హృదయంగమ ప్రణయ గీతం…
‘అభినందన’ లాంటి సంగీతాత్మక చిత్రాలను నిర్మించిన ఆర్.వి.రమణమూర్తి 1989లో తీసిన తెలుగు చిత్రం ‘నీరాజనం’. దీనికి సంగీత దర్శకత్వం వహించింది ప్రఖ్యాత హిందీ సంగీత దర్శకులు ఓపీ నయ్యర్. వీరు స్వరపరిచిన అనేక హిందీ గీతాలు తన మనసును గెలుచుకున్నాయని అంటారు సినారె. “హార్మోనియం ముందు కూర్చున్నప్పుడు నయ్యర్ ఒక తపస్విలా అగుపిస్తాడు.
‘అభినందన’ లాంటి సంగీతాత్మక చిత్రాలను నిర్మించిన ఆర్.వి.రమణమూర్తి 1989లో తీసిన తెలుగు చిత్రం ‘నీరాజనం’. దీనికి సంగీత దర్శకత్వం వహించింది ప్రఖ్యాత హిందీ సంగీత దర్శకులు ఓపీ నయ్యర్. వీరు స్వరపరిచిన అనేక హిందీ గీతాలు తన మనసును గెలుచుకున్నాయని అంటారు సినారె. “హార్మోనియం ముందు కూర్చున్నప్పుడు నయ్యర్ ఒక తపస్విలా అగుపిస్తాడు. గానమే అతని ధ్యానం. లోగొంతుకలో రాగోదయం జరుగుతూ ఉంటే దాన్ని హార్మోనియంలోంచి పలికిస్తాడు. అతని పద్ధతి.. ముందు బాణీ, తర్వాత పాట” అంటారు సినారె. “మేరా నామ్ చిన్ చున్ చిన్…”, “బాబూజీ ధీరే చల్నా…” లాంటి గీతాలకు స్వరకల్పన చేసింది ఓపీ నయ్యర్ గారే.
‘నీరాజనం’ చిత్ర మ్యూజిక్ సిట్టింగ్‌లో “తని నా న న + తా నా న తా నా” అంటూ నయ్యర్ కూర్చిన బాణీకి సినారె కూర్చిన గీతం “నిను చూడక నేనుండలేను/ ఈ జన్మలో మరి ఆ జన్మలో ఇక/ ఏ జన్మకైనా ఇలాగే” పల్లవితో మొదలవుతుంది. చిత్రకథ ప్రకారం ఇందులోని నాయికా, నాయకులైన జయ, విజయ్ ప్రేమించి పెండ్లి చేసుకుంటారు. అనుకోకుండా జరిగిన ప్రమాదంలో జయ మరణిస్తుంది. ఆ బాధతో విజయ్ మద్యానికి బానిసైపోతాడు. జయ సోదరి నిరోషా.. విజయ్‌ని తిరిగి మామూలు మనిషిగా చేయాలని ప్రయత్నం చేస్తుంది. చివరికి జయ ప్రమాదానికి గురై మరణించిన చోటే యాదృచ్ఛికంగా విజయ్ మరణిస్తాడు. ఇది కథ.
ఈ ప్రేమ చిత్రంలో “ఘల్లు ఘల్లున గుండె ఝల్లున పిల్ల ఈడు తుల్లిపడ్డది”, “నీ వదనం విరిసే కమలం/ నా హృదయం ఎగిసే కావ్యం”, “నా ప్రేమకే సెలవు/ నా దారికే సెలవు/ కాలానికే సెలవు/ దైవానికే సెలవు…”తో పాటు “ప్రేమ వెలసింది../ మనసులోని మౌనదేవతలా…” లాంటి గీతాలు రచించారు సినారె. ఇక “నిను చూడక నేనుండలేను” విషయానికి వస్తే ఆ కాలంలో అందరినీ ఆకట్టుకున్న చక్కని గీతాల్లో ఒకటి.
పల్లవి:
నిను చూడక నేనుండలేను…
నిను చూడక నేనుండలేను…
ఈ జన్మలో… మరి ఆ జన్మలో… ॥2॥
ఇక ఏ జన్మకైనా… ఇలాగే…
చరణం:
ఏ హరివిల్లు విరబూసినా…
నీ దరహాస మనుకుంటిని…
ఏ చిరుగాలి కదలాడినా…
నీ చరణాల శృతివింటిని… ॥నిను॥
నీ ప్రతిరాకలో… ఎన్ని శశిరేఖలో
నీ… ప్రతిరాకలో… ఎన్ని…
శశిరేఖలో… ॥నిను॥
నిజానికి ఇక్కడ చదవడం కంటే కూడా ఈ గీతాన్ని వింటున్నప్పుడు కలిగే ఆనందం వేరు. గాయకులు ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం, జానకమ్మ మరింత అద్భుతంగా గానం చేశారీ గీతాన్ని. ఈ ప్రణయ యుగళ గీతంలో పల్లవి ఎంత సరళ రస సుందరంగా ఉంటుందో, గీతమంతా అంతకు మించిన కవితా సౌందర్యం మనకు కనిపిస్తుంది. ఆకాశంలో ఇంద్రధనుస్సు పూస్తే ఎంత అందంగా ఉంటుందో మనకు తెలుసు. ఇక్కడ ఆ హరివిల్లులు అంటే తన ప్రేయసి దరహాసమట. ఇంకా కదిలే ప్రతీ గాలి తన ప్రేయసి చరణాలయం శబ్దమట. అక్కడే ఆగలేదు, తర్వాత ఎంత అద్భుతంగా చెబుతాడో చూడండి. తన ప్రేయసి ప్రతిరాకలో ఒక్కటి కాదట ఎన్నో నెలవంకలు విరబూస్తాయట. అర్థం, సౌందర్యం వంటివి సరే! ఈ పాట స్వరవిధానాన్ని నయ్యర్ ఎలా చేశాడో చెబుతూ, ‘పాటలో ఏముంది, నా మాటలో ఏముంది’ గ్రంథంలో “… పై చరణంలోని మొదటి పంక్తినీ మూడవ పంక్తినీ పై స్థాయిలో పలికించి రెండో పంక్తినీ, నాలుగో పంక్తినీ మంద్రస్థాయిలో ఒలికించి నయ్యర్ రాగపరంగా వైవిధ్యాన్ని ప్రకటించాడు. చివరి రెండు పంక్తులను పరమ ముగ్ధంగా పలికించి తన్మయత్వానికి దారులు తీశాడు” అని పేర్కొన్నారు సినారె.
చరణం:
నీ జతగూడి నడయాడగా…
జగమూగింది సెలయేరుగా…
ఒక క్షణమైన నిను వీడినా…
మది తొణికింది కన్నీరుగా…
మన ప్రతి సంగమం..
ఎంత హృదయంగమం ॥2॥
ఈ గీతంలోని చరణాలన్నీ అచ్చుగుద్ది పోతపోసినట్టుగా ఉండటం విశేషం. మొదటి చరణంలో ‘ఏ హరివిల్లు విరబూసినా’ అని ఎలా సాగుతుందో ఇందులోనూ ‘నీ జతగూడి నడయాడగా’ అని మొదలవుతుంది. వీళ్లిద్దరి ప్రయాణాన్ని చూసి లోకమంతా ఆనంద తరంగాల్లో ఊగిందట. తర్వాత సినిమా కథలో వచ్చే ఎడబాటును వాచ్యంగా చెబుతూ, ‘ఒక క్షణమైన’ వీడినా ఆ హృదయం భరించలేదని, ఉండలేదని, అటువంటిది శాశ్వతంగా ఎడబాటును ఎలా తట్టుకుంటాడు అన్న అర్థం కూడా ఉంది. ఈ ఇద్దరి కలయిక ఎంత అద్భుతమని చెప్పాడంటే… వారి “ప్రతి సంగమం… ఎంత హృదయంగమం…” అంటారు కవి. శ్రవణ సుభగమైన ఈ గీతం అత్యంత ప్రజాదరణ పొందిన సినారె పాటల్లో ఒకటి.
…? పత్తిపాక మోహన్
Read Today's Latest Sunday News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
MLA Palla Rajeshwar Reddy | మోదీ,అమిత్ షాతో సీఈసీ కుమ్మక్కు : ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్ రెడ్డి
IND vs WI | టాస్ గెలిచిన వెస్టిండీస్.. ఆ 11 మందితోనే బరిలోకి టీమిండియా..!
‘పట్టభద్రులు ఓటు నమోదు చేసుకోవాలి’
MP Vaddiraju Ravichandra | ప్రధాన ఎన్నికల కమిషనర్ తక్షణమే తప్పుకోవాలి : ఎంపీ వద్ది రాజు రవిచంద్ర
JNU professor | జేఎన్‌యూలో లైంగిక వేధింపుల ఆరోపణలు.. ప్రొఫెసర్‌ను డిస్మిస్ చేసిన యూనివర్సిటీ
ట్రెండింగ్ వార్తలు
iPhone Theft | ఫాస్ట్‌గా పాస్‌కోడ్ చెప్పు.. ఐఫోన్ కొట్టేసి ఓనర్ సిస్టర్‌కే మెసేజ్ పంపిన దొంగ!
Viral News | ఉద్యోగులకు బాస్ బంపర్ ఆఫర్.. ఏకంగా బీఎండబ్ల్యూ కారు గిఫ్ట్!
Watch: మంచంపై పడుకుని పూజారితో బొట్టుపెట్టించుకున్న ఎమ్మెల్యే.. వీడియో వైరల్
Extortion Trap | ఇన్‌స్టాగ్రామ్‌లో పరిచయమైన మహిళను కలిసిన బ్యాంక్ మేనేజర్.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: భార్య, ఆమె ప్రియుడిపై భర్త కాల్పులు.. తర్వాత ఏం జరిగిందంటే?

