డబ్బు, నగలు, ఇంకేమైనా విలువైన వస్తువులు దొంగలు లూటీ చేస్తారు. ఇదేం కొత్త విషయం అయితే కాదు. మీ డేటా కూడా బంగారమే! ఆన్ లైన్లో అప్రమత్తంగా లేకపోతే సైబర్ దొంగల చేతికి తాళం చెవి ఇచ్చినట్టే! చిన్న తప్పుచాలు.. మీ డేటా అంతా కొల్లగొడతారు. మీ పేరు, యూజర్ ఐడీలు, పాస్వర్డ్లు, బ్యాంకు వివరాలు.. ఇవే ఫ్రాడ్స్టర్లకు బంగారు గనులు. ప్రతి క్షణం నెట్టింట్లో వీటి కోసం గాలం వేస్తుంటారు. అందుకే నెటిజన్లకు డేటాను రక్షించుకోవడం సవాలుగా మారుతున్నది. మరి మన డేటా సురక్షితంగా ఉండాలంటే ఏం చేయాలి? వ్యక్తిగత సమాచారాన్ని రక్షించుకోవడానికి మీరు ఎంత సిద్ధంగా ఉన్నారు?
రియల్ పపంచంలో, ఆన్లైన్ వరల్డ్‌లో మనం ఎవరు? ఏం చేస్తుంటాం? ఎక్కడ ఉంటాం?.. ఇలాంటి వివరాల్ని వ్యక్తిగత డేటాగా చెబుతాం. ఇది రెండు రకాలుగా ఉంటుంది. ఒకటి ప్రాసెస్ చేయదగిన డేటా. పేరు, చిరునామా, ఐడి నంబర్, పాస్‌పోర్ట్ నంబర్, ఫైనాన్షియల్ డేటా, ఐపీ అడ్రెస్లు, మెడికల్ రికార్డులు ఇవన్నీ ప్రాసెస్ చేయగలిగేవి. అంటే వీటిని దొంగిలించి డైరెక్టుగా బెనిఫిట్ పొందొచ్చు. ఇక రెండోది ప్రాసెస్ చేయరాని డేటా. జాతి, మతం, కులం, రాజకీయ ఆసక్తులు, వ్యక్తిగత అభిరుచులు, నమ్మకాలు. ఇవన్నీ వ్యక్తుల సోషల్ ఐడెంటినీ తెలియజేస్తాయి. వీటిని ట్రాక్ చేయడం ద్వారా మిమ్మల్ని ట్రాప్‌లోకి లాగొచ్చు. మనం ఈ రెండు రకాల డేటాని విచ్చలవిడిగా నెట్టింట్లో వాడేస్తున్నాం. దీంతో యూజర్ల డేటాని హ్యాకర్లు సులభంగా పట్టేస్తున్నారు. యూజర్లు ఏం సెర్చ్ చేస్తున్నారు? ఏయే సర్వీసుల్ని యాక్సెస్ చేస్తున్నారు? ఎవరితో కనెక్ట్ అవుతున్నాం? ఎవరు ఫాలో అవుతున్నారు? ఏ యాప్‌లు వాడుతున్నారు? ఏం కొంటున్నారు?.. ఇవన్నీ మన ఆన్లైన్ జీవితాన్ని మలుపుతిప్పే ఫ్యాక్టర్లు. ఇవన్నీ హ్యాకర్ల చేతికి చిక్కితే ఎలా అన్న స్పృహ మనలో చాలామందికి ఉండటం లేదు! దీంతో ఆన్లైన్ దొంగలు అనేక పద్ధతుల్లో డేటాని దొంగలిస్తున్నారు. రకరకాల దాడులకు పాల్పడుతున్నారు.
సోషల్ మీడియా అంటే ప్రైవసీకి శత్రువు అని చెప్పొచ్చు. సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్‌లు మీ వ్యక్తిగత గోప్యతకు ముప్పు కలిగించవచ్చు. మీరు ఆన్లైన్లో పబ్లిక్‌గా పోస్ట్ చేసే ప్రతి విషయం గురించి జాగ్రత్తగా ఉండాలి. మీ సమాచారం ఎంత విలువైనదో అర్థం చేసుకోవడం చాలా అవసరం. ఒకవేళ మీరు ఆన్లైన్లో పోస్ట్ చేసిన అభ్యంతరకరమైన డేటాను తొలగించాలనుకుంటే, ‘రైట్ టు ఫర్గెట్’ చట్టం ప్రకారం సంబంధిత సోషల్ మీడియా సంస్థలను సంప్రదించవచ్చు. గూగుల్, ఎక్స్, ఫేస్బుక్, లింక్డ్ఇన్లలో.. ఈ కింది లింకులు ఉపయోగించి డేటా రిమూవ్ చేయొచ్చు.
సమాచార నిర్వహణ: స్మార్ట్‌ఫోన్ లేదా ల్యాప్‌టాప్‌లో ఉండే ఫోల్డర్లను, ఫైల్‌లను ఒక క్రమ పద్ధతిలో సార్ట్ అవుట్ చేయాలి. ఆఫీస్ డేటా, పర్సనల్ డేటా వేర్వేరుగా విభజించుకోవాలి. ఆఫీస్ పనికి సంబంధించిన ముఖ్యమైన సమాచారాన్ని వ్యక్తిగత డివైజ్‌లలోకి బదిలీ చేయొద్దు. ఎక్కువ డేటా ఉంటే, ఫోల్డర్ స్ట్రక్చర్ టూల్‌ను ఉపయోగించడం మంచిది.
ఎన్క్రిప్షన్ ఎనేబుల్ చేయండి: ఎన్క్రిప్షన్ అనేది డేటాను సురక్షితంగా ఉంచడానికి చక్కని మార్గం. ఫైల్‌లను క్లౌడ్‌లోకి అప్లోడ్ చేసే ముందు వాటిని ఎన్‌క్రిప్ట్ చేయాలి. విండోస్, మ్యాక్, ఆండ్రాయిడ్ ఐఓఎస్ లాంటి ఆపరేటింగ్ సిస్టమ్‌లలో ఈ ఫీచర్లు అందుబాటులో ఉన్నాయి. ఎన్‌క్రిప్ట్ చేసిన డేటాను భవిష్యత్తులో యాక్సెస్ చేయడానికి, మాస్టర్ పాస్‌వర్డ్‌ను తప్పనిసరిగా గుర్తుంచుకోవాలి.
డేటా బ్యాకప్: డేటాను అదనపు స్టోరేజ్ డ్రైవ్‌లో బ్యాకప్ తీసుకోవడం మంచిది. అలాగే, మీ ఎన్‌క్రిప్ట్ చేసిన డేటాను క్లౌడ్‌లో అప్లోడ్ చేయడం కూడా సురక్షితమే.
పాస్వర్డ్ మేనేజర్: ఇ-మెయిల్, సోషల్ మీడియా అకౌంట్లకు టూ-ఫ్యాక్టర్ ఆథెంటికేషన్ (2FA) తప్పకుండా వాడాలి. ఇది మీ ఖాతాకు అదనపు భద్రతను ఇస్తుంది. అలాగే, పాస్‌వర్డ్‌లను గుర్తుంచుకోవడానికి పాస్వర్డ్ మేనేజర్ని ఉపయోగించడం మంచిది.
ఫిజికల్ సెక్యూరిటీ: మీ డివైజ్‌లను ఇతరులు యాక్సెస్ చేయకుండా జాగ్రత్త పడాలి. ఫోన్‌కు పాస్‌కోడ్, ఫింగర్ ప్రింట్ లాక్ పెట్టడం ద్వారా అనవసరమైన యాక్సెస్‌ను నివారించవచ్చు.
పబ్లిక్ వైఫైలో: పబ్లిక్ వైఫై వాడేటప్పుడు జాగ్రత్త. సైబర్ నేరగాళ్లు మీ సమాచారాన్ని దొంగలించే అవకాశం ఎక్కువగా ఉంటుంది. అందుకే వర్చువల్ ప్రైవేట్ నెట్వర్క్ (VPN) ఉపయోగించడం సురక్షితం.
అప్డేట్ ఓఎస్: డివైజ్‌లలో ఆపరేటింగ్ సిస్టమ్‌ను ఎప్పటికప్పుడు అప్డేట్ చేస్తూ ఉండాలి. సాఫ్ట్వేర్ అప్డేట్లు.. భద్రతా లోపాలను సరిచేస్తాయి.
యాంటీవైరస్ తప్పనిసరి : కంప్యూటర్, ఇతర డివైజ్‌లలో యాంటి వైరస్, మాల్వేర్ సిస్టమ్‌లను ఉపయోగించాలి. ఇవి మాల్వేర్, రాన్సమ్వేర్, ఇతర ఆన్లైన్ ఫ్రాడ్స్ నుంచి మీ డివైజ్‌లను రక్షిస్తాయి.