పడమటి కనుమల పొత్తిళ్లలో ఉన్నట్టుంటుంది మున్నార్. కేరళం అందమంతా రంగరించుకుని ఆకుపచ్చ కోక చుట్టుకొని కనిపిస్తుంది. ఇడుక్కి జిల్లాలో ఉన్న మున్నార్.. రుతురాగాల వేళ మేఘసందేశాన్ని మోసుకొస్తుంది. చలికౌగిలిలో గిలిగింతలు పెడుతుంది. మండువేసవిలోనూ వసంతగాలులతో పర్యాటకులను అలరిస్తుంటుంది. నింగిలో తేలిపోయే మబ్బులు.. మున్నార్ కొండలను ముద్దాడుతూ గమనం మరచిపోతాయి. ఇంతలో కొండవాలులో ఉన్న తేయాకు తోటలపై నుంచి వచ్చే గాలి సోకి.. హుషారొచ్చి ముందుకు సాగిపోతాయి. అందమైన జలపాతలు, సెలయేళ్లు, వన్యప్రాణి సంరక్షణ కేంద్రాలు, టీ ఎస్టేట్లు ఇలా ఎన్నో వైవిధ్యాల భరితం మున్నార్.
ట్రెక్కింగ్, హైకింగ్ వంటి ఆటల కోసం సాహసవంతులు వస్తుంటారు. వన్యప్రాణి సంరక్షణ కేంద్రాల్లో స్వేచ్ఛగా విహరిస్తున్న జంతుజాలాన్ని చూసేందుకు వస్తారు. కేవలం ప్రశాంతత కోసం, ప్రకృతితో మమేకం అవ్వడం కోసమే వచ్చే పర్యాటకులూ ఉంటారు! కోరుకున్న వాళ్లకు కోరుకున్నంతా లభిస్తుందిక్కడ. అందుకే ఏడాది పొడవునా మున్నార్‌కు పర్యాటకుల తాకిడి ఉంటుంది. బడ్జెట్ లాడ్జ్‌ల నుంచి లగ్జరీ రిసార్టుల వరకు అందుబాటులో ఉన్నాయి. హోటళ్లలో దేశవిదేశీ రుచులు దొరుకుతాయి.
మున్నార్ పరిసరాల్లోని టీ ఎస్టేట్స్, టాటా టీ మ్యూజియం, పల్లివాసల్ డ్యామ్, జలపాతాలు, పంబదుమ్ షోలా, ఎరవికులం వన్యప్రాణి సంరక్షణ కేంద్రాలు సందర్శనీయ స్థలాలు. మున్నార్.. ఎర్నాకులం నుంచి 125 కి. మీ., కోయంబత్తూరు నుంచి 158 కి.మీ. దూరంలో ఉంది. సికింద్రాబాద్ ఈ రెండు ప్రాంతాలకు రైళ్లు ఉన్నాయి. అక్కడి నుంచి రోడ్డు మార్గంలో మున్నార్ చేరుకోవచ్చు.