మహా సుందరాంగుల కళ్లకు సరిపోయే అందం నేరేడుది. ఎందరో కవులు సృజించిన కవిత్వంలో కథానాయిక అందానికి ఆసరా అయింది. నునుపుదేలి నిగనిగలాడే ఈ నేరుడు ఎంతో ఆకర్షణీయంగా ఉంటుంది. అల్ల నేరేడు చెట్టు రావి, మర్రి చెట్లంత పెద్దది కాదు. కానీ మరీ చిన్నదీ కాదు. దాదాపు 30 అడుగుల ఎత్తు వరకు పెరుగుతుంది. ఇది వందేళ్ల దాకా బతుకుతుంది.
దీని ఆకులు దళసరిగా, పొడవుగా ఉంటాయి. అల్లనేరేడు చెట్లు వర్షాకాలం.. అంటే జూలై నుండి అక్టోబరు మాసాల్లో విరివిగా పండ్లను కాస్తాయి. సాగదీసిన గుండ్రని ఆకారంలో ఉంటాయివి. ముదురు వంకాయ రంగులో చూడగానే తినాలనిపించేలా ఉండే ఈ నేరేడు పండ్లలో అనేక ఔషధగుణాలున్నాయి. ఈ పండ్లు తింటే కిడ్నీలోని రాళ్లు కరిగిపోతాయి. నేరేడు పండులో ఉండే సహజ సిద్ధమైన ఆమ్లాలు కాలేయాన్ని ఆరోగ్యంగా ఉంచడానికి దోహదపడతాయి. నేరేడు విత్తనాలను ఎండబెట్టిన తర్వాత పొడిచేసి మధుమేహ నివారణ ఔషధాల తయారీలో ఉపయోగిస్తారు. నేరేడు చెక్కని నీళ్లలో ఉండికించి కషాయం తీస్తారు. ఆ నీటితో పుక్కిలిస్తే, నోటి అల్సర్లు (పుండ్లు) తగ్గిపోతాయి. నేరేడు చెట్లు మన దేశంలో చాలా సులభంగా పెరుగుతాయి. ఈ చెట్టు ఆకులు కాల్చి, పొడిచేసి పళ్లు తోముకుంటే తెల్లగా మిలమిల మెరుస్తాయి.
నేరేడు చిగురాకులు తేనెతో కలిపి తీసుకుంటే పైత్యపు వాంతులు ఆగిపోతాయి. ఈ ఫలాలు తినడం వల్ల వ్యాధినిరోధకత పెరుగుతుంది. నేరుడులో అధిక మోతాదులో సోడియం, పొటాషియం, కాల్షియం, ఫాస్పరస్, మాంగనీస్, జింక్, ఐరన్, విటమిన్-సి, విటమిన్-ఎ, విటమిన్-బి2 (రిబోఫ్లేవిన్), ఫోలిక్ ఆమ్లం ఉంటాయి. నేరేడు రోజూ తింటే రక్తహీనత తగ్గుతుంది. రైతులు నేరేడు కలపతో వ్యవసాయ పనిముట్లు తయారు చేస్తారు. రోడ్డు పక్కన, అడవుల్లో పెరిగే ఈ చెట్లను ఇప్పుడు రైతులు వాణిజ్య పంటగా పెంచుతుండటం గమనార్హం. ఈ పండ్లలో విత్తనం పెద్దగా, గుజ్జు తక్కువగా ఉంటుంది. అయినా ఈ గుజ్జుని సేకరించి, నిలువచేసి అన్ని కాలాల్లో వినియోగించేలా కొన్ని వాణిజ్య సంస్థలు అందుబాటులోకి తెస్తున్నాయి. మన దేశంలో కొంత భూభాగం పోర్చుగీసు వారి పాలనలో ఉన్నప్పుడు బ్రెజిల్ కూడా వాళ్ల ఏలుబడిలోనే ఉండేది. నేరేడు రుచి పోర్చుగీసువారికి బాగా నచ్చి, దాని విత్తనాలను బ్రెజిల్కి తీసుకుపోయారు. ఇప్పుడా దేశమంతటా నేరేడు విస్తరించింది.