చూడటానికి ఇదో లాకెట్‌లా కనిపిస్తుంది. వేటితోనైనా ఇట్టే కలిసిపోయి నిఘా వేస్తుంది. ఎక్కడంటే అక్కడ కీచైన్లను మార్చిపోయే అలవాటు ఉంటే దీన్ని తాళాల గుత్తికి తగిలిస్తే సరి. మొబైల్ ఫోన్కీ అమర్చుకోవచ్చు. బ్యాగులో ఒకటి పెట్టేయొచ్చు. అన్ని ట్రాకర్లను ప్రత్యేక యాప్‌తో మానిటర్ చేయొచ్చు. బ్లూటూత్ నెట్వర్క్ ద్వారా ఫోన్‌తో జతకట్టి పనిచేస్తుంది. ఒకవేళ ట్రాకర్‌ని తగిలించిన వస్తువుని మర్చిపోతే 30 మీటర్ల పరిధిలో వెతికి పట్టేయొచ్చు. ఇల్లు లేదా వీధిలో ఏదైనా పడిపోతే క్షణాల్లో ఎక్కడుందో తెలిసిపోతుంది. ట్రాకర్‌లోని అలారంని మోగించి ఎక్కడున్నా చిటికెలో పట్టేయొచ్చు. ఒకవేళ బ్లూటూత్ పరిధిలో లేకుంటే చివరిగా ట్రాకింగ్ నమోదైన చోటు ఆధారంగా వెతకొచ్చు. ట్రాకర్ మీ చేతిలో ఉండి ఫోన్‌ని ఎక్కడైనా మర్చిపోతే అప్పుడూ ఫోన్ జాడని చేప్పేస్తుంది. మధ్యలో ఉన్న బటన్ని నొక్కడం ద్వారా ఫోన్ అలారం మాదిరిగా రింగ్ అవుతుంది. ట్రెండీగా పలు రకాల మోడళ్లుగా టైల్ ట్రాకర్లు అందుబాటులో ఉన్నాయి.
బ్యాగు సర్దుకునేటప్పుడే దుస్తుల్లో ఒదిగిపోతుంది. దూర ప్రాంతాలకు విమానాల్లో వెళ్లాల్సివస్తే మీ మొత్తం లగేజికీ ఈ బుజ్జి పరికరం రక్షకుడిగా మారిపోతుంది. ఉదాహరణకు విమాన ప్రయాణాల్లో చెక్ఇన్ అయ్యాక లగేజీ దారిన అది వెళ్లిపోతే.. తిరిగి మీ చేతికి వచ్చేవరకూ బ్యాగు లేదా సూట్‌కేస్‌పై కృత్రిమ మేధతో నిఘా వేస్తుంది. విమానం టేకాఫ్ కాగానే విమానయాన షరతుల ప్రకారం ప్రత్యేక సెన్సర్ వ్యవస్థతో ఆటోమాటిక్ పరికరం స్లీప్ మోడ్‌లోకి వెళ్లిపోతుంది. తిరిగి ఎప్పుడు విమానం ల్యాండ్ అవుతుందో.. వెంటనే ఆన్ అయిపోయి లైవ్ ట్రాకింగ్ ద్వారా బ్యాగు మీ చేతికి చేరేవరకూ మొబైల్ తెరపై చూపిస్తుంది. మన దేశంలో రుచికరమైన వంటల్ని అమెరికాలో ఉన్న బంధువులకు పంపుతున్నట్టయితే.. ట్రాకర్‌ని పార్సిల్లో ఉంచితే చాలు. పంపిన అడ్రస్‌కి చేరేవరకూ ఎప్పటికప్పుడు ట్రాక్ చేస్తూ చూడొచ్చు అన్నమాట. ఒకవేళ తప్పు అడ్రస్‌కి చేరితే వెంటనే అలర్ట్ అవ్వొచ్చు.
ప్రయాణాల్లో అప్పుడప్పుడూ బ్యాగులు తారుమారు అవ్వొచ్చు. పొరపాటున ఒకరి బ్యాగు మరొకరు తీసుకెళ్లేందుకు అవకాశమూ లేకపోలేదు. అలాంటప్పుడు గంపెడు లగేజీని భద్రంగా చూసుకునేందుకు JioTag Air స్మార్ట్ ట్రాకర్‌ని వాడొచ్చు. బ్లూటూత్ నెట్వర్క్ ద్వారా ఫోన్‌తో జతకట్టి పనిచేస్తుంది. విమానాల్లో ప్రయాణాలు చేయాల్సివస్తే నిశ్చింతగా లగేజీని మానిటర్ చేయొచ్చు. పొరపాటున బ్యాగు లేదా సూట్‌కేస్ తెరుచుకుంటే.. మీకు వెంటనే అలర్ట్ చేస్తుంది. పర్సులో పెట్టుకునీ వాడొచ్చు. దీంతో ఎక్కడైనా పడిపోయినా.. ఎవరైనా దొంగిలించినా బ్లూటూత్ పరిధిని దాటి వెళ్తున్నట్టయితే.. వెంటనే మొబైల్‌కి అలర్ట్ వచ్చేస్తుంది.
వీకెండ్ పేరుతో కారు తీసుకుని అలా బయటికి వెళ్లొస్తా అని చెప్పిన పిల్లలు ఎక్కడికి వెళ్తున్నారు? ఒకటి చెప్పి మరో చోటుకు వెళ్తున్నారా? అయితే, వారికి తెలియకుండా నిఘా వేస్తే! అందుకు అనువైనదే ఇది. దీన్ని కారులో పెడితే చాలు. దాన్ని తీసుకెళ్లినవారు ఎక్కడెక్కడ తిరుగుతున్నారో లైవ్‌లో చూడొచ్చు. అంతేకాదు.. ‘జియో ఫెన్సింగ్’ వేయొచ్చు. అంటే.. మీరు నిర్దేశించిన ప్రాంతాన్ని దాటివెళ్తే, ఆ విషయం మీకు తెలిసేలా సెట్ చేయవచ్చు. నోటిఫికేషన్ రూపంలో మీకు అలర్ట్ వస్తుంది. మితిమీరిన వేగంలో నడిపినా మీకు తెలియజేస్తుంది. కార్లలోనే కాదు. పిల్లల బ్యాగులో ఉంచి కూడా నిఘా వేయొచ్చు. దీనికి అమర్చిన బ్యాటరీ రెండు వారాలపాటు పనిచేస్తుంది. ఫోన్, ట్యాబ్, కంప్యూటర్లలో స్పైటెక్ వెబ్సైట్లో వివరాల్ని సులభంగా యాక్సెస్ చేయొచ్చు. ఏడాదిపాటు రికార్డు చేసిన డేటా బ్యాక్అప్ అవుతుంది.