మన నారాయణరెడ్డిని సినీకవిగా భారతీయ సినిమా వెండికొండలపై నిలిపిన చిత్ర గీతాల్లో “మల్లియలారా మాలికలారా/ మౌనముగా వున్నా…రా” ఒకటి. అంతేకాదు ఇటు కవిగా సినారెకు, అటు గాయకునిగా ఘంటసాల వెంకటేశ్వరరావులకు పేరు తెచ్చిపెట్టిందీ గీతం. ఒక భావోద్వేగ గీతిక కూడా ఇంత ఆదరణ పొందినదీ అంటే.. అందుకు కారణం సినారె ఆ పాటలో పండించిన భావాలే! ఇప్పటికీ ఈ గీతం అమృతతుల్యం… అజరామరం…!
1967లో ఎన్.రామబ్రహ్మం నిర్మించగా, వి. దాదా మిరాసీ దర్శకత్వం వహించిన చిత్రం ‘నిర్దోషి’. ఇందులో ఎన్.టి.రామారావు ద్విపాత్రాభినయం చేశారు. ఇందులో ఆనందరావు, సుందరం అనే కవలలుగా నటించారు రామారావు. సావిత్రి, అంజలీదేవి నాయికలు. ఆనందరావు కారణంగా చేయని నేరానికి జైలుపాలు అవుతాడు సుందరం. వివిధ నాటకీయ పరిణామాల తర్వాత ఆపదలోంచి సుందరం ఎలా బయటపడ్డాడు అనేది ఈ ‘నిర్దోషి’ చిత్ర కథాంశం.
ఈ చిత్రం కోసం సినారె ఆరు గీతాలు రాశారు. వాటిలో ‘మల్లియలారా… మాలికలారా’ ఎవర్ గ్రీన్ మెలోడి. ‘పాటలో ఏముంది, నా మాటలో ఏముంది’లో సినారె ఈ గీత నేపథ్యం గురించి చెబుతూ… “ఈ పాట సన్నివేశం క్లిష్టమైంది, కీలకమైంది. కథా నాయకుడు మరొకరిని పెళ్లాడి బాబుని కనడం ఒక పార్శ్యం. అలాంటి రూపం ఉన్న (అదే) కథా నాయకుడు మరొకరిని వివాహం చేసుకుని శోభనం గదిలో తన మానసిక ఘర్షణను గుండె నొక్కుకుని, గొంతు విప్పుకొని ప్రకటించడం మరొక పార్శ్వం. శోభనం మందిరంలోని ఈ పాట సన్నివేశాన్ని బాగా మననం చేసుకుని ఒక రసోద్వేగంలో ట్యూన్ తయారు చేశారు ఘంటసాల గారు. ఆ ట్యూన్ దర్శక నిర్మాతలకు అందరికీ అపారంగా నచ్చింది” అంటూ ట్యూన్ ఆవిర్భావం గురించి చెబుతారు. అలా ఆ ట్యూన్ కోసం రాసిందే “మల్లియలారా మాలికలారా..” గీతం.
పల్లవి:
మల్లియలారా మాలికలారా
మౌనముగా వున్నా…రా
మా కథయే విన్నా…రా ॥మల్లియ॥
నిజానికి చదివినప్పుడు ఈ పల్లవి మామూలుగా అనిపిస్తుంది కానీ, ఘంటసాల గానం చేసినప్పుడు “వున్నా…రా, విన్నా…రా” అన్న పదాల విరుపులోని సొగబు అత్యంత అద్భుతంగా ఉంటుంది. పల్లవిలోని ద్విత్వ ‘న’కారం కూడా మరింత అందాన్ని కూర్చింది. ఈ గీతం నాయికా నాయకుల తొలి సమాగం సందర్భంలోనిది. చిత్ర కథా సందర్భంలో నాయిక దృష్టిలో నాయకుడు దోషి. అందువల్ల నాయిక తొలిరాత్రికి అంగీకరించదు. అది నాయకుణ్ని బాధిస్తుంది. చివరికి తనతో మాట కూడా మాట్లాడదు. అందుకే నాయకుడు తన ఆవేదనను ఆ గదిలోని మల్లియలతో… మాలికలతో చెప్పుకొంటాడు. తరువాతి చరణాలు మరింత మనోహరంగా సాగిపోతాయి. చరణాల గురించి చెబుతూ కవి “చరణాల్లో కూడా అయన ఒక అందమైన నిర్బంధం విధించారు. మూడో పంక్తిలో ఉపయోగించిన పదాలే కొంచెం విరిచి పలికితే అర్థవంతంగా ఉండాలి. వాటినే ఒక అక్షరం మేరకు మార్చాలి. కొత్త శబ్దాలు వాడకూడదు” అని నిర్మాత, దర్శకుల సూచనా బంధం. ఆ కోవలోనే కవి సినారె కూర్చిందే ఈ మొదటి చరణం.
చరణం
జాబిలిలోనే జ్వాలలు రేగే
వెన్నెలలోనే… చీకటి మూగే ॥జాబిలి॥
పలుకగ లేక పదములు రాక
పలుకగా… లేక పదములే… రాక
బ్రతుకే తానే బరువై సాగే ॥మల్లియ॥
తనకు కొంత దూరంలో, మంచం వద్ద ముభావంగా ఉన్న నాయికను చూస్తూ నాయకుడు అన్న మాటలివి. మల్లెలతో, మాలలతో తన మౌనవ్యథను చెబుతున్నాడు. అనుకోని విధంగా తొలి రాత్రి జరిగిన సంఘటన కదా! అందుకే కవి చల్లని రాజు జాబిలిలో జ్వాలలు రేగాయని, వెండి వెలుగుల కుప్ప అయిన వెన్నెలలో చీకట్లు మూగాయని అంటారు. తన స్థితికి పాపం నాయకునికి ‘పలుకగ లేక’ పదములు రాలేదట. ఇందులో నర్మగర్భంగా అపార్థాలన్నీ తొలిగిపోయి, తాను నిర్దోషినని తన నాయికతో తిరిగి చేరాలన్న నాయకుని ఆకాంక్షను చూడవచ్చు. కవి రెండో చరణంలో కింది పాదాల్లో దీనిని బలంగా చెబుతారు.
చరణం 2
చెదిరిన వీణ రవళించేన
జీవనరాగం చిగురించేన ॥చెదిరిన॥
కలతలు పోయి వలపులు పొంగి
కలతలే.. పోయి వలపులే… పొంగి
మనమే లోలో పులకించేనా ॥మల్లియ॥
అపనిందను మోస్తున్న నాయకుడు చివరకు ‘నిర్దోషి’గా విడుదలవ్వడం చిత్ర కథ. దానిని ఇక్కడ కవి కూడా అదే విధంగా చెబుతున్నాడు. తన జీవితం ‘రవళించి’, ‘చిగురించి’ తిరిగి వికసిస్తుందా అన్నది నాయకుని తపన. ఈ గీతమంతా అనేక భాషా చమత్కారాలతో పాటు పదాల పదనిసలు, అక్షరాల పునరుక్తులు రావడం మరింతగా అందాన్నిచ్చిందీ అని చెప్పొచ్చు. హృదయద్రావకంగా ఉండే ఈ సన్నివేశంలో, మిక్కిలి కరుణరసా భరితంగా సాగిన ఈ గీతం ‘నిర్దోషి’ చిత్రానికి మణికిరీటం. అత్యంత బరువైన సన్నివేశాన్ని తమ నటనతో మెప్పించారు ఎన్టీయార్, సావిత్రి.