జ్ఞాపకాలు మనుషులకు మాత్రమే… జంతువులకు ఉండవేమో అనుకుంటాం. అయితే, మనలాగే జీవ పరిణామ క్రమంలో మనకు దగ్గరి బంధువులైన చింపాంజీలకూ జ్ఞాపకాలు ఉంటాయని ఒక అధ్యయనం ఒకటి వెల్లడించింది. అదీ సుదీర్ఘకాలంపాటు చెరిగిపోకుండా ఉండిపోతాయట. వివిధ దేశాల్లో ఉన్న చింపాంజీలను పరిశీలించిన పరిశోధకులు ఈ నిర్ధారణకు వచ్చారు. అంతేకాదు, వాటి మెదళ్లలో బయటపడని మరెన్నో స్మృతులు కచ్చితంగా దాగి ఉండవచ్చనీ అంటున్నారు.
అది 2015 సంవత్సరం. అమెరికాలోని నార్త్ కరోలినా జూలో డాక్టర్ లారా లెవిస్ పరిశోధకురాలిగా పనిచేస్తున్నారు. అప్పుడామెకు కెండాల్ అనే మగ చింపాంజీతో దోస్తానా కుదిరింది. పరిశోధనలో భాగంగా ఆమె తరచుగా చింపాంజీల ఎన్క్లోజర్లను సందర్శించేది. తన ఎన్‌క్లోజర్ దగ్గరికి రాగానే కెండాల్ లారా చేతుల్ని తన చేతుల్లోకి తీసుకునేది. గోళ్లను పరిశీలించేది. ఆ తర్వాత పరిశోధనలో భాగంగా ఆమె బబూన్ల (గండుకోతులు)ను అధ్యయనం చేయడానికి ఆఫ్రికా ఖండానికి వెళ్లాల్సివచ్చింది.
ఆ తర్వాత కొన్ని నెలలకు నార్త్ కరోలినాకు తిరిగివచ్చిన తర్వాత కూడా కెండాల్ తనను గుర్తించడం చూసి లారా ఆశ్చర్యపోయింది. దాని ఎన్‌క్లోజర్‌లోకి అడుగుపెట్టగానే లారా చేతుల్ని తన చేతుల్లోకి తీసుకునేందుకు ప్రయత్నించింది. “నాలుగు నెలలు గడిచిన తర్వాత కూడా కెండాల్ నన్ను గుర్తించడం ఎంతో ఆశ్చర్యపర్చింది” అంటారు లారా. ఆమె ప్రస్తుతం యూనివర్సిటీ ఆఫ్ కాలిఫోర్నియాలో సైకాలజిస్ట్‌గా పనిచేస్తున్నారు. అయితే అప్పట్లో ఈ విషయాన్ని నిరూపించడానికి తన దగ్గర తగిన ఆధారాలేవీ లేవంటారు. ఇప్పుడు మాత్రం పాతికేండ్ల తర్వాత కూడా చింపాంజీలు, బనోబో (చింపాంజీని పోలిన ఓ జాతి వానరం)లు ఇతర తోకలేని వానరాలైన ఏప్స్‌ను బాగా గుర్తుపెట్టుకుంటాయని లారా బృందం ఆధారాలతో నిర్ధారణ చేసింది.
తమ అధ్యయనంలో భాగంగా లారా తన సలహాదారుడు క్రిస్ క్రుపెన్యేతో కలిసి స్కాట్లాండ్లోని ఎడింబర్గ్ జూ, జపాన్‌లోని కుమమొటో అభయారణ్యం, బెల్జియంలోని ప్లాంకెన్డేల్ జూలో ఉన్న 26 తోకలేని వానరాల మీద అధ్యయనం చేశారు. ఇందులో చింపాంజీల ఎన్క్లోజర్ల దగ్గర కంప్యూటర్లను ఉంచి కొన్ని జంతువుల చిత్రాలను ప్రదర్శించారు. అంతేకాదు ఫొటోలను చూస్తూ జూస్ తాగడానికి అనువుగా వాటికి దగ్గర్లో స్ట్రా కూడా ఉంచారు. వాటి ప్రవర్తన గమనించడానికి పరిశోధకులు ఇన్ఫ్రారెడ్ కెమెరాలను ఉపయోగించుకున్నారు. ఇలా ఫోటోలను గమనించడంలో చింపాంజీలు తాము ఇంతకుముందు చూసిన జంతువులను మామూలు కంటే ఎక్కువసేపు చూస్తూ ఉండిపోయాయి.
అంతేకాదు చింపాంజీలు, బనోబోల్లో జ్ఞాపకాలు చాలాకాలం పదిలంగా ఉంటాయని చెప్పడానికి కుమమొటో అభయారణ్యంలో ఉండే 46 ఏండ్ల లూయీస్ అనే బనోబోను మరో బలమైన ఉదాహరణగా పేర్కొంటారు లారా. లూయీస్ 1992 వరకు అమెరికాలోని శాన్‌డీగో జూలో తన సోదరి, మేనల్లుడు వరసయ్యే చింపాంజీలతో కలిసి ఉండింది. ఆ తర్వాత దాన్ని మొదట సిన్సినాటి జూ, 2014లో కుమమొటో అభయారణ్యానికి తరలించారు. 2019లో లారా కుమమొటోలో జరిపిన పరిశోధనలో లూయీస్ తన పాత బంధువుల చిత్రాలను చాలాసేపు తదేకంగా చూసిందట. అలా 26 ఏండ్లు గడిచిపోయినా గతకాలపు జ్ఞాపకాలను అది ఏమాత్రం మర్చిపోలేదట. చింపాంజీల కండ్ల కదలికలను గమనిస్తే మనకు వాటి మెదళ్లలో నిక్షిప్తమైన విషయాలు కొన్ని మాత్రమే తెలుస్తాయంటారు లారా. మనం పసిగట్టలేని స్మృతులు మరెన్నో ఉండొచ్చు అంటారామె.
చింపాంజీలు పరిణామ క్రమంలో మనుషులకు దగ్గరగా వచ్చే జీవులు. మనుషుల్లాగే వీటి ప్రవర్తన కూడా సామాజికంగా ఉంటుంది. తోటి చింపాంజీలతో జట్లుగా బతికేస్తాయి. ఆధిపత్యం చెలాయిస్తాయి. మనుషుల్లానే పరికరాలను ఉపయోగిస్తాయి. సమూహాలుగా జీవించే చింపాంజీలు రోజువారీ పనులను వేర్వేరు గుంపులుగా విభజించుకుని చేసుకుంటాయి. మగ చింపాంజీలు జట్లను ఏర్పాటు చేసుకుంటాయి. తమ సామాజిక హోదా మెరుగుపర్చుకునేందుకు ప్రయత్నిస్తుంటాయి. ఇతర గుంపుల నుంచి తమ గుంపును మగ చింపాంజీలు ముందుండి రక్షిస్తాయి.
అప్పుడప్పుడు దూకుడుగా వ్యవహరిస్తాయి. అంతేకాదు వీటికి తమకే ప్రత్యేకమైన వ్యక్తిత్వాలు కూడా ఉంటాయని పరిశోధనలు వెల్లడిస్తున్నాయి. మగవాటి కంటే ఆడ చింపాంజీలు నమ్మకంగా, బిడియంగా ఉంటాయట. వేరేవాటి నుంచి నడవడికను కూడా నేర్చుకుంటాయట. కొన్ని ఆధారాల ప్రకారం చింపాంజీలు మనుషుల సంజ్ఞలను కూడా నేర్చుకోగలవు. గింజలు లాంటివి పగల గొట్టడానికి ఇవి రాతి పరికరాలను ఒడుపుగా ఉపయోగిస్తాయి.