్కువ తీసుకుంటున్నానని అంటాడా అని నాకు భయమేసింది. ‘ఏమో సార్! వాళ్లంతట వాండ్లే అట్ల ఇస్తమన్నారు. అసలు మొట్టమొదటి పేరెంట్ అట్ల డిసైడ్ చేసిన్రు. నేను ఏమీ డిమాండ్ చెయ్యలేదు‘ అన్నాను. ఆయన నవ్వి ‘అయ్యో! టీచర్! నేను మీ కొరకే చెప్తున్న, మీరు పడే శ్రమకు, మీరు పిల్లలకు శ్రద్ధగా చెప్పే చదువుకు మీరు తీసుకునేది శాన తక్వ! అదిగాక మీరు పొద్దున, సాయంత్రం రెండు పూటలు చెప్తరు కదా! అందుకు పది రూపాయలు నథింగ్! నేను నా పిల్లల్ని ఒక్క సాయంత్రం పూటనే పంపిస్తాను. నేను చెరి ఇరవై రూపాయలు ఇస్తాను’ అన్నారు.
‘అయ్యో ! అంత ఫీజు ఏమొద్దు సార్! మీ వాళ్లు చిన్న పిల్లలే కదా!’ అని మొహమాటంగా అన్నాను ఈయనేంది మా నాన్న లాగా ఇంత ఉదారంగా ఉన్నాడు అనుకుంటూ. ‘మీరు ఓ పని చేయండి టీచర్ ! ఇవ్వగలిగిన వాళ్ల దగ్గర, పెద్ద క్లాసుల వాళ్లకు కొంచెం ఎక్కువ తీసుకోండి ఒకళ్లిద్దరు బీదవాళ్లకి ఉచితంగా చెప్పండి. అప్పుడు అర్హులైన వాళ్లకి మీ విద్య అందుతుంద’ని చెప్పాడు. ‘నేను ఫ్రీగా నలుగురికి చెప్తూనే ఉన్నాను సార్!’ అన్నాను. అది ముందు నుంచి కూడా నేను పాటించాను. మొత్తానికి విప్లవ్, చైతన్యలు మా ఇంటికి రావడం మొదలైంది.
– నెల్లుట్ల రమాదేవి, రచయిత్రి
Read Today's Latest Sunday News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Amur Falcons | ఏకంగా 23 దేశాలను చుట్టి మణిపూర్‌కు తిరిగొచ్చిన అమూర్ ఫాల్కన్స్..!
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం

