పేదరికాన్ని జయించాలంటే చదువొక్కటే సరైన మార్గమని నమ్మారు ఆయన. తాను ఏ కష్టాలు పడకున్నా తన చుట్టూ ఉన్నవారి కష్టాలు చూసి చలించిపోయి తన ఉద్యోగానికే రాజీనామా ప్రకటించారు. బస్తీల్లో ఉండే పిల్లలకు ఉచిత ట్యూషన్లు నిర్వహించడమే కాకుండా వారిని ఉన్నతంగా తీర్చిదిద్దుతున్నారు పోతుకూచి శ్రీనివాస్. తన తండ్రి పేరుతో ట్రస్ట్ ఏర్పాటు చేసి.. మంచినీటి ట్యాంక్‌నే విద్యాలయంగా మార్చుకొని వందలాది మందికి విద్యాదానం చేస్తున్న శ్రీనివాస్ ప్రస్థానం ఆయన మాటల్లోనే…
మానవ సేవే మాధవ సేవ అని నమ్మే సిద్ధాంతం నాది. 1985లో ఉద్యోగ కోసం హైదరాబాద్‌కు వచ్చి, ఇక్కడే స్థిరపడ్డాను. ఓ ప్రైవేట్ పరిశ్రమలో పనిచేస్తూనే నా చుట్టుపక్కల వారికి తోచిన సహాయం చేస్తుండేవాణ్ని. 2003లో ఒకరోజు మియాపూర్ ప్రభుత్వ పాఠశాలను సందర్శించాను. అక్కడి విద్యార్థులతో మాట్లాడుతున్నప్పుడు వాళ్ల పేదరికం నన్ను ఎంతగానో బాధించింది. నేను అందించే కొద్దిపాటి ఆర్థిక సహాయం వారి జీవితాలను మార్చలేదని తెలుసు. అందుకే వారికి ఉచితంగా పాఠాలు బోధించాలని అనుకున్నా.
ఉదయం ‘ఏ షిప్ట్’ ఉద్యోగం చేసుకుంటూ మధ్యాహ్నం నుంచి విద్యార్థులకు సోషల్ పాఠాలు బోధించేవాణ్ని. ఒక రోజు ఓ పిల్లవాడు హోం వర్క్ చేయకుండా ట్యూషన్‌కు రావడంతో కోప్పడ్డాను. ఎందుకు చేయలేదని అడిగితే వాళ్లింట్లో కరెంట్ ఉండదని, వీధి లైట్ కింద చదువుకునేందుకు ఆ బల్బ్ వెలగలేదని చెప్పాడు. తను అబద్ధం చేబుతున్నాడని ఆ పిల్లాడిని అనుసరిస్తూ వాళ్ల ఇంటికి వెళ్లాను. చాలా దారుణమైన పరిస్థితిలో ఆ కుటుంబం జీవిస్తున్నది. సినిమా పోస్టర్లతో గుడిసె నిర్మించుకొని అందులో జీవించడం చూసి చలించిపోయాను.

ఆ ఒక్క సంఘటన నన్ను ఎంతగానో కలిచివేసింది. అలాంటి వాళ్లు నా చుట్టుపక్కల వందల సంఖ్యలో ఉన్నారని తెలిసింది. వాళ్లకోసం కచ్చితంగా పాటుపడాలని నిర్ణయించుకొని ఉద్యోగానికి వీఆర్ఎస్ ఇచ్చి మా నాన్నగారి పేరుతో పోతుకూచి సోమసుందర సోషల్ వెల్ఫేర్ అండ్ చారిటబుల్ ట్రస్టును ఏర్పాటు చేశాను. పేద పిల్లలకు విద్య అందించడమే లక్ష్యంగా నా ప్రయాణాన్ని మొదలు పెట్టాను. అలా మియాపూర్ ప్రభుత్వ పాఠశాల విద్యార్థులకు ఉచితంగా ట్యూషన్లు చెప్పడం ప్రారంభించాను. నెమ్మదిగా చుట్టుపక్కల పాఠశాలల నుంచి కూడా పిల్లలు రావడం మొదలుపెట్టారు.
అబ్దుల్ కలాం గారితో పనిచేసిన నా మిత్రుడు నాగభూషణం నా లక్ష్యాన్ని మరింత ఉన్నతంగా చేశాడు. పదోతరగతి పూర్తయిన విద్యార్థులకు డిప్లోమా వంటి వృత్తివిద్యా కోర్సుల కోసం కోచింగ్ ఇప్పిస్తే బాగుంటుందని సూచించాడు. ఆనాటి నుంచి పాలీసెట్, ఈసెట్ కోచింగ్‌లు ఇప్పిస్తున్నాను. ట్రస్ట్ ప్రారంభంలో చిన్న షెడ్డులో ట్యూషన్ తరగతులు నిర్వహించేవాణ్ని. 2008లో మియాపూర్‌లో ఉన్న మాతృశ్రీ నగర్లో ఉన్న వాటర్ ట్యాంకుకు మారాను. వాటర్ ట్యాంకు కింద నిరుపయోగంగా ఉన్న గదులను కాలనీవాసుల సహకారంతో ఉపయోగించుకున్నాను. మా దగ్గర తొమ్మిదో తరగతి నుంచి డిప్లొమా, బీటెక్ పూర్తయ్యేవరకు ట్యూషన్, కెరీర్ గైడెన్స్ అందిస్తున్నాం.
ఈ వాటర్ ట్యాంకు మూడు అంతస్తుల్లో ఉంటుంది. మొదటి రెండు అంతస్తుల్లో గదులు ఉన్నాయి. అకడే పిల్లలకు తరగతులు నిర్వహిస్తున్నాం. కంప్యూటర్ ల్యాబ్ సౌకర్యం కూడా ఉంది. ప్రతి రోజూ సూల్ అయిపోయాక పిల్లలందరూ ఇక్కడికి వచ్చి చదువుకుంటారు. ఆడ పిల్లలకోసం ప్రత్యేకంగా వ్యాను ఏర్పాటు చేశాం. ప్రత్యేకమైన ఫ్యాకల్టీ అంటూ ఎవరూ లేరు. ఇకడున్న సీనియర్ విద్యార్థులే పాఠాలు చెబుతారు, సందేహాలు తీరుస్తారు. నేను చివరి పదినిమిషాలు మోటివేషనల్ క్లాస్ బోధిస్తుంటాను. ఆకలితో ఉంటే పిల్లలు చదువుపై దృష్టి పెట్టలేరు. అందుకే ఇక్కడికి వచ్చే విద్యార్థుల కోసం ఒక పూట భోజనం కూడా పెడుతున్నాం.
వంట వండటం, శుభ్రం చేసుకోవడం, ట్రస్టు జమా ఖర్చులు చూడటం… ఇవన్నీ పిల్లలే పర్యవేక్షిస్తుంటారు. ట్రస్టు సహకారంతో ఇప్పటి వరకు 1531 మంది పాఠశాల విద్యను పూర్తి చేసుకున్నారు. డిప్లొమా, ఇంజినీరింగ్ విద్యార్థులకు ఫీజులు చెల్లించడం నుంచి అన్ని రకాల ఆర్థిక అవసరాలకూ ట్రస్ట్ అండగా ఉంటున్నది. దాతలు, సీఎస్ఆర్ కింద కంపెనీలు ఇచ్చే నిధులతోపాటు ఇక్కడ చదువుకొని, ఉన్నత ఉద్యోగాల్లో స్థిరపడిన వాళ్లు ఆర్థిక సాయం అందిస్తున్నారు.
మా ట్రస్ట్ సహకారంతో సుమారు 1200 మందికిపైగా డిప్లొమా పూర్తి చేయగా, వారిలో దాదాపు 900 మంది ఉద్యోగాలు సాధించారు. 225 మంది ఇంజినీరింగ్ పూర్తి చేయగా, 213 మంది ఉద్యోగాలు పొందారు. వాటర్ ట్యాంకు దగ్గర మాత్రమే కాకుండా హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లో మరో 8 సెంటర్లను ఏర్పాటు చేసి ఇదే స్థాయిలో సాయం అందిస్తున్నాం. మరింత వినూత్నంగా ‘శిక్షా సేతు’ కార్యక్రమం చేపట్టి.. పాఠశాల అయిపోగానే సాయంత్రం అకడే ఉండి పిల్లలు చదువుకునేలా విద్యా వలంటీర్లను నియమించాం. రంగారెడ్డి, మేడ్చల్-మలాజిగిరి, సంగారెడ్డి జిల్లాల్లోని సూల్ స్థాయిలో ఇప్పటివరకు 23 సెంటర్లు ఏర్పాటు చేశాం. వచ్చే ఐదేళ్లలో 200కు పైగా పాఠశాలకు విస్తరించాలని లక్ష్యంగా పెట్టుకున్నాను.
– రాజు పిల్లనగోయిన