పోకో నుంచి కొత్త మిడ్ ప్రీమియం ఫోన్ వస్తున్నదంటే.. ఫ్యాన్స్‌లో ఆసక్తే వేరు. ఎందుకంటే.. మిడిల్ క్లాస్‌కి బడ్జెట్లోనే హై ఎండ్ లుక్‌తో ఫోన్లను పరిచయం చేసింది పోకోనే! ఈ హవా ఏ మాత్రం తగ్గకుండా పోకో ఎఫ్7 5జీ పేరుతో మరో ఫోన్‌ని విడుదల చేస్తున్నది. ఇది డ్యూయల్ టోన్.. బ్లాక్, సిల్వర్ కలర్స్‌తో ప్రత్యేకమైన ‘లిమిటెడ్ ఎడిషన్”లో వస్తున్నది. ఫోన్లో స్నాప్‌డ్రాగన్ 8ఎస్ జెన్ 4 ప్రాసెసర్ వాడారు. హై స్పీడ్‌తో ఫోన్‌ను కంఫర్ట్‌గా వాడొచ్చు. 6.83 అంగుళాల AMOLED డిస్ప్లే.
ర్యామ్ 12 జీబీ. ఇంటర్నల్ స్టోరేజ్ 512జీబీ వరకు ఉండే అవకాశం ఉంది. కెమెరా విషయానికొస్తే.. 50 మెగాపిక్సల్. Sony IMX882 లెన్స్‌ని నిక్షిప్తం చేశారు. దీనికి జతగా 8ఎంపీ అల్ట్రావైడ్ కెమెరా ఉంది. సెల్ఫీల కోసం 20ఎంపీ ఫ్రంట్ కెమెరాని ఏర్పాటుచేశారు. బ్యాటరీ సామర్థ్యం 7550mAh. 90W ఫాస్ట్ చార్జింగ్ సపోర్ట్ ఉంది. అంటే, ఒక్కసారి చార్జ్ చేస్తే చాలాసేపు వాడొచ్చు, దీంతో మరో ఫోన్ కూడా చార్జ్ చేయొచ్చు. ఎందుకంటే ఇందులో 22.5W రివర్స్ చార్జింగ్ సదుపాయం కూడా ఉంది!
స్మార్ట్ఫోన్లలో వన్‌ప్లస్‌కి ఉండే క్రేజ్ వేరు. యాపిల్ ఉత్పత్తుల తర్వాత టీన్స్ ఎక్కువగా దీనికే ఓటేస్తుంటారు. అందుకే కంపెనీ మిడ్ రేంజ్లో మస్తీ ఫీచర్స్‌తో ‘నార్డ్’ సిరీస్‌ని పరిచయం చేసేందుకు సిద్ధమైపోయింది. వన్‌ప్లస్ తన కొత్త నార్డ్ సిరీస్‌లో రెండు ఫోన్లను భారత్‌లో విడుదల చేయనుంది. ఈ సిరీస్‌లో వన్‌ప్లస్ నార్డ్ 5, నార్డ్ 5 సీఈ ఫోన్లు ఉన్నాయి. వీటితోపాటు వన్‌ప్లస్ బడ్స్ 4 కూడా పరిచయం కానుంది. వన్‌ప్లస్ నార్డ్ 5 ఫోన్లో స్నాప్‌డ్రాగన్ 8ఎస్ జెన్ 3 ప్రాసెసర్ ఉండొచ్చని టెక్ నిపుణుల అంచనా.
ఈ సూపర్ స్పీడ్ ప్రాసెసర్‌తో ఫోన్ మెరుపు వేగంతో పనిచేస్తుంది. గేమ్ స్మూత్‌గా.. ఎలాంటి ల్యాగ్ లేకుండా నడుస్తుంది. ప్రత్యేక కూలింగ్ సిస్టమ్‌తో ఎక్కువసేపు ఆడినా ఫోన్ వేడెక్కదు. స్క్రీన్ సైజు 6.83 అంగుళాలు. AMOLED డిస్ప్లే. బ్యాటరీ విషయానికొస్తే.. 6700mAh బ్యాటరీ. ఫోన్ చూడ్డానికి స్టయిలిష్‌గా డిజైన్ చేశారు. వెనుకవైపు నిలువుగా రెండు కెమెరాలు ఉంటాయి. ఇక ‘నార్డ్ 5 సీఈ’ విషయానికొస్తే.. బడ్జెట్ ఫోన్. బెస్ట్ ఫీచర్లు ఉన్నాయి. తెర పరిమాణం 6.7 అంగుళాలు. OLED డిస్ప్లే. మీడియాటెక్ డైమెన్సిటీ 8350 చిప్‌ని వాడారు. దీంట్లో బ్యాటరీ ప్రత్యేకమైంది. 7100mAh. దూర ప్రయాణాలు చేసేవారికి, ఫోన్ ఎక్కువగా వాడేవారికి చాలా ఉపయోగపడుతుంది.
సంగీతం లేకుండా రోజు గడవదు. పార్టీ అయినా, ప్రయాణమైనా.. వెంట ప్లే లిస్ట్ ఉండాల్సిందే. ఈ క్రమంలో మీ జర్నీ, పర్సనల్ స్పేస్‌లో మంచి సౌండ్‌తో పాటలు వినాలనుకుంటే.. ఎఫ్ ఫెరాన్స్ స్పీకర్‌ని ప్రయత్నించొచ్చు. ఇదో బుజ్జి బ్లూటూత్ స్పీకర్. చూడటానికి చిన్నగా ఉన్నా, సౌండ్ మాత్రం అదిరిపోతుంది. బ్లూటూత్ వెర్షన్ 4.2 తో వస్తుంది. ఫోన్, టాబ్లెట్, ల్యాప్‌టాప్.. ఇలా ఏ మీడియా గ్యాడ్జెట్కైనా సులభంగా కనెక్ట్ అవుతుంది.
అంటే కేబుల్స్ గోల లేకుండా హాయిగా పాటలు వినొచ్చు. మెమరీ కార్డులో పాటలు ఉంటే నేరుగా స్పీకర్లో పెట్టి వినొచ్చు. పాత పద్ధతిలో ఆక్స్ కేబుల్ ద్వారా కూడా కనెక్ట్ చేసుకోవచ్చు. ఇది వాటర్ రెసిస్టెంట్. అంటే చిన్నపాటి చినుకులు పడినా, తడి తగిలినా పాడవదు. అందుకే మీరు దీన్ని ఎక్కడికైనా హాయిగా తీసుకెళ్లొచ్చు. దీనికి ఒక ‘రిమూవబుల్ హ్యాంగింగ్ రోప్’ కూడా ఉంది. 800mAh కెపాసిటీ గల బ్యాటరీతో ఇది వస్తుంది. 4 గంటల వరకు బ్యాకప్ ఇస్తుంది. సో.. స్పీకర్‌తో అద్భుతమైన మ్యూజిక్ అనుభవాన్ని ఆస్వాదించవచ్చు.
సాధారణంగా కొత్త ల్యాప్‌టాప్ కొంటున్నామంటే.. ధర, ప్రాసెసర్, స్క్రీన్ సైజు, బ్యాటరీ లైఫ్ వంటివి చూస్తాం కదా. అందుకే ఆసుస్ అవన్నిటినీ పరిగణనలోకి తీసుకుని ల్యాప్‌టాప్‌లను పరిచయం చేస్తున్నది. వివో బుక్ సిరీస్ పేరుతో ఓ నాలుగు మోడళ్లను మార్కెట్లో విడుదల చేస్తున్నది. వీటిలో మైక్రోసాఫ్ట్ ఆఫీస్ హోమ్ 2024 (లైఫ్‌టైమ్ వ్యాలిడిటీతో), 100 జీబీ మైక్రోసాఫ్ట్ 365 బేసిక్ వన్‌డ్రైవ్ క్లౌడ్ స్టోరేజ్ (ఒక సంవత్సరం పాటు) ఉచితంగా లభిస్తాయి. ఇది విద్యార్థులకు, ఐటీ నిపుణులకు చాలా ఉపయోగపడుతుంది. ఇక ఒక్కో ల్యాపీ విషయానికొస్తే.. ఎస్14 క్వాల్కామ్ స్నాప్‌డ్రాగన్ ఎక్స్ సిరీస్ ప్రాసెసర్‌తో వస్తుంది.
ఇందులో ప్రత్యేకంగా న్యూరల్ ప్రాసెసింగ్ యూనిట్ ఉంది. దీంతో ఏఐ ఆధారిత పనులు.. ఫొటో ఎడిటింగ్, వీడియో ప్రాసెసింగ్ వంటివి చాలా వేగంగా, సమర్థంగా చేయవచ్చు. ఒక్కసారి చార్జ్ చేస్తే సుమారు 70 గంటలు బ్యాటరీ బ్యాకప్ అందిస్తుంది. 14 అంగుళాల 2.5కె డిస్ప్లేతో వస్తుంది. మరో మోడల్ ఎస్16.. పెద్ద స్క్రీన్ కావాలి అనుకునే వారికి ఇది ప్రత్యేకం. ఇందులో ఇంటెల్ కోర్ అల్ట్రా 7 255హెచ్ ప్రాసెసర్ ఉంది. తెర పరిమాణం 16 అంగుళాలు. OLED స్క్రీన్ కావడంతో రంగులు చాలా స్పష్టంగా, ప్రకాశవంతంగా కనిపిస్తాయి.