దక్షిణంలో మీరు ఎక్కువ స్థలం వదిలి ఇల్లు కట్టారు. తద్వారా ఉత్తరంలో స్థలం తగ్గిపోయింది. దక్షిణం అధికమై ఖాళీ రావడంవల్ల ఇంట్లో ప్రధానంగా రోగాలు కాపురం చేస్తాయి. స్త్రీలు ఒంటరిగా జీవించాల్సి వస్తుంది. దక్షిణంలో గొయ్యిచేసి స్విమింగ్‌పూల్ పెట్టడం పెద్ద దోషం. దానివల్ల పురుషులు ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటారు. దీర్ఘరోగాల బారిన పడతారు. అలాగే.. అతిదారుణమైన పరిస్థితులు ఎదుర్కొని, ఏదో ఒకరోజున ఆ ఇల్లు ఖాళీచేసి వెళ్లాల్సి వస్తుంది. ఫలితాల గురించి కాదు.. మీరు ఆలోచించాల్సింది. ఆ ఇల్లు పనికి వస్తుందా? లేదా? అని. వెంటనే మీరు దక్షిణం ఖాళీ స్థలాన్ని ఇతరులకు అమ్మేయండి. దక్షిణం – ఆగ్నేయంలో మీ రాకపోకల కోసం ఒక గేటు పెట్టండి. అంతకన్నా ముందు.. దక్షిణంలో ఉత్తరం కన్నా తక్కువ స్థలం ఉండేలా కాంపౌండు కట్టండి. దాంతోపాటు దక్షిణంలోని స్విమింగ్‌పూల్‌ను మూసేయండి. అవసరం ఉంటే ఉత్తరంలో స్థలం ఉంటే.. అటువైపు స్విమింగ్‌పూల్‌ను ఈశాన్యంలో కానీ, తూర్పులో కానీ ఏర్పాటు చేసుకోండి.
త్రిభుజాకారం కాకుండా, భూమిలో గొయ్యిని చతురస్రం కానీ, దీర్ఘ చతురస్రం కానీ, ఎల్ ఆకారంలో కానీ కట్టుకోవచ్చు. ప్రధానంగా ఇంటికి సరైన స్థలంలో.. అంటే, ఉత్తరం – తూర్పు లేదా ఈశాన్యంలో గొయ్యి తీసుకొని సంపు కట్టాల్సి వస్తే.. ఇంటి పిల్లర్స్ ఫుటింగ్ను చూసుకోవాల్సి ఉంటుంది. నీళ్లు పిల్లర్స్ ఫుటింగ్ కిందికి లీక్ అవ్వకుండా చూసుకోవాలి. స్థలాన్ని బట్టి ‘ఎల్’ ఆకారం వచ్చినా దోషం లేదు. కొలతల ప్రాధాన్యత లేదు. స్థలాన్నిబట్టి కట్టాలి. ముఖ్యంగా సెప్టిక్ ట్యాంక్.. ఉత్తరం మధ్యలో లేదా తూర్పు మధ్యలో తీసినప్పుడు ఇంటిని, కాంపౌండును అంటకుండా చూసుకోవాలి. సెప్టిక్ ట్యాంక్‌ను అనేక విధాలుగా నిర్మిస్తారు. నగరాలలో ఎప్పటికప్పడు లిఫ్ట్ చేసేలా ట్యాంకులు పెడుతుంటారు. పల్లెల్లో అదేమీలేకుండా నేలలో గొయ్యిచేసి.. పేడవేసి రింగులతో కడతారు. ఏదైనా.. అన్నీ సరిచూసుకొని కట్టుకోవాలి.
దిక్కులు సరిగ్గాలేవు అంటున్నారు. పడమర పెద్ద వాలు (స్లోపు) అంటున్నారు. పైనుంచి ఇల్లు కట్టారు. దోషాలన్నీ మీరే చెబుతున్నారు కదా! మరి ఇల్లు అలా ఎందుకు కట్టారు? దిక్కులు లేకుంటే దోషం ఉండదని పశ్చిమంలో సెల్లార్ తీయడం మంచిదెలా అవుతుంది? స్థలమే బాగాలేదు కదా? మీరు కట్టిన ఇల్లు మీరు ఉండటానికి పనికి రాదు. దానిని వీలుంటే వ్యాపార స్థలంగా వాడుకోండి. తక్షణమే పశ్చిమంలోని సెల్లార్ పూర్తిగా మూసివేయండి. మీరు రోడ్డు విషయం చెప్పలేదు. విదిక్కుల స్థలానికి సెల్లార్ పనికిరాదు. దానిని తొలగించిన తర్వాతే కమర్షియల్‌గా వాడండి. అప్పుడే వ్యాపారం కూడా సరిగ్గా నడుస్తుంది. భూమి ఉంటే చాలు.. కట్టేస్తే చాలు.. ఎలాగైనా పనికి వస్తుంది అనుకోవద్దు. ప్రతి వంటకు ఒక పద్ధతి ఉన్నట్లు.. ప్రతి దిశకూ, స్థలానికీ దాని స్వభావాన్ని గుర్తెరిగి కట్టాలి. లేకుంటే.. అది మనపైన తిరగబడుతుంది.
ఇల్లు ఎటువైపు అయినా పక్క ఇంటిని అంటుకొని కట్టుకోవద్దు. ఇంటికి బలం.. గాలి – వెలుతురు. అది ఇంటి చుట్టూ ఖాళీ ఉన్నప్పుడే వస్తుంది. ఇల్లు కట్టడం అంటే.. అది మన జీవనవిధానాన్ని నియంత్రిస్తుంది అనేది మరువకుండా కట్టుకోవాలి. ఒక్క ముక్కురంధ్రం మూసుకుపోయి, మరో రంధ్రం గుండా గాలి తీసుకుంటూ ఉంటే.. ఎంతో ఇబ్బంది ఉంటుంది. ప్రాణం పోదుగానీ.. ఆ ముక్కు దిబ్బడ పడినప్పడు ఆ అనిశ్చిత స్థితి (అన్‌కంఫర్ట్) అందరికీ అనుభవమే! ఇల్లుకూడా మనలాగే ప్రాణమున్న దేహమే! రెండు దిక్కుల ఇల్లు అంటుకుంటే.. దాని ప్రభావం ఇంట్లో ఉన్న అందరిపైనా ఉంటుంది. ఉత్తరం మూతవల్ల ఆడపిల్లల మీద, ఇంటి చుట్టూ ప్రదక్షిణం లేకపోవడంతో ఇంట్లో పురుషుల మీద, వారి ఎదుగుదల మీదా ప్రభావం ఉంటుంది. వెంటనే ఇల్లు వదలండి. లేదా ఉత్తరం ఓపెన్ చేయండి. ఇంటి దోషం అంటే.. అది ఇంటి సభ్యులకు కూడా దోషమే అన్న సంగతి మరిచిపోవద్దు.