Portrait Photography | కెమెరా, ఫొటోగ్రఫీకి ముందే.. పోర్ట్రెయిట్లు ఉన్నాయి. పూర్వకాలంలోనే మహారాజులు, మహారాణుల చిత్రాలను.. చిత్రకారులు చేతితోనే వేసేవారు. ఆయా చిత్రాల్లో పాలకుల వ్యక్తిత్వం, మానసిక స్థితిని కళ్లకు కట్టినట్టు చిత్రించేవారు. ఇక కెమెరాలు, స్మార్ట్ఫోన్లతో తీసే నేటితరం పోర్ట్రెయిట్ చిత్రాలు.. ఒక వ్యక్తికి చెందిన మూర్తిమత్వం, వ్యక్తిత్వం, గుర్తింపును తెలియజేస్తాయి. ఈ పోర్ట్రెయిట్ ఫొటోగ్రఫీలో లైటింగ్, పోజింగులు కీలకపాత్ర పోషిస్తాయి.
పోర్ట్రెయిట్ చిత్రాలు.. ముఖ్యంగా వ్యక్తులపైనే దృష్టి పెడతాయి. వారికే సొంతమైన ప్రత్యేక వ్యక్తీకరణలు, భావోద్వేగాలు, వ్యక్తిత్వాలను చూపుతాయి. ఆ వ్యక్తి అంతర్గత స్వభావాన్ని తెలియజేసే విజువల్ రిప్రజెంటేటివ్స్‌గా పనిచేస్తాయి. వారి వ్యక్తిత్వాన్ని, ప్రత్యేకతలను పంచుకుంటాయి. వారి అందం, బలాలను హైలైట్ చేస్తాయి.
మన ప్రియమైనవారి జ్ఞాపకాలు, ముఖ్యమైన సంఘటనలు, జీవితంలోని దశలను భద్రపరిచే విలువైన జ్ఞాపకాలుగా పోర్ట్రెయిట్లు పనిచేస్తాయి. వారివారి వ్యక్తిగత మైలురాళ్లను డాక్యుమెంట్ చేసి, మరలా వాటిని తిరిగి చూసుకుని.. ఆ మధుర జ్ఞాపకాలను నెమరువేసుకోవడానికి ఉపయోగపడతాయి. పిల్లలు ఎదుగుతున్నప్పుడు, వాళ్లు చిన్నప్పుడు చేసిన చిలిపి, అల్లరి పనులను ఫొటోలు తీసి ఆల్బంలో భద్రపరుస్తుంటాం. అవి వాళ్లు ఎదిగిన తర్వాత చూసుకున్నప్పుడు.. వాళ్లతోపాటు మన ముఖంలోనూ వచ్చే ఓ మంచి చిరునవ్వే.. పోర్ట్రెయిట్ ఫొటోగ్రఫీకి మంచి ఉదాహరణ.
చరిత్ర, సంస్కృతిని డాక్యుమెంటింగ్ చేయడంలోనూ పోర్ట్రెయిట్ ఫొటోగ్రఫీ ఉపయోగపడుతుంది. సమాజం, రాజకీయాలు, సంస్కృతి, కళలలో ముఖ్యమైన పాత్ర పోషించిన వ్యక్తులను డాక్యుమెంట్ చేయడానికి, ఆయా సందర్భాలను చిత్రీకరించడానికి పోర్ట్రెయిట్లు ఎంతో ఉపయోగపడ్డాయి.
మరి ఇన్ని లాభాలు ఉన్న పోర్ట్రెయిట్ ఫొటోగ్రఫీని.. మన చేతిలో ఉన్న మొబైల్ ఫోన్‌తో ఎలా చేయాలి? దానికి
కావాల్సిన టిప్స్ ఏంటో తెలుసుకుందాం. పోర్ట్రెయిట్ ఫొటోలకు సాధారణంగా వ్యక్తి కళ్లే కేంద్ర బిందువుగా ఉంటాయి. అందుకే.. మీ సబ్జెక్టు కళ్లపైనే దృష్టి పెట్టండి. అవి షార్ప్‌గా, పూర్తి ఫోకస్లోనే ఉన్నాయని నిర్ధారించుకోండి.
మరింత డైనమిక్ కాంపొజిషన్ కోసం మీ సబ్జెక్ట్‌ను ఫ్రేమ్ మధ్యలో ఉంచండి. మీ కెమెరా సెట్టింగ్స్‌లో ‘గ్రిడ్స్ – లైన్స్’ను ఎనేబుల్ చేసుకోండి. 3×3 గ్రిడ్‌లో రెండు గీతలు కలుస్తున్నచోట మీ సబ్జెక్ట్ కళ్లు లేదా ముఖం వచ్చేలా ఫ్రేమ్ చేయండి.
లైటింగ్‌ని పూర్తిగా వాడుకోండి. మంచి ఫొటోకు లైటింగ్ అనేది చాలా ముఖ్యం. నేచురల్ లైట్ ఉపయోగించడం ఉత్తమం. సాఫ్ట్ లైట్ ఉండే ఉదయం, సాయంత్రం సమయాల్లో ఫొటోలు తీస్తే మరింత అందంగా వస్తాయి.
పోర్ట్రెయిట్ ఫొటోల్లో.. ప్రధాన సబ్జెక్ట్ ఎవరో ఒక వ్యక్తి. వాళ్లే ఎక్కువ ఫోకస్ కావాలి. అందుకే, బ్యాక్‌గ్రౌండ్ సింపుల్‌గా ఉండేలా చూసుకోండి. వ్యక్తి వెనకాల వేరే సబ్జెక్ట్ లేకుండా.. న్యూట్రల్‌గా, బోకే ప్రభావం కలిగిన బ్యాక్‌గ్రౌండ్ ఉపయోగించడం ఉత్తమం. అవసరమైతే బ్యాక్‌గ్రౌండ్‌ని బ్లర్ చేయడానికి వైడ్ ఎపర్చరు (తక్కువ సంఖ్య)ను ఉపయోగించండి.
సాధారణ యాంగిల్స్ కంటే కొత్త యాంగిల్స్‌లో ఫొటోలు తీయడానికి ప్రయత్నించండి. ఐ-లెవెల్ కంటే పైన లేదా కిందినుంచి తీసినా, ఫొటోకు కొత్తదనాన్ని తీసుకురావచ్చు.
మాన్యువల్ సెట్టింగ్స్‌తో మంచి పోర్ట్రెయిట్స్ తీసుకోవచ్చు. మీ మొబైల్లో ప్రొ ఫొటో మోడ్ ఉంటే.. షట్టర్ స్పీడ్, ISO, ఎక్స్పోజర్ లాంటి అంశాలను కస్టమైజ్ చేయండి. మీ ఫొటోల నాణ్యతను పెంచుకోండి.
చివరిగా.. రంగులను మెరుగుపరచడానికి, ఎక్స్పోజర్ను సర్దుబాటు చేయడానికి, ఫొటోలకు మరింత పదునుపెట్టడానికి Adobe లేదా PS Express / Snapseed వంటి ఫొటో ఎడిటింగ్ సాఫ్ట్వేర్లను ఉపయోగించండి.
ప్రాక్టీస్‌తో ఫొటోగ్రఫీ మరింత మెరుగుపడుతుంది. అందుకే, క్రమం తప్పకుండా ప్రాక్టీస్ చేయండి. విభిన్న పద్ధతులు, లైటింగ్ సెటప్లలో వివిధ భంగిమలతో ఫొటోలు తీయండి.
మొబైల్‌తో గొప్పగొప్ప పోర్ట్రెయిట్లు తీయడం ఎంతో సులభం. సరైన లైటింగ్, క్లీన్ బ్యాక్‌గ్రౌండ్‌తోపాటు ఫ్రేమింగ్ వంటి అంశాలను గమనిస్తూ.. ఈ చిట్కాలను పాటిస్తే, మీ ఫొటోలు మరింత మెరుగవుతాయి.
ఫొటోగ్రఫీ అనేది ఒక కళ. కాబట్టి సృజనాత్మకంగా ఆలోచించి మరిన్ని ప్రయోగాలు చేయండి. మీ కెమెరాతో మరిన్ని అద్భుతాలను సృష్టించండి!
…? ఆడెపు హరికృష్ణ