తగ్గిన దూరం.. పెరిగిన వేగం..
భూగోళంపై ఆవలివైపున ఉండే అమెరికాకు మనోళ్లు పదిహేను గంటల్లో చేరుకుంటున్నరు. ప్రయాణం వేగం అందుకున్నది. ప్రపంచం అంతే వేగంగా మారిపోతున్నది. ఈ మార్పు అందరి జీవితాల్లోకి రాలేదు. వేగం కొంతమందికి కలగానే మిగిలిపోయింది.
భూగోళంపై ఆవలివైపున ఉండే అమెరికాకు మనోళ్లు పదిహేను గంటల్లో చేరుకుంటున్నరు. ప్రయాణం వేగం అందుకున్నది. ప్రపంచం అంతే వేగంగా మారిపోతున్నది. ఈ మార్పు అందరి జీవితాల్లోకి రాలేదు. వేగం కొంతమందికి కలగానే మిగిలిపోయింది. అర్జీ కోసమో, ఆర్డర్ కోసమో, ఇంకో పనిమీదో జిల్లా ఆఫీసర్ల దగ్గరికి పోవాల్నంటె నరకం చూడాల్సిందె. ఒక రోజు ప్రయాణం చేసే దుస్థితిలో కోట్ల మంది మగ్గిపోతున్న కాలమది. ఈ ఆఫీసుకు పోతే ఆ ఆఫీసుకు పొమ్మని, ఆ ఆఫీసుకు పోతే ఇంకో ఆఫీసర్ని కలవమని నరకం చూపించేటోళ్లు. చిన్న పనికి రెండు మూడు రోజులు పాట్లు పడాల్నంటే పేదోళ్లకు ఎంత కష్టమో. బస్టాండ్‌లో నిద్ర ఎంత కష్టం? రోడ్డుపక్కన ఒంటికి.. రెంటికి పోవుడు ఎంత బాధ!
సాంకేతికతే జీవితాన్ని మార్చదని, వ్యవస్థలు కూడా మారినప్పుడే అందరి పనులూ వేగమందుకుంటయని గ్రహించిన దార్శనిక పాలకుడు జిల్లాలను విభజించిండు. పట్నంల అక్కడొక ఆఫీసు, ఇక్కడొక ఆఫీసు లేకుండా అన్ని ఆఫీసులు ఒక్కోచోట కట్టి.. దశాబ్దాల తరబడి కాళ్లరిగేలా తిరిగిన సామాన్యుడు సేదతీరేలా సమీకృత కార్యాలయాలూ కట్టించిండు. పొద్దెక్కేలోపట పల్లె రైతు జిల్లా కేంద్రం పోతున్నడు. పొద్దుగూకే సరికి మళ్లీ ఇంటికి చేరుకుంటున్నడు. చిన్న జిల్లాలతో సామాన్యుల పనులే కాదు ప్రగతీ వేగమందుకున్నది. సమీకృత జిల్లా కార్యాలయాల నిర్వహణ అనుకున్నట్టే సామాన్యుడి భారాన్ని తగ్గించింది. సంక్షేమానికి బాటలేసింది.

Integrated District Office
పాత పది జిల్లాల్లో సరిహద్దు గ్రామాలు, మారుమూల ప్రాంతాలు, అటవీ ప్రాంతాల్లో నివాసం ఉండేటోళ్లు జిల్లా కేంద్రానికి చేరుకోవాల్నంటే వందల కిలో మీటర్లు దూరం పోవాల్సి వస్తుండె. జిల్లాలు విభజించక మునుపు ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో ఉన్న కోటపల్లి, వేమనపల్లి, చెన్నూర్ ప్రాంత ప్రజలు జిల్లా కేంద్రానికి చేరుకోవాలంటే 210-230 కిలోమీటర్ల దూరం పోవాల్సి వచ్చేది. జిల్లా కేంద్రానికి పోయిరావటానికి రెండు, మూడు రోజులు పట్టేది. బస్సు లేక, ఉన్నా రాక… కొంత దూరం కాలిబాటన నడుచుకుంట పోయిన రోజులూ ఉన్నయి. బస్సులు ఎక్కుడు దిగుడే కాదు ఎగుడు దిగుడు తొవ్వల ఎత్తికుదేసుకుంట బస్సు తీసుకపోయే సరికి చీకటి పడేది. బస్టాండ్‌లోనే ఉండేటోళ్లు. ఆడనే పడుకునేటోళ్లు. ‘లెవ్వు లెవ్వు’ అని పోలీసోళ్లు కీసుపిట్ట ఊదినా.. మొండికేసి ఉండేటోళ్లు.
జాలిలేని అధికారులు, పోలీసులు అవమానించే రోజులవ్వి. ప్రజల దగ్గరకు చేరుకోలేని పాలన జనాన్ని అట్ల రోడ్లపాలు చేసింది. పట్టా కాగితం కోసం కాళ్లరిగేటట్టు తిరిగే బక్క రైతు బాధలు రెవెన్యూ అధికారులకు అర్థం కాకపొయ్యేది. వికలాంగుల సర్టిఫికెట్ కోసం నడువలేనివాళ్లను నడిపించి, నిలుసోలేనోళ్లను నిలబెట్టిన గొప్ప యంత్రాంగం అది. ఇక ప్రభుత్వం గుడ్డిది, కుంటిది. దాని కళ్లు తెరిపించిన రోజు 2016 అక్టోబర్ 11. మారుమూల ఆ పల్లెలు కొత్త జిల్లాలో జిల్లా కేంద్రానికి దగ్గరైనయ్.
జిల్లాకో ఖిల్లా
కేసీఆర్ ప్రభుత్వం కొత్త జిల్లాల ఏర్పాటే కాదు జిల్లా పాలనలో సంస్కరణలు తెచ్చింది. ప్రతి జిల్లా కేంద్రంలో సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయ (ఐడీవోసీ- ఇంటిగ్రేటెడ్ డిస్ట్రిక్ట్ ఆఫీసెస్ కాంప్లెక్స్) నిర్మాణానికి పూనుకున్నది. జిల్లా కేంద్రంలో అన్ని ప్రభుత్వ కార్యాలయాలు ఒకేచోట నిర్వహించేందుకు మూడు అంతస్తులతో 1.5 లక్షల చదరపు అడుగుల విస్తీర్ణంలో ఐడీవోసీ నమూనాని తెలంగాణ ప్రభుత్వం ఆమోదించినది. ప్రతి ఐడీవోసీ నిర్మాణం కోసం 15 నుంచి 30 ఎకరాల భూమిని కేటాయించింది. రాష్ట్రంలోని 30 జిల్లాల్లో రూ.1581.62 కోట్ల అంచనా వ్యయంతో బడ్జెట్ కేటాయించింది. ఒక్కో ఐడీవోసీ నిర్మాణానికి రూ.45 కోట్ల నుంచి రూ.65 కోట్లు ఖర్చు చేసింది. కేసీఆర్ పాలనలో 25 జిల్లాల్లో సమీకృత జిల్లా కార్యాలయాలు సముదాయాల నిర్మాణం యుద్ధ ప్రాతిపదికన పూర్తయినయి. కేసీఆర్ సర్కార్ మంజూరు చేసిన నిధులతో ములుగు జిల్లా ఐడీవోసీ నిర్మాణం పూర్తైంది. ఆ ప్రాంగణాన్ని 2026 ఆగస్టు 16న ప్రస్తుత ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రారంభించినరు. వరంగల్, కరీంనగర్ జిల్లా ఐడీవోసీల నిర్మాణం కోసం కేసీఆర్ ప్రభుత్వం నిధులు కేటాయించింది. వాటి నిర్మాణం కూడా పూర్తయింది. కేసీఆర్ సర్కార్ తలపెట్టిన పనుల్లో రేవంత్ సర్కార్ రిబ్బన్ కటింగ్ సభలు జరుపుకొంటన్నది. సంగారెడ్డి, నల్లగొండ, హైదరాబాద్ జిల్లాల్లోనే పాత పద్ధతిలో ప్రభుత్వ కార్యాలయాలు పని చేస్తున్నయి.
ఒక్క పాదులో శాఖోపశాఖలు!
జిల్లా పరిపాలనకు ప్రధాన అధికారి కలెక్టర్. ఇందులో ఐడీవోసీలో కలెక్టర్, అడిషనల్ కలెక్టర్‌తో పాటు జిల్లా గ్రామీణాభివృద్ధి (డీఆర్డీఏ), పంచాయతీరాజ్, రోడ్లు-భవనాలు, పౌర సరఫరాలు, మైనింగ్, పరిశ్రమలు, విద్య, వైద్య-ఆరోగ్య, సహకార, స్త్రీ-శిశు సంక్షేమం, వ్యవసాయ, ఉద్యానవన, పశుసంవర్థక, ఇంటర్మీడియట్ విద్య, ఉపాధి కల్పన, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ సంక్షేమంతోపాటు జిల్లాస్థాయి ప్రభుత్వ శాఖల కార్యాలయాలు అన్నీ ఉన్నయి. అన్ని శాఖలు ఒకే చోట ఉన్నయి కాబట్టి వాటి మధ్య సమన్వయం సులభమైంది. కలెక్టర్, అడిషనల్ కలెక్టర్ల పర్యవేక్షణ ఉండేసరికి కిందిస్థాయి అధికారులు ప్రజల దరఖాస్తులపై తొందరగ స్పందిస్తున్నరు. అర్జీ పెట్టుకునేటోళ్లకు సమయం కలిసొస్తున్నది. ప్రయాణ భారం తగ్గింది. తొందరగ పనైతున్నది.

Conferance
సమావేశాలన్నీ ఇక్కడి నుంచే
జిల్లా పాలన రాష్ట్ర స్థాయి మంత్రుల కార్యాలయాలు, ఆయా శాఖల కమిషనరేట్లతో అనుసంధానమై ఉంటయి. ఆయా శాఖల అధికారులు హైదరాబాద్ నుంచి నిర్వహించే టెలికాన్ఫరెన్స్‌లు, ముఖ్యమంత్రి, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రివ్యూ సమావేశాల్లో పాల్గొనేటందుకు వీడియో కాన్ఫరెన్స్ హాల్స్ ఉన్నయి. జిల్లాలోని అధికారులతో సమావేశాలు నిర్వహించేందుకు అధునాతన ఆడియో సిస్టమ్‌తో సెంట్రల్ కాన్ఫరెన్స్ హాల్ ఉన్నది.

Prajavani
సామాన్యుడి సేవలో…
ప్రతి సోమవారం కలెక్టర్ కార్యాలయంలో నిర్వహించే ‘ప్రజావాణి’కి వచ్చే పౌరులు కూర్చునేందుకు ప్రత్యేకమైన హాల్ ఉంది. తాగునీరు, టాయిలెట్ వసతులున్నయి. కార్యాలయాల్లో పనిచేసే మహిళా ఉద్యోగులకు చిన్న పిల్లలుంటే వాళ్ల కోసం క్రెచ్ (శిశు సంరక్షణ కేంద్రం) ఉన్నది. ఇక్కడ పిల్లలు ఆడుకునేందుకు ఆట బొమ్మలున్నయి. వాళ్లకు పాలిచ్చేందుకు, నిద్రపుచ్చే సౌలత్ ఉన్నది. ఏటీఎంలు, మహిళ శక్తి క్యాంటిన్లున్నయి.

Luxery Block
పెద్దల కోసం లగ్జరీ బ్లాక్
ఐడీవోసీలో వీవీఐపీ, వీఐపీ లగ్జరీ బ్లాక్‌లు ఉన్నయి. ముఖ్యమంత్రి, మంత్రి జిల్లా పర్యటనకు వచ్చినప్పుడు సేద తీరేందుకు, స్థానిక అధికారులతో సమావేశమయ్యేందుకు ఇవి ఉపయోగపడుతున్నది. కేంద్ర మంత్రి, రాష్ట్ర స్థాయి ఉన్నతాధికారులు, కేంద్ర ప్రభుత్వ ప్రతినిధులు, విదేశీ ప్రతినిధులు కూడా వీటిని ఉపయోగించుకోవచ్చు. వారి కోసం ప్రతి ఐడీఓసీలో ఆవరణలో హెలిప్యాడ్ నిర్మించారు.
ఇంటిగ్రేటెడ్ హోమ్స్!
కలెక్టర్, అడిషనల్ కలెక్టర్ (రెవెన్యూ), అడిషనల్ కలెక్టర్ (స్థానిక సంస్థలు) ముగ్గురు ఉన్నతాధికారులకు ఐడీవోసీల ఆవరణలో అధికారిక నివాస గృహాలు (క్యాంప్ ఆఫీసులు) నిర్మించినరు. కొన్ని జిల్లాల్లో ప్రభుత్వ అధికారులు, ఉద్యోగులు ఉండేందుకు ఐడీవోసీలకు సమీపంలోనే నివాస గృహాలు, అపార్ట్మెంట్లు నిర్మించినరు.
– గుల్లపెల్లి సిర్ధార్థగౌడ్, మంచిర్యాల
Read Today's Latest Sunday News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?
Kareena Kapur | నటి కరీనా బ్యాగ్ ఖరీదు రూ.13 లక్షలపైనే.. ఏంటి స్పెషల్..?

