ఒక గొప్ప నవల చదవి తీరాల్సిందే. ఒక కాలాన్ని చెప్పే నవలతో గతంలోకి ప్రయాణించి రావొచ్చు. కథ, నవల, కవిత్వంలో వస్తు వైవిధ్యం, శిల్ప సౌందర్యం గురించి అనేక చర్చలు జరుగుతుంటాయి. అవన్నీ కవుల సమూహానికే పరిమితమైపోతున్నాయి. ఒక నవలలోని చారిత్రక, సామాజిక పరిస్థితులతోపాటు పాత్రల వ్యక్తిత్వం గురించి పాఠకులు చదువుకునేలా సాహితీ చర్చను కూడా పాఠకుల ముందుకు తీసుకురావడం అభినందించాలి. ఇటీవల పాఠకుల చేతికి వస్తున్న సాహిత్యంలో ముందుమాట, ఆత్మీయ పలుకులు, ఆప్తవాక్యం, చివరి మాట అచ్చేస్తున్నారు. వీటికి భిన్నంగా ఆచార్య కొలకలూరి ఇనాక్ రచించిన ‘రంధి’ నవల గురించి వ్యాసాల పోటీ నిర్వహించి, వాటిలోంచి అత్యుత్తమమైన సాహితీ విమర్శలను ఒక సంకలనంగా ప్రచురించారు.
‘కొలకలూరి ఇనాక్ సాహిత్యం – వస్తు, రూప విశ్లేషణ’ అంశంతో హైదరాబాద్ కేంద్రీయ విశ్వవిద్యాలయంలో పరిశోధన చేసిన అల్లూరి రవీంద్రబాబు దీనికి సంపాదకులు. ఉత్తమ వ్యాసాలకు బహుమతులు ఇచ్చి, ప్రశంసకు పాత్రమైన వ్యాసాలను కూడా జోడించి ‘రంధి నవల – అవలోకన’ ప్రచురించారు. మాదిగ సామాజిక వర్గంపై జరుగుతున్న అణచివేత కథాంశంగా దళితోద్యమం, ద్రావిడ చైతన్యంతో ఇనాక్ రూపుదిద్దిన రంధి నవలను పలువురు సాహితీ విమర్శకులు భిన్నమైన దృక్కోణాల్లో విశ్లేషించారు. రంధి నవల చదివిన వాళ్లు ఈ పుస్తకాన్ని చదవడం సువ్వి, రాముడు, చందిరి, నాంచారయ్య మిగతా పాత్రలను మరింతగా అర్థం చేసుకుంటారు. నచ్చిన నవలను అరల్లో దాచుకుని మళ్లీ మళ్లీ చదివినప్పుడు కలిగే కొత్త అనుభవం కంటే ఒక నవలను విశ్లేషించే పుస్తకం చదివినప్పుడు కలిగే అనుభూతి సరికొత్తదే కాదు ఉన్నతమైనది కూడా. ఈ వినూత్న రచన చదివి మీరూ అనుభూతి చెందండి!
రంధి నవల -ఒక అవలోకన
రచన: డాక్టర్ అల్లూరి రవీంద్రబాబు
పేజీలు: 208, ధర: రూ. 105
ప్రచురణ: వెన్నెల ప్రచురణలు
ప్రతులకు: ప్రముఖ పుస్తక కేంద్రాలు