ఓ మనిషి, చిన్న పడవలో సంద్రంలోకి వెళ్లాడు. అలా వెళ్లి ఇలా వచ్చేద్దాం కదా అనుకున్నాడు. కానీ, ఊహించని తుఫాను ఆ పడవను తలకిందులు చేసింది. చావు తప్పి, కన్ను లొట్టబోయి ఎలాగోలా ఓ చిన్న దీవికి చేరుకున్నాడు. ప్రాణాలు దక్కినందుకు సంతోషమే. కానీ ,అక్కడినుంచి తిరిగి వెళ్లేదెలా? ఆకలి తీరేందుకు కాయో, పండో దొరుకుతున్నది సరే… కానీ ఆరోగ్యాన్ని కాపాడుకోవడం ఎలా? అంతరిక్షంలో తనకు ఎదురు లేదు అనే నాసాకు ఇలాంటి సమస్యే వచ్చింది. ఓ ఇద్దరు వ్యోమగాములను గగనవీధుల్లోకి పంపింది. వాళ్లు అనుకున్న గమ్యాన్ని అయితే చేరుకున్నారు కానీ, దారిలో వ్యోమనౌక దెబ్బతిన్నది. అందులో తిరుగు ప్రయాణం అంటే ప్రాణాల మీద ఆశలు వదులుకోవడమే అని తేలింది. ఇది కేవలం ఆ ఇద్దరి సమస్యా కాదు. అమెరికాదో, నాసాదో అంతకన్నా కాదు. మనిషి పుడమి పరిమితుల్ని దాటాడు అంటే.. తను విశ్వమానవుడి కిందే లెక్క. కాబట్టి ఇది మానవ మేధకే సవాలు. ఇంతకీ అసలు సమస్య ఏమిటి? దాని తీవ్రత ఎంత? ఎలా ఎదుర్కోబోతున్నాం?
Sunita Williams | అది 2024 జూన్ 5. ఫ్లోరిడాలోని అంతరిక్ష కేంద్రం నుంచి బోయింగ్ స్టార్ లైనర్ అనే వ్యోమనౌక బయల్దేరింది. ఒక నిర్దిష్ట కక్ష్యలోకి వెళ్లి… అక్కడ ఒకటి రెండు రోజులు ఉండి తిరిగి రాగలిగే అరుదైన వాహనం ఈ స్టార్ లైనర్. ఆ తరహా నౌకలో ప్రయాణిస్తున్న తొలి మహిళ సునీతా విలియమ్స్. బారీ విల్మోర్ అనే మరో వ్యోమగామి కూడా ఈ నౌకలో ఉన్నారు. బోయింగ్ సంస్థ రూపొందించిన ఈ నౌకలో ప్రయాణం ఎంతవరకు సాధ్యం, సురక్షితం అనే విషయాలను పరీక్షించేందుకే వీరు బయల్దేరారు. అంతరిక్షంలో ఉన్న ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్‌కు (ISS) చేరుకుని అక్కడ ఓ ఎనిమిది రోజులు ఉండి, తిరిగివచ్చేయాలన్నది వీరి లక్ష్యం. ఆ ప్రయాణం విజయవంతం అవుతుందనీ, అంతరిక్షంలోకి వ్యోమగాములు ప్రయాణించి… అక్కడ పరిశోధనలు చేసి తిరిగి రావడం అనే ఆశ ఇకపై తేలికపడుతుందనీ అందరూ కోరుకుంటూ వారికి వీడ్కోలు చెప్పారు. ఈ విజయంతో అంతరిక్ష పర్యటనలు కూడా ఊపందుకుంటాయని ఓ ఆకాంక్ష. కానీ అందరి మనసులోనూ ఏదో శంక. అందుకు కారణం లేకపోలేదు! ఆ నౌక వెనుక ఏళ్ల తరబడి శ్రమ, నైపుణ్యం ఉన్నప్పటికీ ఎక్కడో అక్కడ సమస్యలు తలెత్తుతూనే ఉన్నాయి. మొదటిసారి దాన్ని పంపాలి అనుకున్నప్పుడు ఆక్సిజన్ వాల్వుల్లో లోపం తలెత్తింది. రెండోసారి నౌకతో అనుసంధానమైన కంప్యూటర్ పనిచేయనని మొరాయించింది. రెండు సారీల తర్వాత.. మూడోసారి వ్యోమనౌక గగనాంతర రోదసిలోకి పంపడానికి సిద్ధమయ్యారంతా!
ఎన్నో ఏళ్లుగా వాయిదాలు వేస్తూ వచ్చిన స్టార్‌లైనర్‌ను ఎలాగైనా అంతరిక్షంలోకి పంపాలనే నిశ్చయించుకున్నారు నాసా, బోయింగ్ అధికారులు. బహుశా అందుకేనేమో… జూన్ 5న ఆ నౌకను పంపే సమయంలో చిన్నపాటి హీలియం లీకేజి కనిపించినా ఖాతరు చేయకుండా బయల్దేరదీశారు. కానీ అదే కొంప ముంచింది. స్టార్ లైనర్ ప్రయాణిస్తున్న కొద్దీ మరిన్ని లీకేజిలు కనిపించాయి. వ్యోమనౌక ప్రయాణించాలి అంటే హీలియం వాయువే కీలకం. అది మండుతుంటే థ్రస్టర్స్ ద్వారా నౌక ముందుకు కదుల్తుంది. అలాంటి హీలియం సన్నటి బీటల్లోంచి జారిపోతుంటే… ఏం చేయాలో తోచక థ్రస్టర్స్‌ను ఒక్కొక్కటిగా మూసివేయడం మొదలుపెట్టారు. అప్పటికీ వారి దగ్గర ఒక అవకాశం ఉంది. ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్‌కు వెళ్లకుండానే తిరిగి వచ్చేస్తే, నౌకలో ఉన్న హీలియం తిరుగు ప్రయాణానికి సరిపోతుందనే ఓ ప్రతిపాదన వచ్చింది. కానీ, అందుకు విరుద్ధంగా నౌకను ISS వరకు పంపారు. అక్కడికి చేరుకుని విశ్రాంతి తీసుకుని, నౌకను బాగు చేసుకోవచ్చనే ఆలోచన నాసాకు వచ్చి ఉండవచ్చు.
అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం (ISS)లో అడుగుపెట్టిన సునీత రాబోయే ప్రమాదాన్ని ఊహించలేదు. అక్కడ పరిశోధనలు ముగించుకుని, హీలియం లీకేజికి మరమ్మతు చేసుకుని తిరిగి వెళ్లిపోవచ్చనే నమ్మకంతోనే తను ఉంది. కానీ, ఎంతగా ప్రయత్నించినా లీకేజిని అరికట్టలేకపోయారు. హీలియం మంటల వేడికి టెఫ్లాన్‌తో చేసిన చట్రాలు దెబ్బతిన్నాయనీ… వాటిని సరిచేయడం అంత తేలిక కాదని అర్థమైపోయింది. అందులో తిరుగు ప్రయాణం అంత సురక్షితం కాదనే భయం మొదలైంది. పైగా కొలంబియా స్పేస్ షటిల్ ప్రమాదం అందరి మనసులోనూ ఇంకా పచ్చిగాయంగానే ఉంది. భారతీయురాలు కల్పనా చావ్లా సహా ఏడుగురు వ్యోమగాములను బలిగొన్న ఆ ప్రమాదానికి నాసా వైఫల్యం ముఖ్యకారణం అనే నింద ఉంది. భూమ్మీదికి తిరిగి వచ్చే సమయంలోనే ఆ నౌక ప్రమాదానికి లోనైంది. స్టార్ లైనర్ కూడా అలాంటి విధినే అందుకుంటుందనే అనుమానం కలిగింది. దాంతో ఎన్నో తర్జనభర్జనల తర్వాత సెప్టెంబర్ 6న స్టార్ లైనర్ను ఖాళీగానే వెనక్కి రప్పించాలని నిర్ణయించారు. ఒకవేళ అది పేలినా, ప్రాణనష్టం జరగదని ఆశ. కానీ విచిత్రం! వ్యోమగాములు లేని ఆ స్టార్ లైనర్ సురక్షితంగా అమెరికాలోని న్యూ మెక్సికోకు చేరుకుంది.
ఇన్ని సమస్యల తర్వాత… మళ్లీ బోయింగ్ స్టార్ లైనర్ను నమ్ముకునే పరిస్థితి లేదు. భూమ్మీదికి తిరిగి వచ్చిన ఆ వ్యోమనౌక ఎలాంటి తప్పులు చేయకూడదు అనే విశ్లేషణకు మాత్రమే ఉపయోగపడుతుంది. అంతేకాదు! అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రానికి వ్యోమగాములను తీసుకువెళ్లడంలో తన స్టార్ లైనర్ అద్భుతాలు చేస్తుందంటూ బోయింగ్, నాసాతో నాలుగు వందల కోట్ల డాలర్ల ఒప్పందాన్ని కుదుర్చుకుంది. ఆ ఒప్పందంతోపాటుగా బోయింగ్ పేరు కూడా గంగలో కలిసిపోయేట్టు ఉంది. ఇలాంటి క్లిష్ట పరిస్థితుల్లో ఎలాన్ మస్క్ రంగంలోకి దిగాడు. తన స్పేస్ ఎక్స్ సంస్థ రూపొందించిన డ్రాగన్ వ్యోమనౌక అంతరిక్ష ప్రయాణంలో మంచి విజయాలనే అందుకుంది. ఆ వ్యోమనౌక ద్వారానే వచ్చే నెలలో సునీత, బారీలను వెనక్కి తెచ్చేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయి.
స్టార్ లైనర్ విషయంలో కొన్ని వైఫల్యాలు ఎదురైన మాట నిజమే. సునీతను తిరిగి తీసుకువచ్చేందుకు నాసా ఓ దశలో రష్యన్ అంతరిక్ష పరిశోధనా సంస్థ Roscosmosను సంప్రదించింది అనే వార్తలూ వినిపించాయి. వాస్తవానికి పరిస్థితి అంత దయనీయంగా లేదు. అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రంలో (ISS) మరో ఏడుగురు వ్యోమగాములు వారికి తోడుగా ఉన్నారు. వారిని అక్కడికి తీసుకువెళ్లిన వ్యోమనౌకలు కూడా లంగరు వేసి ఉన్నాయి. కాకపోతే అదనంగా మిగిలిన ఈ ఇద్దరినీ ఎలా భూమికి చేరవేయాలన్నదే సమస్య. నలుగురు పట్టే ఓ వ్యోమనౌకలో ఇద్దరు ISS సిబ్బందితో పాటుగా సునీత, బారీలను వెనక్కి తేవాలన్నది ప్రతిపాదన. ఇది ఫిబ్రవరిలో సాకారం కానుంది. ఇక సుదీర్ఘకాలంపాటు అంతరిక్షంలో ఉండటం కూడా వ్యోమగాములకు కొత్తకాదు. ISSకి చేరుకునే వ్యోమగాములు చాలాసార్లు ఆరునెలల పాటు అక్కడే ఉంటారు. వారి ఆహారం, ఆరోగ్యాలకు ఎలాంటి లోటు రాకుండా కావల్సిన సదుపాయాలన్నీ అందుబాటులో ఉంటాయి. స్పేస్ స్టేషన్లో ఉంటూ అంతరిక్ష వాతావరణంలో రకరకాల పరిశోధనలు చేయడమే వీరి పని. ఒకవేళ స్పేస్ స్టేషన్‌కి ఏదన్నా ప్రమాదం జరిగితే వెంటనే దానికి లంగరు వేసిన వ్యోమనౌకల్లోకి చేరుకునేందుకు సదా సిద్ధంగా ఉంటారు.
గాల్లో దీపం ఎంత అనిశ్చితిగా ఉంటుందో అంతరిక్షంలోకి ప్రయాణమూ అంతే ప్రమాదకరం. ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నా రెప్పపాటులో పరిస్థితులు తారుమారైపోవచ్చు. కాబట్టి సునీత సురక్షితమే అని నిశ్చింతగా ఉండటానికి లేదు. అసలు తను ISSను చేరుకున్న పరిస్థితులే చాలా అనూహ్యం. తిరిగి వచ్చే క్షణాలూ అంతే ఉద్విగ్నంగా ఉండబోతున్నాయి. అందుకే గుజరాత్లో తన తండ్రి ఊరైన జూలాసన్ పల్లెవాసుల నుంచి అమెరికన్ అధికారుల వరకూ ప్రతి ఒక్కరూ ఆమె రాక కోసం ఎదురుచూస్తున్నారు. అందరి ప్రార్థనలూ ఫలించి, తను సురక్షితంగా తిరిగి వస్తుందనే ఆశిద్దాం.
సునీతా విలియమ్స్ తండ్రిది గుజరాత్‌లోని మెహసానా జిల్లా. అనాథగా పెరిగినా, ఎన్ని కష్టనష్టాలు ఎదుర్కొన్నా బాగా చదువుకుని శరీర నిర్మాణ శాస్త్రం (అనాటమీ) మీద పట్టు సాధించారు. అమెరికాకు చేరుకుని ఉర్సులైన్ అనే స్లొవేనియా మహిళను పెళ్లాడి అక్కడే స్థిరపడ్డారు. అమెరికన్ నావికా దళంలో చేరిన సునీత హెలికాప్టర్ నడపడంలో తిరుగులేదనిపించుకుంది. యుద్ధాలు మొదలుకొని ప్రకృతి వైపరీత్యాల వరకూ… పైలట్‌గా అపారమైన సేవలు అందించింది. మూడుసార్లు అంతరిక్షంలోకి వెళ్లిన సునీతా పేరిట చాలా అరుదైన రికార్డులే ఉన్నాయి. అత్యధిక స్పేస్ వాక్‌లు (7) చేసిన మహిళగా, అత్యధిక సమయం స్పేస్ వాక్ (50 గంటలకు పైగా) చేసిన అతివగా, అంతరిక్షంలో మారథాన్ చేసిన తొలి వ్యక్తిగా, అంతరిక్షంలో ఎక్కువగా రోజులు గడిపిన నారిగా… ఇలా చాలా ప్రత్యేకతలు సాధించారు. సునీతకు తన తల్లిదండ్రుల మూలాలంటే చాలా అభిమానం. హిందూమతాన్ని అనుసరించే సునీత, అంతరిక్షానికి తనతోపాటు భగవద్గీతను తీసుకువెళ్లారు. ఇండియాకు వచ్చినప్పుడు సబర్మతి ఆశ్రమాన్నీ సందర్శించారు. ఇప్పుడు ఆమె వయసు 59 ఏళ్లు. 50 ఏళ్లు దాటగానే ఇక వార్ధక్యం దగ్గరపడుతున్నదని నీరసపడే వారికి అరవయ్యో వడి దగ్గర పడుతున్నా అంతరిక్షంలో ప్రతికూలతలను ధైర్యంగా ఎదుర్కొంటున్న సునీత నిజంగా ఓ స్ఫూర్తి!
మనకంటే పగలూ, రాత్రీ ఉన్నాయి కాబట్టి కిటికీలోంచి తొంగి చూడగానే సమయం గురించి ఓ అవగాహన వస్తుంది. కానీ, అంతరిక్ష కేంద్రంలో అలా కాదు. ప్రతి గంటన్నరకూ భూమిని చుట్టేసే ఈ కేంద్రంలో పగలూ, రాత్రులు ఓ అయోమయం. పోనీ ఓ గడియారం పెట్టుకుందామంటే… అది దేన్ని అనుసరించాలి. బారీ అమెరికన్ సమయాన్నీ, సునీతా భారత కాలమానాన్నీ అనుసరిస్తే! అందుకే వ్యోమగాముల కోసం Coordinated Universal Time (UTC)ను ప్రతిపాదించారు. భూమి వెలుపల ఉండేవారు దీన్ని పాటిస్తారు. భారతీయ కాలమానం కంటే ఇది ఓ ఐదున్నర గంటలు వెనక్కి ఉంటుంది. సమయం ఉంది సరే. ఈ UTCని చాలా జాగ్రత్తగా విభజించుకుని సమయపాలన చేయాల్సి ఉంటుంది. నిద్ర, వ్యాయామంతో పాటు మొక్కల మీద అంతరిక్ష వాతావరణపు ప్రభావాన్ని అంచనా వేయడం, స్పేస్ స్టేషన్ వెలుపలికి వచ్చి నడవడం, తనకు ఇష్టమైన భారతీయ వంటకాలు తినడం… ఇలా సునీత దినచర్య గడుస్తున్నది. పళ్లు తోముకోవడం దగ్గర నుంచీ జుత్తు కత్తిరించుకోవడం వరకూ అక్కడ ప్రతి పనికీ ప్రత్యేకమైన పరికరాలు, నైపుణ్యం, సమయం అవసరమే! పుట్టినరోజుకు కేక్ తయారుచేయడం కోసం కూడా చాలా జాగ్రత్తలు, ప్రత్యామ్నాయాలు అవసరం. అన్నట్టు సునీతా విలియమ్స్ పుట్టినరోజు (సెప్టెంబర్ 19) కూడా అక్కడే జరిగింది. వీటన్నిటి మధ్యా అక్కడి రోజులు హడావుడిగానే సాగుతున్నాయి అంటారు సునీత.
ఒక రోజు ఎన్నిసార్లు ప్రారంభం అవుతుంది. ఇదో పిచ్చి ప్రశ్నగా అనిపించవచ్చు. సూర్యోదయంతో మొదలయ్యే పగలు సూర్యాస్తమయంతో ముగుస్తుంది. కానీ, సునీతా విలియమ్స్ ప్రతిరోజూ 16 సూర్యోదయాలను చూస్తుంది. అవును. తను ఉంటున్న ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్… భూమి చుట్టూ గంటకు 28 వేల కిలోమీటర్ల వేగంతో తిరుగుతుంది. ఆ వేగంతో పుడమిని చుట్టేందుకు 90 నిమిషాలు సరిపోతుంది. అంటే 24 గంటల్లో దాదాపు 16 సార్లు భూప్రదక్షిణ చేస్తుంది. ప్రతీ సందర్భంలోనూ ఏదో ఒక చోట సూర్యోదయాన్నీ, మరో చోట సూర్యాస్తమయాన్నీ చూస్తుంది. అంటే ఒకో రోజునూ పదహారు సార్లు అనుభవిస్తుంది. పుట్టినరోజులూ, పండుగలూ, కొత్త సంవత్సరాలూ… అన్నీ పదహారుసార్లు వస్తాయి.
అమెరికన్ అధ్యక్ష ఎన్నికలు ఎంత ఉద్విగ్నభరితంగా జరిగాయో తెలిసిందే! అందులో పాల్గొనేందుకు ప్రతీ అమెరికన్ పౌరుడూ ఆసక్తి చూపించాడు. మరి అంతెత్తున్న ఉన్న సునీత సంగతేంటి? వ్యోమగాములు కూడా ఓటింగ్‌లో పాల్గొనేందుకు అమెరికన్ ప్రభుత్వం తగిన ఏర్పాట్లు చేసింది. ఇందుకోసం ముందుగా.. ఎన్నికల్లో పరోక్షంగా పాల్గొనేందుకు అనుమతి ఇవ్వమని వ్యోమగాములు దరఖాస్తు చేసుకోవాలి. ఆమోదం లభించాక వారికి నాసా నుంచి ఆన్లైన్ బ్యాలెట్ వస్తుంది. అందులో ఓటును నమోదు చేసి ఉపగ్రహం ద్వారా తిరిగి పంపుతారు. ఇదేమీ చెప్పుకున్నంత తేలికగా జరగదు. బ్యాలెట్ మొత్తం ఎన్క్రిప్టెడ్ భాషలో ఉంటుంది. సదరు వ్యోమగామికి, పోలింగ్ అధికారికీ తప్ప మూడో వ్యక్తికి అందులోని ఎంపిక తెలిసే అవకాశం ఉండదు. ఈ పద్ధతి ద్వారానే సునీత తన ఓటు హక్కును వినియోగించుకున్నారు.
ఎప్పుడూ నవ్వుతూ తుళ్లుతూ కనిపించే సునీతా విలియమ్స్ ఈమధ్యకాలంలో విడుదల చేసిన ఫొటోల్లో చాలా బలహీనంగా కనిపించారు. సన్నబడి, పీక్కుపోయి ఉన్నారు. దాంతో తన ఆరోగ్యం మీద భయాలు మొదలయ్యాయి. ఇందుకు కారణం లేకపోలేదు.
– కె.సహస్ర