ప్రణాళునికి బుద్ధుని మార్గాన్ని వివరిస్తుంటాడు మాధవుడు. రాయవగ్గుతోపాటు స్త్రీలను కాపాడిన పోటిసుడు తీవ్ర గాయాల పాలవుతాడు. అతనికి సేవలు చేస్తున్న రాయహత్థి హఠాత్తుగా ఉలిక్కిపడుతుంది. తర్వాత…
పిసినారికి గల ద్రవ్య మ నుసరించే నీడ వోలె నుండును; ఎండన్ ప్రసరించక నాప దది మ నసు నంటని జ్ఞానమటుల నయగుణ వినుమా! (పిసినారి వద్ద ఉండే ధనం నీడ వంటిది. అది పైనుండి బాధిస్తున్న ఎండ అనే లేమి నుండి ఎప్పుడూ కాపాడదు. అదేవిధంగా మనసుకు అంటని జ్ఞానం కూడా మనిషిని అజ్ఞానాంధకారం నుండి కాపాడలేదు) అంటూ మాధవుడు ప్రణాళునితో ఇంకా ఇలా అన్నాడు. “చీకటిలో ఉన్నవాడికి వెలుతురులోకి రావాలంటే భయం; అజ్ఞానికి జ్ఞానం వెలుగు నచ్చదు; మూఢనమ్మకాలతో బతికేవానికి వాస్తవం అనే కాంతి సరిపడదు. మనో నియంత్రణ అనేది సాధన వల్ల క్రమంగా సాధ్యపడుతుంది. మొదట మనసును క్రమంగా లోబరుచుకునే యోగం నేర్చుకో!” అంటూ ప్రణాళుణ్ని తన వెంట ధ్యాన మందిరానికి తీసుకొని వెళ్లినాడు మాధవుడు.
అంతవరకు రాయహత్థి గమనించనేలేదు, చంద్రహత్థి తన వెంట ఉన్న సంగతి. తనకంటే ఏకాగ్రతతో ఆ యువకుణ్ని చూస్తూ మెదలకుండా ఏదో లోకంలో ఉన్నట్లు కూర్చున్న ఆ పిల్లని చూసి ఉలిక్కిపడింది రాయహత్థి. తమతోపాటు కాపాడబడిన మిగతా ఇద్దరు ఆడవాళ్లు ఎప్పుడో తమతమ ఇండ్లకు చేరుకున్నారు. మరి ఈ చిన్నది సూదంటురాయిని అంటుకున్న ఇనుప ముక్కలా ఇక్కడే ఉన్నది. కారణం అర్థం చేసుకోలేనంత చిన్నపిల్ల కాదు రాయహత్థి. “చంద్రా! ఇంటికి పోలేదేమే?” లోతుగా చూస్తూ అన్నది రాయహత్థి. చంద్రహత్థి నుంచి జవాబుగా టపటప కన్నీటి చుక్కలు జాలువారినాయి. “ఏయ్! పిచ్చిపిల్లా… ఏడుస్తావ్ ఎందుకే?” దగ్గరికి తీసుకున్నది. అప్పుడు కన్నీటికి రోదన తోడైంది. రాయహత్థిని అల్లుకొని వెక్కివెక్కి ఏడ్చింది చంద్రహత్థి. కొంచెం దుఃఖం ఉపశమించిన తర్వాత కళ్లు తుడిచి, మళ్లీ అడిగింది ఏమీ ఎరుగనట్లు రాయహత్థి.. “ఏం జరిగింది? ఎవరేమన్నారు?” అని. జవాబు లేని ప్రశ్న అది. మౌనంతో తృప్తి పడదలచుకోలేదు రాయహత్థి. “ఏం జరిగిందో నాతో చెప్పడానికి ఏమైందే నీకు?” మందలింపులో ప్రేమను రంగరించి వడ్డించింది రాయహత్థి. నోరు తెరవక తప్పని పరిస్థితి ఏర్పడ్డది చంద్రహత్థికి. మాటలను కూడగట్టుకుంటూ… “ఆయన్ని… వదిలి… పోలేక పోతున్న అక్కా!” అంది. అది తానూహించిందే అయినా, చంద్రహత్థి నోట ఆ మాటలు వింటున్నప్పుడు ఒళ్లు జలదరించింది రాయహత్థికి.
ఆ ప్రకంపన ఇద్దరి శరీరాలను కుదిపింది. నెమ్మదిగా ఇద్దరూ విడివడ్డారు. అంతలోనే గుమ్మం ముందు ఏదో అలికిడి అయ్యింది. ఇద్దరూ తలతిప్పి చూసినారు. చంద్రహత్థి తల్లీ, తండ్రి! బిడ్డను చూడగానే ఒక్క ఉదుటున చేరుకొని గట్టిగా పట్టుకొని ఏడ్చింది తల్లి. తల్లిని వాటేసుకుని అంతకంటే అధికంగా ఏడ్చింది చంద్రహత్థి. ఇద్దరినీ చూసి ఇలా అనుకున్నది రాయహత్థి… ఇరువురికిని దుఃఖ మేర్పడె నిజముగా తల్లి ఏడుపంత తనయ కొరకు తనయ దుఃఖ మిపుడు తల్లి ప్రేమను మించె నెడద లోతు నెరుగు టెవరి తరము? (తల్లీకూతుళ్లను నిజంగా దుఃఖం ఆవహించింది. తల్లి కూతురుని చూసి ఏడుస్తున్నది. కూతురేమో మనసునిండా ఆరాధిస్తున్న ప్రియుని తలుచుకొని ఏడుస్తున్నది. ఏ లోతునైనా తెలుసుకోవచ్చు కానీ మనసు లోతును కొలవడం ఎవరితరం?) అనుకుంటూ లోలోన నవ్వుకున్నది. చంద్రహత్థిని ఆమె తల్లిదండ్రులు తమవెంట తీసుకొని పోయినారు. కసాయి వెంట నడిచే మేక పిల్లలా వాళ్లను అనుసరించింది చంద్రహత్థి. అప్పుడే మెల్లగా కళ్లు తెరిచినాడు పోటిసుడు. ఏదో చెప్పాలన్న అతని ప్రయత్నాన్ని గమనించి భర్తను రమ్మని పిలిచింది రాయహత్థి.
వామదేవుడు ఎంత బతిమాలినా ఎంగిలి పడలేదు కువిందుడు. చివరకు జయసేనుని చూసేదాకా అతను నోరు కూడా మెదపలేదు. విషయమంతా తెలుసుకున్న జయసేనుడు చలించి పోయినాడు. “ఏమిటిది కువిందు…? లే! లేచి ఈ పాలు తాగు….” అంటూ చషకం నిండా వేడి పాలను అందించినాడు జయసేనుడు. తప్పనిసరిగా ఆ చషకాన్ని అందుకొని కన్నీటి పర్యంతమైనాడు కువిందుడు. “కువిందూ… నేను నీ బిడ్డలాంటి వాడను. నీ చేతుల్లోనే పెరిగినవాడను. నిన్ను కొట్టడం తప్పే…” అంటుంటే జయసేనుని కళ్లల్లోకి నీరు తన్నుకొచ్చింది. ఆపై మాట్లాడలేక పోయినాడు. “తమరు కొట్టినందుకు బాధలేదు రాజా! కానీ, నా కార్యాన్ని హఠాత్తుగా ఇట్లా చెడగొట్టడమే నాకు జీర్ణం కాలేదు” నొచ్చుకుంటూనే పాల పాత్రను నోటి వద్దకు చేర్చుకున్నాడు కువిందుడు. తన యజమాని చేసిన మిగతా పని పట్ల అతనికి ఏ ఆందోళన లేదు. భార్య కోసం అతను చేసిన సాహసం లోలోన ఆనందం కూడా నింపింది. “సరే! ఇక ప్రశాంతంగా నిద్రపోయి, ఉదయమే లేచి ఇంటికిపోయి తీరుబడిగా శ్రేష్ఠి గారి మేడకు వెళ్లు. నీకు మంచి మర్యాదలు చేసినారని, అక్కడ ఇవ్వవలసిన సమాచారం ఇచ్చి వచ్చినానని అమ్మగారికి చెప్పు” చేయవలసిన పనిని వివరించినాడు వామదేవుడు.
* * *
కార్తిక బహుళ పంచమి. మల్లికాపురిలో తమ వియ్యపురాలు ఇంట్లో సిరిసత్తి చేసిన హడావుడి ఇంతా అంతా కాదు. కొత్త కోడలిని కాపురానికి తీసుకొని రావడానికి 32 ఎద్దుల బండ్ల నిండా సంభారాలు తీసుకొని పోయిందంటే, ఆ కార్యక్రమం ఎంత ఘనంగా సిరిసత్తి నిర్వహించిందో చెప్పనవసరం లేదు. ఊరిలోని ముత్తయిదువులు అందరినీ పిలిపించి చీర సారెలు పెట్టింది. వయోవృద్ధులైన పెద్ద ముత్తయిదువులను పిలిపించి వాళ్లకు సువర్ణ దానం చేసి, తన ఇల్లు పిల్లాపాపలతో నిండుగా కళకళలాడేటట్లు కోడలికి దీవెనలు ఇప్పించింది. దంపతులందరినీ ప్రత్యేకంగా ఆహ్వానించి వాళ్లకు వస్త్రాలు సమర్పించి, తన కొడుకు కోడళ్లకు దీవెనలు అందించమని కోరింది. బ్రాహ్మణులకు గోదానాలు చేసింది. శ్రమణకులకు ప్రత్యేక భిక్ష సమర్పించింది. కొడుకును చూడాలన్న ఆశ వ్యక్తం చేసిన వాళ్లకు.. “వచ్చే ఏడాదికి మనుమడితో పాటు వస్తాడు” అని ఆనందంగా చెప్పింది. మల్లికాపురి వాసులంతా రోహమ్మ పెళ్లి కంటే కాపురానికి తీసుకొని పోయే పండుగ చాలా గొప్పగా జరిగిందని చెప్పుకొని మురిసిపోయినారు. కొన్ని తరాల దాకా చెప్పుకునేటట్లు సిరిసత్తి గారు దానధర్మాలు చేసినారని కొనియాడినారు. రోహమ్మ కాపురం సుఖ సంతోషాలతో సాగాలని నిండు మనసుతో దీవెనార్తులు ఇచ్చినారు. షష్ఠి రోజు తెల్లవారుజామునే తిరుగు ప్రయాణం అవుతానని చెప్పిన సిరిసత్తిని సున్నితంగా అడ్డుకున్నది రోహతల్లి అహయాదేవి. “అదేమి వదినా? ఏండ్ల తర్వాత వచ్చినారు. ఇట్లా వచ్చి అట్లా వెళ్తాను అనడం నా మనసుకు చాలా వెలితిగా ఉంది…” “అయినా…” ఏదో చెప్పబోయింది సిరిసత్తి.
సిరిసిత్తికి అవకాశం ఇవ్వకుండా కొనసాగించింది అహయా. “మీ బంట్లు మహావీరులు. మీకు ఎటువంటి ఆపద రాకుండా చూసుకోగలరు. ఆ విషయం మొన్ననే మాకు అనుభవంలోకి వచ్చింది. 50 ఏళ్ల పైబడ్డ మామూలు సేవకుడే మా యోధులను క్షణంలో కొట్టి, మాట్లాడకుండా పడవేసినాడు అంటే, ఇక వయసులో ఉండే మీ బంట్లను ఎదుర్కోవడం ఆ బ్రహ్మతరం కూడా కాదు…” చెప్పుకొని పోతున్నది అహయాదేవి. ఆశ్చర్యంతో సిరిసత్తి కనుబొమలు ముడివడ్డాయి. తల్లి అనూహ్యంగా ఆ ప్రస్తావన తేవడం చూసి రోహ, సీహ గతుక్కుమన్నారు. ‘కువిందుడు ఎవరితోనూ పోరాడే స్వభావం గలవాడు కాదుకదా! మీ వాళ్లతో ఎందుకు పోట్లాడినాడు?’ అని అడగాలనుకున్నది సిరిసత్తి. కానీ, అహయా మాటల ప్రవాహంలో పడి వెంటనే అడగలేక పోయింది. “నేను మిమ్మల్ని ప్రార్థిస్తున్నా అనుకోండి; బతిమిలాడుతున్నా అనుకోండి.. మరేమైనా అనుకోండి. రేపు షష్ఠినాడు ఇక్కడే ఉండి మీ కోడలితో శ్రీలక్ష్మీ వ్రతం చేయించి.. సప్తమి నాడు తెలతెలవారుతుండగానే సంతోషంగా బయలుదేరి వెళ్లండి” వినమ్రంగా చేతులు జోడించింది అహయ. ఆమె అభ్యర్థన సిరిసత్తికే కాదు, అహయా కూతుళ్లు ఇద్దరికీ రుచించలేదు. ముఖ్యంగా రోహకు. ‘ఎప్పుడెప్పుడు నా పతి దేవుణ్ని కలుసుకొని, ఆయన గుండెల మీద పడుకొని జరిగిన సంగతులన్నీ ఆయనతో పంచుకోగలనా…’ అని ఎదురుచూస్తున్న ఆ నవోఢ
(కొత్తగా పెళ్లి అయిన స్త్రీ)కి తల్లి మాటలు పిడుగుపాటులా అనిపించినాయి. సిరిసత్తి తన వియ్యపురాలి కోరికను మన్నించాలో… లేదో… అన్న సందిగ్ధ స్థితిలో ఉండగానే… “మీరు ఉంటున్నారు.. అంతే!”అన్నది అహయాదేవి. భర్త మేఘచంద్రుడు కూడా భార్య మాటను గట్టిగా బలపరచడంతో మరేమీ మాట్లాడలేక పోయింది సిరిసత్తి. అది అనేక ఉపద్రవాలకు కారణం కాగలదని ఆ క్షణం ఎవరూ ఊహించలేదు. (సశేషం) “కువిందూ… నేను నీ బిడ్డలాంటి వాడను. నీ చేతుల్లోనే పెరిగినవాడను. నిన్ను కొట్టడం తప్పే…” అంటుంటే జయసేనుని కళ్లల్లోకి నీరు తన్నుకొచ్చింది. ఆపై మాట్లాడలేక పోయినాడు. “తమరు కొట్టినందుకు బాధలేదు రాజా! కానీ, నా కార్యాన్ని హఠాత్తుగా ఇట్లా చెడగొట్టడమే నాకు జీర్ణం కాలేదు” నొచ్చుకుంటూనే పాల పాత్రను నోటి వద్దకు చేర్చుకున్నాడు కువిందుడు.