ఒకప్పుడు కిలోబైట్ల (కేబీ)లో ఉండే ఫొటోలు.. ఇప్పుడు మెగా బైట్ల (ఎంబీ)లోకి మారిపోయాయి. ఇక సినిమాలైతే.. గిగా బైట్లలోనే ఉంటున్నాయి. హై రిజల్యూషన్ ఫొటోలు, 4కే సినిమాలను కంప్యూటర్లు, ల్యాప్‌టాప్‌లలో స్టోర్ చేసుకోవడం కష్టమైపోతున్నది. వాటిని ఒకచోటు నుంచి మరో చోటుకు తరలించడం కూడా గగనమైపోతున్నది. ఈ సమస్యకు పరిష్కారమే.. కింగ్స్టన్ ఎక్స్ఎస్1000. అతి తేలికగా, కేవలం 28.7 గ్రా. బరువు మాత్రమే ఉండే ఈ ఎక్స్టర్నల్ ఎస్ఎస్డీ డ్రైవ్‌ను ఎక్కడికంటే అక్కడికి తీసుకెళ్లే అవకాశం ఉన్నది. అత్యాధునిక యూఎస్బీ 3.2 జెన్2తో కనెక్ట్ అవుతూ.. 1050 ఎంబీపీఎస్ వేగంతో డేటాను ట్రాన్స్ఫర్ చేస్తుంది. 1టీబీ, 2టీబీ వేరియంట్లలో ఈ ఎస్ఎస్డీ డ్రైవ్ లభిస్తుంది. దాంతో పీసీ, ల్యాపీలో స్టోరేజీ సమస్యకు కూడా పరిష్కారం దొరుకుతుంది. హై క్వాలిటీ ప్లాస్టిక్, స్టీల్‌ను ఉపయోగించి తయారుచేయడంతో.. -20 డిగ్రీల సెంటీగ్రేడ్ నుంచి 85 డిగ్రీల సెంటీగ్రేడ్ ఉష్ణోగ్రతలను తట్టుకుంటుంది. విండోస్ 11, 10తోపాటు మ్యాక్ ఓఎస్పైనా పనిచేస్తుందిది. ఐదేళ్ల వారంటీతో వస్తున్న కింగ్స్టన్ ఎక్స్ఎస్1000 ఖరీదు.. రూ. 8,250. kingston.com , అన్ని ఆన్లైన్, ఆఫ్‌లైన్ స్టోర్లలో లభిస్తుంది.

పర్సును ఎక్కడో పెట్టి.. ప్యాంటు జేబులను తడుముకొని చూస్తుంటాం. ఓ పక్క ఆఫీస్ టైమ్ అవుతుంటే.. బైక్ కీ కోసం కనీసం పది నిమిషాలైనా వెతుకులాట కొనసాగిస్తాం. అర్జెంట్‌గా బయటికి వెళ్లే పని ఉన్నప్పుడే.. అవసరమైన వస్తువులు కనిపించక పిచ్చెక్కి పోతాం. ఇలాంటి వెతుకులాటలకు చెక్ పెట్టేందుకు ‘చిపోలో’ సంస్థ.. ‘వన్ పాయింట్’ డివైజ్‌ను డిజైన్ చేసింది. గూగుల్ ‘ఫైండ్ మై డివైజ్’ యాప్‌తో పనిచేసే ఈ వన్ పాయింట్ పరికరం.. పిన్ పాయింట్ లోకేషన్‌ను కూడా ట్రాక్ చేస్తుంది. దీనిని మీ బైక్ కీ చెయిన్‌కు వేలాడదీస్తే చాలు.. మీ ఇంట్లో ఆ కీ ఎక్కడుందో మీ స్మార్ట్‌ఫోన్‌లో చూపెడుతుంది. స్మార్ట్‌ఫోన్ సాయంతో దీనిని రింగ్ కూడా చేయవచ్చు. అంతేకాదు.. పోగొట్టుకున్న లగేజ్, బ్యాక్‌ప్యాక్ ఎంత దూరంలో ఉన్నదో కూడా చెబుతుంది. ఐపీఎక్స్ 5 వాటర్ రెసిస్టెంట్‌తో వస్తున్న ఈ ‘చిపోలో వన్ పాయింట్’ ధర. రూ. 3,100. chipolo.netతోపాటు అన్ని ఆన్లైన్, ఆఫ్‌లైన్ స్టోర్లలో దొరుకుతుంది.

నీటిని ఆధునిక పద్ధతుల్లో శుద్ధి చేసుకోవడానికి అమెరికాకు చెందిన ‘లార్క్’ సంస్థ.. సరికొత్త ‘వాటర్ మగ్ కమ్ ప్యూరిఫయర్’ను రూపొందించింది. తాగునీటి ఉత్పత్తుల్లో అగ్రగామిగా ఉన్న లార్క్.. నీటిని శుద్ధిచేసేందుకు ‘నానో జీరో ఫిల్టర్ టెక్నాలజీ’ని తీసుకొచ్చింది. మామూలు నీటి మగ్గును పోలి ఉండే ఈ ప్యూరిఫయర్‌లో నీటిని పోసి ‘ప్యూర్ విస్’ మోడ్ ఆన్ చేస్తే చాలు.. నిమిషాల్లో నీరు ఫిల్టర్ అయిపోతుంది. నీటిలో ఉండే క్లోరిన్, మెర్క్యురీ, కాడ్మియం, లెడ్, హెచ్ఏఏ5, బెంజీన్తోపాటు ఇతర ప్రమాదకర పదార్థాలను తొలగిస్తుంది. ఇతర బ్రాండ్ ఫిల్టర్లతో పోలిస్తే 50శాతం ఎక్కువగా మన్నుతుంది. ఈ ఒక్క ఫిల్టర్.. 450 కన్నా ఎక్కువగా సింగిల్ యూజ్ వాటర్ బాటిళ్లను రీప్లేస్ చేస్తుంది. ఏడాది వారంటీతో వస్తున్న ఈ వాటర్ ప్యూరిఫయర్ ధర. రూ. 11,600. livelarq.com ద్వారా ఆర్డర్ ఇవ్వవచ్చు.

నవతరం వ్లాగర్ల కోసం చైనాకు చెందిన ‘ఫియూ టెక్’ సంస్థ.. ‘వింబల్ 4’ పేరుతో ‘స్మార్ట్‌ఫోన్ గింబల్’ను తీసుకొచ్చింది. వీడియోలు తీసేటప్పుడు చేతులు వణకడం, నడుస్తూ/ పరిగెడుతూ తీసే వీడియోల్లో నాణ్యత లోపించడం లాంటి సమస్యలకు ఈ ఆధునిక గింబల్ చెక్ పెడుతుంది. ఇందులోని 3-ఆక్సిస్ స్టెబిలైజేషన్ వల్ల.. స్మార్ట్‌ఫోన్‌తోనూ ప్రొఫెషనల్ కెమెరాలకు దీటుగా నాణ్యమైన వీడియోలను తీసుకోవచ్చు. ఈ గింబల్లోని మరో అత్యాధునిక సాంకేతికత.. 4.0 ఏఐ ట్రాకింగ్. ఇది వ్లాగర్ల ముఖాన్ని ఎప్పటికప్పుడు ట్రాక్ చేస్తుంది. వంద మందిలో ఉన్నా.. వ్లాగర్పైనే ఫోకస్ పెడుతుంది. ఇందులోనే బిల్ట్ ఇన్ 216 మి.మీ. ఎక్స్టెన్షన్ రాడ్‌ను ఏర్పాటుచేశారు. దీని సాయంతో సరికొత్త కోణాల్లో వీడియోలు, సెల్ఫీలు తీసుకోవచ్చు. ఫోల్డబుల్ డిజైన్‌తో వస్తున్న ఈ గింబల్‌ను ఎక్కడికైనా సులభంగా తీసుకెళ్లొచ్చు. ఇందులోని మరో విశేషం.. గెశ్చర్ కంట్రోల్. చేతి సైగలను అర్థం చేసుకొని, దానికి తగినట్టుగా పనులు చేసి పెడుతుంది. ఇందులో 955ఎంఏహెచ్ లిథియం అయాన్ బ్యాటరీ ఏర్పాటుచేశారు. దీనిని ఒక్కసారి చార్జ్ చేస్తే ఆరున్నర గంటల వరకూ పనిచేస్తుంది. బిల్ట్ఇన్ ట్రైపాడ్, బ్లూటూత్ 5.0 అదనపు ఫీచర్లు. 336 గ్రాముల బరువు మాత్రమే ఉండే ఈ గింబల్ ధర. రూ. 8,220. feiyu-tech.com ద్వారా కొనుగోలు చేయవచ్చు.