మా పిల్లల్ని జాగ్రత్తగా చూసుకోండి టీచర్
విప్లవ్, చైతన్యలకు ట్యూషన్ చెపుతున్న క్రమంలో బుచ్చిరెడ్డి సార్ మా ఇంటికి అప్పుడప్పుడు వస్తూ ఉండేవారు. మా ఇంట్లో ఉన్న పత్రికలు, నవలలు, కథల పుస్తకాలు చూసి ఆశ్చర్యపోయారు. ‘మీకు చాలా మంచి పుస్తకాలు చదివే టేస్ట్ ఉంది. అబ్బ, మీ దగ్గర ఎన్ని పుస్తకాలు ఉన్నాయో! నాకు పుస్తకాలంటే బాగా ఇష్టమండీ!’ అని అంటుండేవారు.
రమాయణం.. చదువు నేర్పిన రోజుల్లో- 5
ఇదంతా మా అమ్మది సార్! ఆమె తన దగ్గర ఏ కొంచెం పైసలున్నా గాజులో, పౌడర్‌లో, స్నోలో కొనుక్కోకుండా పత్రికలకు చందాలు కడుతుంది. మంచి నవలలు, కథలు ఏరి పుస్తకాలుగా కుట్టి ఉంచింది’ అని చెప్పాం. ఆ తర్వాత ఆయన కూడా కొన్ని పుస్తకాలు చదవమని తెచ్చి ఇచ్చేవారు. చదివి మళ్ళీ భద్రంగా తిరిగి ఇచ్చేసేవాళ్లం. ఆయనంత తరచుగా కాకపోయినా ఇందిరా టీచర్ కూడా మా ఇంటికి అప్పుడప్పుడూ వచ్చేది. ఆమె వచ్చినప్పుడు మేము టీ ఇస్తే ఆమెకి అది చాలా నచ్చింది. ‘మీ ఇంట్ల చాయ్ చాల బాగుంటది. మీ ఇంట్ల టీ తాగినాక ఎక్కడ తాగినా నచ్చుత లేదు’ అని మెచ్చుకునేది. వచ్చినప్పుడల్లా చనువుగా ‘నా టీ ఏది?’ అని అడిగేది.
ఇందిరా టీచర్ సడన్‌గా ఓ రోజు తాను అమెరికా వెళుతున్నట్లు చెప్పారు. ‘మా పిల్లల్ని జాగ్రత్తగా చూసుకోండి టీచర్! సార్‌కు కొంచెం పరోపకారం ఎక్కువ. స్కూలు, పిల్లలు అనుకుంటూ వాళ్ల లోకంలోనే ఉంటాడు. కొంచెం మీ దగ్గరికి వచ్చినప్పుడు పిల్లల్ని చూసుకోండి. నేను అమెరికా వెళుతున్నాను. మా వాళ్లు అక్కడ ఉన్నారు, వాళ్లు స్పాన్సర్ చేశారు. నేను పోయిన తర్వాత అక్కడ బాగుంటే అప్పుడు సార్‌ని, పిల్లల్ని పిలిపించుకుంటాను’ అన్నారు.
ఎందుకో గానీ, ఆమె పర్మనెంట్‌గా అమెరికా వెళ్లే ఆలోచనలో ఉందంటే నా మనసుకు బాధ కలిగింది. భార్యాభర్తలిద్దరూ గవర్నమెంటు టీచర్లు. మంచి సంపాదన ఉండగా ఎందుకు అమెరికా? పోనీ చూసి రావటం అంటే వేరు గానీ, అక్కడ ఉండటానికి వెళ్తుందంటే నాకే ఏదో తెలియని దిగులేసింది. వాళ్లిద్దరిలో విప్లవ్కు ఎనిమిది తొమ్మిది ఏళ్లు ఉన్నా ఆ పిల్లవాడు వయసుకు మించిన పెద్దరికంతో కొంచెం గంభీరంగా ఉండేవాడు. చైతన్య మటుకు ఇంకా పాలుగారే పసిబుగ్గలతో చాలా అమాయకంగా, ముద్దుగా ఉండేవాడు. ఆ పిల్లోడి మొహం చూస్తేనే ఎందుకో చాలా జాలి కలిగేది. ఆ పిల్లలను చూసినప్పుడల్లా ‘అయ్యో, వీళ్ల అమ్మ దగ్గర లేదే! ఏం తింటున్నారో, ఏం తాగుతున్నారో, ఏదైనా కావలిస్తే ఎవరిని అడుగుతారో’ అనిపించేది.
మా అమ్మ, మా నానమ్మ ఆ పిల్లల్ని బాగా గారాబం చేసేవారు. ఇంట్లోకి పిలిచి పాలు పోసేవారు, ఏవైనా తినుబండారాలు చేస్తే పెట్టేవారు. నేను బిస్కెట్లు ఇచ్చేదాన్ని. బుచ్చిరెడ్డి సారు ట్యూషన్ అయిపోయాక ఎప్పుడైనా లేటుగా వస్తే చైతన్య నిద్రకళ్లతో తూగుతూ ఉంటే మా ఇంట్లో ఏదో ఒక బెడ్లో పడుకోమనేవాళ్లం. పడుకుని అలాగే నిద్రపోయేవాడు. ‘గిట్ల ముక్కుపచ్చలారని పిల్లలను ఒదిలిపెట్టి ఎట్ల పోయిందమ్మా గా తల్లి! పాపం.. పిల్లగాండ్లు పిల్లి పట్టిన కోడిపిల్లల తీరుగ ఉంటున్నరు’ అని నానమ్మ అనేది. ‘అట్లనకు నానమ్మా! వాళ్ల నాన్న పిల్లల్ని మంచిగనే చూసుకుంటరు’ అంటే ‘ఏం చూసుకునుడే? తల్లి తీరుగ తండ్రి అయితడా? తల్లి మీద కుతి ఉండదా?’ అంటూ ఏ మాత్రం క్షమించేది కాదు నానమ్మ.
అమెరికాకు వెళ్లాక నాకు ఇందిరా టీచర్ నుండి రెండు మూడుసార్లు ఉత్తరాలు వచ్చాయి. అమెరికా నుంచి అందమైన రంగులో పూల ప్రింటున్న ఒక ఎన్వలప్ రావడం, అందులో ఆమె రాసిన ఉత్తరం ఉండటం నాకు ఆ రోజుల్లో పెద్ద థ్రిల్ కలిగించింది. ఆ కవరు అందరికీ కనిపించేలా పెట్టడం, ‘అరె, ఈ ఉత్తరం ఎవరికి?’ అని చూసిన వాళ్లు ఎంక్వయిరీ చేయడం నాకు బాగుండేది. ఆ ఉత్తరాల్లో తెలిసిందేమిటంటే ఆమెకి అక్కడ బ్యాంక్ ఆఫ్ అమెరికాలో ఉద్యోగం దొరికిందని. ఆ తర్వాత ‘ఈ అకాడమిక్ ఇయర్ అయిపోగానే నేను, పిల్లలు కూడా యూఎస్ వెళ్లిపోతాం’ అని బుచ్చిరెడ్డి సార్ చెప్పారు. పోనీలే.. తల్లిదండ్రులు, పిల్లలు ఒకేచోట ఉంటారనిపించింది.
ఇందిరా టీచర్ నన్ను చాలా ఇష్టపడేది. అమెరికా నుంచి వచ్చేవారి ద్వారా నాకు ఒక మంచి చెర్రీ రెడ్ కలర్లో మందంగా ఉండే ప్యూర్ వూల్ స్వెట్టర్ పంపారు. అ తరువాతెప్పుడో ఒక ప్రింటెడ్ చీర, మరోసారి చేతికి వేసుకునే బ్యాంగిల్ టైప్ వాచ్ పంపారు. మధ్యలో ఓసారి ఆమె వచ్చినప్పుడు ‘నాకు మీరట్లా గిఫ్ట్‌లు పంపుతుంటే తీసుకోవడానికి బాగా మొహమాటంగా ఉంటుంది’ అన్నాను. ఆమె పకపకా నవ్వి ‘మీరంటే నాకిష్టం. మా చెల్లెలుంటే ఇవ్వనా? అయినా మీకసలు సార్ రెగ్యులర్‌గా ట్యూషన్ ఫీజు ఇచ్చిన్రో లేదో! మీరు చెప్పరు. సారుకు గుర్తుండదు. ఎన్నో ఖర్చులు. నా జీతం కూడా రాదు కదా! మీ ఇంట్లో అందరి ప్రేమ ముందు నేనిచ్చింది శానా తక్కువ. ఏమనకుండ తీసుకోండి’ అన్నారు.
ఇందిరా టీచర్ తనకు ఏవైనా కావాలంటే మీరు పంపగలరా? అని చనువుగా నన్ను అడిగేవారు. ఆమె చెల్లెలి భర్త గోపాల్ రెడ్డిగారు హనుమకొండలో ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్లో ఇంజినీర్‌గా ఉండేవారు. ఇండియా నుంచి చీరలో, ఏవైనా వస్తువులో కావాలంటే గోపాల్ రెడ్డి గారి ఇంట్లో నేను ఇచ్చేస్తే అమెరికా వెళ్లే వారెవరైనా ఉంటే వాళ్లతో ఇందిరా టీచర్‌కు చేరేవి.
– నెల్లుట్ల రమాదేవి, రచయిత్రి
Read Today's Latest Sunday News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Viral News | అనారోగ్యంతో ఉన్న అమ్మకోసం కేంద్ర మాజీ మంత్రి వేణుగానం..!
Watch: 8 ఏళ్ల బాలుడి దారుణం.. క్లాస్‌లో యూకేజీ బాలికపై రాయితో దాడి, చిన్నారి పరిస్థితి విషమం
Brothers Lifestyle Upgrade | సోదరుల జీవనశైలిలో ఆకస్మిక మార్పు.. ఇంట్లో దాచిన డ్రమ్ముల్లో కోట్లలో డబ్బు చూసి పోలీసులు షాక్
Viral News | ఇంజక్షన్ చూడగానే పక్షవాతం పరార్.. లేచి పరుగందుకున్న బెగ్గర్.. Video
El Nino | భారత్‌ను తీవ్రంగా దెబ్బకొట్టనున్న ఎల్‌నినో.. మార్చి నాటికి 55 వేల మరణాలు..!

