Meenakshi Chaudhary | ‘యాక్చువల్లీ, ఐ వాంట్ టు బికమ్ ఎ డాక్టర్.. బట్ యాక్టరయ్యాను’ కథానాయికల కామన్ డైలాగ్ ఇది. ఈ పంచ్‌కుల చిలక మాత్రం ముందుగా డాక్టర్ అయింది. ఆ తర్వాతే యాక్టర్‌గా తన జర్నీ మొదలుపెట్టింది. ఇండస్ట్రీలోకి వచ్చిన మూడేండ్లకే త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో రూపుదిద్దుకుంటున్న ‘గుంటూరు కారం’ చిత్రంలో మహేశ్‌బాబు సరసన నటించే అవకాశాన్ని కొట్టేసింది. వరుస సినిమాలతో కెరీర్ పరంగా పోటుమీదున్న కథానాయిక మీనాక్షి చౌధురి కబుర్లు ..
ప్రస్తుతం త్రివిక్రమ్ దర్శకత్వంలో నటిస్తుండటం గొప్ప అవకాశంగా భావిస్తున్నా. మహేశ్‌బాబు సరసన నటించే అవకాశం ఇంత తొందరగా వస్తుందని అస్సలు ఊహించలేదు. ఈ ఆఫర్ వచ్చినప్పుడు అస్సలు నమ్మలేదు. స్క్రిప్ట్ వినడం, ఓకే చెప్పడం ఇవన్నీ కలలా అనిపిస్తున్నాయి. షూటింగ్లో ఎన్నో కొత్త విషయాలు నేర్చుకుంటున్నా. ‘గుంటూరు కారం’ విడుదలయ్యాక తెలుగువారు నన్ను మరింత దగ్గర చేసుకుంటారని భావిస్తున్నా!
తెలుగులో ‘ఇచ్చట వాహనములు నిలుపరాదు’ నా మొదటి సినిమా. ఫలితం మాట అలా ఉంచితే తెలుగు ప్రేక్షకులు నన్ను బాగా ఆదరించారు. తర్వాత రవితేజ ‘ఖిలాడీ’లో మంచి పాత్ర దక్కింది. నన్ను పూర్తిస్థాయిలో తెలుగువారికి దగ్గర చేసిన సినిమా ‘హిట్ 2’. ఇందులో చాలా గ్లామర్‌గా కనిపించానని చాలామంది చెబుతుంటారు. సినిమా కూడా సూపర్‌హిట్ కావడంతో చాలా సంతోషం కలిగింది.
మా నాన్న ఆర్మీలో పనిచేసేవారు. చండీగఢ్‌లో మిలిటరీ క్వార్టర్స్‌లో ఉండేవాళ్లం. మా కాలనీలో వివిధ రాష్ర్టాలకు చెందిన కుటుంబాలు ఉండేవి. ఒకరకంగా చెప్పాలంటే.. మినీ ఇండియాను తలపించేది. నా బాల్యమంతా జాయ్‌ఫుల్‌గా సాగింది. చదువులో టాప్‌గా నిలిచేదాన్ని. స్టేట్‌లెవల్ స్విమ్మింగ్ పోటీల్లో ఎన్నో పతకాలు సాధించాను. బ్యాడ్మింటన్‌లోనూ రాష్ట్రస్థాయి క్రీడాకారిణిగా గుర్తింపు పొందాను.
నాన్న నన్ను అపురూపంగా చూసుకునేవారు. నా జోరుకు అమ్మ బ్రేకులు వేసినప్పుడు కూడా నన్నే సపోర్ట్ చేసేవారు. నా బలం ఆయనే! మా నాన్న హీరోయిన్ మీనాక్షి శేషాద్రికి పెద్ద ఫ్యాన్! అందుకే నాకు ఈ పేరు పెట్టారు. అదేమిటో గానీ, నేను కూడా ఆమెలాగే మిస్ ఇండియా కావడం, సినిమాల్లోకి రావడం ఆశ్చర్యం కలిగిస్తుంది.
నాకు ఇరవై ఏండ్లు ఉన్నప్పుడు నాన్న కన్నుమూశారు. అప్పటికి నేను డెంటల్ కోర్సు థర్డ్ ఇయర్లో ఉన్నాను. మానసికంగా చాలా కుంగిపోయాను. పరీక్షలు కూడా రాయాలనిపించలేదు. ఒక సంవత్సరం గ్యాప్ తీసుకుందాం అనుకున్నా. అప్పుడు అమ్మ అండగా నిలబడింది. నచ్చింది చేయమని ప్రోత్సహించింది. అమ్మ మాటలు కొన్ని రోజులకే నన్ను మామూలు మనిషిని చేశాయి. ‘మిస్ ఇండియా పోటీల్లో పాల్గొనమ’ని దారి చూపింది. ఈ రోజు నేను ఇలా ఉన్నానంటే అందుకు కారణం అమ్మే!
చిన్నప్పుడు నాకు మూడు కోరికలు ఉండేవి. మొదటిది డాక్టర్ కావడం. డెంటిస్ట్ అయ్యాను. అమ్మ చెప్పడంతో అందాల పోటీల్లో పాల్గొనాలని ఫిక్సయ్యాను. 2018లో ఫెమినా మిస్ ఇండియా కిరీటం అందుకోవడంతో రెండో లక్ష్యాన్నీ చేరుకున్నా. ఇక మూడోది యాక్టింగ్. మోడలింగ్‌లోకి అడుగుపెట్టిన తర్వాత సినిమా అవకాశం వెతుక్కుంటూ వచ్చింది. అలా మూడో కోరికా నెరవేరింది.