తెలుగు వాళ్లకు శాంతా బయోటెక్నిక్స్ పేరు సుపరిచితమే. ఈ సంస్థ వ్యవస్థాపకుడు వరప్రసాద్ రెడ్డి పేరు కూడా తెలిసిందే. ఫార్మా రంగంలో అంతగా ప్రసిద్ధి చెందినవి ఈ రెండు పేర్లు. కాబట్టి, వరప్రసాద్ రెడ్డి ఏ బయోటెక్నాలజీనో, బయాలజీనో చదివారనుకుంటాం. కానీ, ఆయన ఓ ఎలక్ట్రానిక్స్ ఇంజినీర్ అంటే నమ్మలేం. కేంద్ర ప్రభుత్వ, రాష్ట్ర ప్రభుత్వ సంస్థల్లో ఉద్యోగం చేశారు. అయితే, స్వశక్తితో పారిశ్రామికవేత్తగా రాణించాలని కలలు కన్నారు. అదీ సమాజానికి ప్రత్యక్షంగా మేలుచేసేదైతే బాగుంటుంది అనుకున్నారు. ఎంతో సాహసం చేసి ‘శాంతా బయోటెక్నిక్స్’ సంస్థను స్థాపించారు. ఈ సంస్థ తరఫున కాలేయ వ్యాధి అయిన హెపటైటిస్ బి వైరస్‌కు విరుగుడుగా ‘శాన్ వాక్ బి’ టీకాను దేశీయంగా తొలిసారిగా తయారుచేశారు. ఈ క్రమంలో ఆయనకు ఎన్నో సవాళ్లు ఎదురయ్యాయి. వ్యాక్సిన్ తయారుచేయడం ఒకెత్తయితే, అప్పటివరకు విదేశీ టీకాలు రాజ్యమేలుతున్న చోట గొప్ప పనితీరు కనబరుస్తూనే, అందుబాటు ధరకే దొరికే శాన్ వాక్‌ను ప్రవేశపెట్టడానికి ఆయన భగీరథ ప్రయత్నమే చేయాల్సి రావడం మరో ఎత్తు.
ఆ తర్వాత ఆయన బయో టెక్నాలజీ రంగంలో నిలదొక్కుకున్నారు. ఓ ఔత్సాహిక పారిశ్రామికవేత్త ఎంటర్‌ప్రెనార్‌గా వరప్రసాద్ రెడ్డి ప్రయాణం అంత సులభంగా ఏమీ సాగిపోలేదు. ఎన్నో ఒడుదొడుకులు ఎదుర్కొన్నారు. అయినా వెన్ను చూపకుండా విరామమెరగని పరిశ్రమతో ఆయన విజయం సాధించారు. ఈ ప్రయాణాన్ని ‘మనసు పలికే’ పుస్తకంలో మనతో పంచుకున్నారు. తనకు అండగా నిలిచిన కుటుంబసభ్యులు, పరిశోధకుల గురించి కూడా ఇందులో చెప్పుకొచ్చారు. ప్రభుత్వ ఉద్యోగాలు అతి తక్కువగా ఉంటున్న కాలం ఇది. కాబట్టి, సృజనాత్మకంగా ఏదైనా కొత్తగా ఆలోచించాలని కొత్త తరానికి సూచించారు. అదనంగా ఆధునిక యువతరం ఆరోగ్యకరంగా అభివృద్ధి చెందడానికి వివిధ వ్యాసాల రూపంలో దిశా నిర్దేశమూ చేశారు. అలాగని ఈ పుస్తకంలో వరప్రసాద్ రెడ్డి గంభీరమైన భాషను వాడలేదు. అందరికీ అర్థమయ్యే విధంగానే మనతో మాట్లాడారు. మనసు పలికే చదివితే మన జీవితాల్లోనూ ఎంతో కొంత మార్పు చూడొచ్చు.
మనసు పలికే
రచన: వరప్రసాద్ రెడ్డి
పేజీలు: 276; ధర: రూ. 100
ప్రతులకు: నవోదయ బుక్ హౌస్
ఫోన్: 90004 13413
ఘనం..పీవీ వనంమేలు చేసే మునగ!
ఎవరినైనా ఎక్కువగా పొగిడితే ‘మునగ చెట్టు ఎక్కిస్తున్నావ్’ అనడం పరిపాటి. ఈ చెట్టుకొమ్మలు చూడటానికి దృఢంగా కనిపిస్తాయి. కానీ, దీని కొమ్మలు చాలా పెళుసు. అందుకే పైకి ఎక్కించి కింద పడేయాలని చూస్తున్నావనే ఉద్దేశంతో మునగచెట్టును గుర్తుచేసుకుంటారు. మునగచెట్టు పది మీటర్ల ఎత్తు వరకు పెరుగుతుంది. వర్షాభావాన్ని తట్టుకుంటుంది. మునగకాయలతో సాంబారు, కూర, ఆవకాయ చేసుకోవచ్చు. మునగ ఆకును కూరల్లో, పప్పుల్లో వేసుకోవచ్చు. ఎండబెట్టిన మునగ ఆకును ఇతర మసాలా దినుసులతో కలిపి పొడి చేసుకుని ఆహారంగా తీసుకోవచ్చు. మునగకాయ, ఆకులో ఎ, సి, కె, బి కాంప్లెక్స్ విటమిన్లు, ఇనుము, కాల్షియం పుష్కలంగా ఉన్నాయి. రోజువారీ ఆహారంలో మునగ ఉంటే ఆరోగ్యానికి ఎంతో మేలు. ప్రతి పెరట్లో మునగచెట్టు పెంచుకోవాలి.
ఈ చెట్టులో ప్రతి భాగం ఏదో ఒక ఉపయోగపు విలువ కలిగినదే. ఆయుర్వేదంలో మునగ వేర్లు, ఆకులు, కాయ, విత్తనాలను వైద్యం కోసం ఉపయోగిస్తున్నారు. గర్భిణులు తింటే శరీరానికి కావాల్సిన విటమిన్లు, మినరల్స్ అధిక మొత్తంలో శరీరానికి అందుతాయి. రక్త హీనత సమస్య తలెత్తదు. మధుమేహాన్ని మునగ అదుపులో ఉంచుతుంది. కంటిచూపును మెరుగుపరుస్తుంది. తెల్లని గుత్తులుగా పూసే మునగపువ్వును ఎండబెట్టి పొడి చేసుకుని, తేనెలో కలిపి రోజూ తీసుకుంటే ఉబ్బసం తగ్గుతుంది.
వాణిజ్య పంటగా పండించే రైతులు చెట్టును అయిదు, ఆరు మీటర్ల కన్నా ఎక్కువ పెరగకుండా కత్తిరిస్తున్నారు. అందువల్ల కాసిన కాయలు అతి సులభంగా తెంపుకోవచ్చు. మునగ ఆకును పశువులకు దాణాగా ఉపయోగించుకోవచ్చు. మునగకాయలను తెంపకుండా వదిలేస్తే గింజలు నేలరాలతాయి. ఈ గింజలను పక్షులు తింటాయి. మునగ సేద్యం సులభం. శ్రమ లేకుండా పెంచుకోవచ్చు. పట్టణాలకు దగ్గరగా ఉన్న రైతులు మునగ సాగుతో అధిక లాభాలు ఆర్జించవచ్చు.
-ఎమ్మెల్సీ సురభి వాణీదేవి, పీవీ కూతురు
బుక్ షెల్ఫ్
నల్ల పద్యం
రచన: పిన్నంశెట్టి కిషన్
పేజీలు: 150;
ధర: రూ. 150, ప్రచురణ: బోధి
ప్రతులకు: ప్రముఖ పుస్తకాల దుకాణాలు
ఫోన్: 97002 30310
సినీ మాటామంతీ – 1
రచన: ఎమ్బీయస్ ప్రసాద్
పేజీలు: 248;
ధర: రూ. 150
ప్రతులకు: నవోదయ బుక్ హౌస్
ఫోన్: 90004 13413