ఒకప్పుడు నాన్న టూర్ ప్లాన్ చేస్తే.. ‘అబ్బ! అవే గుళ్లు, గోపురాలు, అవే పాత పద్ధతులు, ప్లానింగ్స్’ అని పెదవి విరిచేవాళ్లు. పేరెంట్స్ ఎంతో జాగ్రత్తగా హోటల్ గదిలో వస్తువులన్నీ సర్దుతుంటే.. ‘మరీ ఇంత జాగ్రత్తా!’ అని ఎగతాళి చేసేవాళ్లు. కానీ, కాల చక్రం తిరుగుతుంది. ఇప్పుడు అలా మాట్లాడిన పిల్లలే సరిగ్గా అలాగే తయారవుతున్నారట! అదే ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా సాగుతున్న సరికొత్త ట్రావెల్ ట్రెండ్ ‘పేరెంట్-పింగ్’. విహారయాత్రల్లో మన ప్రవర్తన అచ్చం మన పేరెంట్స్నే పోలి ఉంటున్నదని ఓ నివేదిక చెబుతున్నది.
యవ్వనంలో ఉన్నప్పుడు అడ్వెంచర్లు, అర్ధరాత్రి పార్టీలు కోరుకున్న వారే.. ఇప్పుడు వెకేషన్కు వెళ్తే మాత్రం కాస్త ‘క్లాసిక్’ పద్ధతులకు మళ్లుతున్నారట. ‘వెళ్లాక చూద్దాంలే’ అన్న ధీమా పోయి.. హోటల్ బుకింగ్స్, టికెట్లు అన్నీ మూడు నెలల ముందే పక్కాగా ఉన్నాయో లేదో అని మన పెద్దల్లాగా పదే పదే చెక్ చేసుకుంటున్నారట. విమానం ఎక్కడానికి మూడు గంటల ముందే ఎయిర్పోర్ట్కు వెళ్లి కూర్చుంటున్నారట! కన్నవారు చేసిన ఈ పనిని ఒకప్పుడు వింతగా చూసిన పిల్లలు, ఇప్పుడు కచ్చితంగా అదే ఫాలో అవుతున్నారు.
చిన్నప్పుడు మన అమ్మ బ్యాగులో మెడిసిన్ బాక్సు నుంచి స్నాక్స్ దాకా అన్నీ ఉంచేది. ఇప్పుడు వీళ్లు బ్యాగ్ సర్దుతున్నప్పుడు మా ‘అమ్మ’ కనిపిస్తున్నదని చెబుతున్నారు. దుస్తులు నీట్గా ఫోల్డ్ చేయడం, అత్యవసర మందుల కిట్ దగ్గర ఉంచుకోవడం, చివరకు వాటర్ బాటిల్ విషయంలోనూ రాజీ పడకపోవడం.. ఇవన్నీ వారిలో తెలియకుండానే ఫాలో అయిపోతున్నారు నేటి యువత. అడ్వెంచర్ల కంటే.. హాయిగా సేదదీరడం, నాణ్యమైన ఆహారం దొరికే ప్రదేశాలకే ఇప్పుడు ప్రాధాన్యం ఇస్తున్నారు. దీన్నే ‘స్లో ట్రావెలింగ్’ అని ఇప్పుడు ట్రెండీగా పిలుస్తున్నా.. ఇది మన పెద్దలు ఎప్పటి నుంచో చేస్తున్నదే!