ప్రముఖ ఆధ్యాత్మిక గురువు శ్రీశ్రీ రవిశంకర్ ప్రపంచవ్యాప్తంగా ఎంతోమందికి స్ఫూర్తిప్రదాత. నవతరం జంటల్లో వైవాహిక బంధం మూణ్నాళ్ల ముచ్చటగా మారుతున్న తరుణంలో… ఆనందంగా సాగిపోయే వైవాహిక జీవితం కోసం ఆయన ప్రవచించిన ఎనిమిది చిట్కాలు.
సంతోషకరమైన వైవాహిక జీవితానికి భాగస్వాములు నిబద్ధతతో ఉంటూ, ఒకరికొకరు సహకారం అందించుకుంటూ, సహానుభూతితో మెలగాలి. ఒకరి బాగోగులు ఒకరు పట్టించుకోవడం, అహం తక్కువగా ఉండటం, కష్టాల్లో అండగా నిలవడం అత్యవసరం. కాబట్టి భార్యాభర్తలు సహచరులుగా మసలుకుంటూ ముందుకు వెళ్లాలి.
విజయవంతమైన బంధంలో దంపతులు “నేను నీకోసం ఉన్నాను. కాబట్టి కష్టసుఖాల్లో నా దగ్గర సాంత్వన పొందు! పరిస్థితులు ఎలాగున్నా నేను ఉన్నాను” అనే భరోసా ఇస్తారు.
పెళ్లికి ముందైనా, ఆ తర్వాతైనా ఆధిపత్య లక్షణం మంచిది కాదు. మీ భాగస్వామిని గుప్పిట్లో పెట్టుకోవాలనుకోవడం అంత
తెలివైన ఆలోచన కానే కాదు. మీరు ఒకవేళ ఆధిపత్యం చలాయించాలని అనుకుంటే మాత్రం ప్రతికూల ఆలోచనలు ఒక్కొక్కటిగా దాడిచేస్తూ ఉంటాయి. కాబట్టి, జాగ్రత్తగా ఉండాలి.
ఏదో కోల్పోయినట్టుగా ముఖం పెట్టుకుని, తమను ఎదుటివారు బుజ్జగించాలని ఆశించేవారిని చూస్తే భాగస్వాములు అక్కడినుంచి తప్పుకొంటారు. ఇలాంటి తత్వం అప్పుడప్పుడు బాగానే ఉంటుంది. కానీ, పదేపదే అంటేనే మీకు, మిమ్మల్ని ఇష్టపడే వారికి ఇబ్బందికరంగా పరిణమిస్తుంది.
భాగస్వాముల్లో ఒకరు ఏదైనా విషయంలో కోపానికి వచ్చినప్పుడు ఇంకొకరు మౌనంగా ఉండాలి. తగిన సందర్భం చూసి వివరణ ఇచ్చుకోవాలి. అయితే, ఇద్దరూ ఒకేసారి కోపోద్రిక్తులై పోయారంటే మాత్రం ఏదో సమస్య ఉన్నట్టే. కాబట్టి, మాట్లాడేటప్పుడే బాగా ఆలోచించుకోవాలి.
సహజంగా, సరళంగా ఉండాలి. భాగస్వామిని ఎలాగైనా సరే ఆకట్టుకోవాలని బలంగా ప్రయత్నించకూడదు. ఇలా చేస్తే పరిస్థితులు అదుపు తప్పుతాయి. కాబట్టి మీ వరకు మంచిగా ఉండటానికి ప్రయత్నించాలి. సహజంగా, క్షమించే హృదయంతో, వర్తమానంలో ఉండాలి. ఇది పరిస్థితుల్లో ఎంతో మార్పును తీసుకువస్తుంది.
ఇక దంపతులు ఇద్దరూ ఎప్పుడూ ఒకరిపై ఒకరు దృష్టి పెట్టేకంటే, ఇద్దరూ తమవైన లక్ష్యాలను నిర్దేశించుకుని కలిసి ముందుకుసాగాలి. ఆ లక్ష్యం కూడా ఉన్నతంగా, సమాజానికి మేలుచేసేదిగా, ఒకరిపట్ల ఒకరికి ప్రేమను పెంచేదిగా ఉంటే మంచిది.
మీ భాగస్వామి మిమ్మల్ని ప్రేమిస్తున్నట్టు ఎప్పుడూ కూడా రుజువులు అడగకూడదు. వాళ్లు మిమ్మల్ని ప్రేమిస్తున్నారనే భరోసాతో ఉండాలి. వసంతం మళ్లీ మళ్లీ వస్తూ పోతూ ఉంటుంది. జీవితంలో ఓ సందర్భంలో కొంత ఎడం వచ్చినా మళ్లీ బంధం బలపడుతుంది.