ఓ కళారూపం జీవితాల్లో నిజంగా మార్పు తెస్తుందా? అంటే కచ్చితంగా తెస్తుందని చెప్పడానికి ‘మల్లె మొగ్గ’ గేయ రూపకమే అందుకు సాక్ష్యం. ప్రదర్శన తర్వాత ఎన్నో పాఠశాలల్లో వేదికలపై ‘బాల్య వివాహాలు చేసుకోం’ అంటూ విద్యార్థినులు ప్రతిజ్ఞ చేసేంతగా ప్రభావితం చేసింది. ఈ రూపకం ప్రదర్శన,
ప్రతిజ్ఞను ఉపాధ్యాయులు, ఊర్ల పెద్దలు ముప్పై ఏళ్లపాటు ఉద్యమంగా సాగించారంటే ఈ నాటకం మన జీవితాలను ఎంత గొప్పగా కళ్లకు కడుతుందో అర్థం చేసుకోవచ్చు.
ఈ రూపకం వృత్తాంతం సాధారణమైనదే. మన పల్లెల్లో నిత్యం జరిగేదే. కథా నాయిక మల్లి పదమూడేళ్ల బాలిక. ఆ వయసులో పిల్లలతో అరమరికలు లేకుండా ఆడుకుంటూ ఉండేది. కల్లాకపటం, మాయామర్మం ఎరుగని మనసు. ఆ పిల్లే కాదు అందరూ అలాగే ఉన్నారు. ‘పిల్లలండి పిల్లలు / పల్లె గుండె మల్లెలు చెరువు గట్టున / చెట్ల నీడన బర్రెల వీపున / గొర్రెల మందన.. ఇలా సాగుతూ కాళ్లగజ్జా కంకాళమ్మ, గుడుగుడు గుంజం గుండె రాగం, దాగుడుమూతా దండాకోర్, పిల్లీ వచ్చే ఎలుకా భద్రం’ అంటూ చక్కగా పిల్లలందరూ ఆడుకుంటున్నారు. సరిగ్గా అదే సమయంలో ‘పెళ్లి వారమండి… మగ పెళ్లి వారమండి’ అంటూ కొంతమంది పెద్దలు అక్కడికి వచ్చారు.
పిల్ల బాగుందని, చిన్నారి మల్లిని ఏరికోరి పెళ్లి ఖాయం చేసుకున్నారు. ‘మల్లెకు పదమూడేళ్లేనండి.. కొంచెం కాలం ఆగండి’ అని ఆడపెళ్లి వారు బతిమిలాడినా.. ‘కుదరదు కుదరదు… చచ్చే ముసలిది చూడాలి పెళ్లి… మనమడి పాపను ఎత్తాలి మళ్లీ’ అంటూ ఒత్తిడి చేసి బలవంతాన పెళ్లి చేసుకుంటారు. అప్పగింతలు పూర్తయ్యాయి. ‘ఆరిందలాగ అత్తారింటికి చేరింది… కొత్త తీరక బెదిరిపోయిందది… సందెపొద్దుల్లో మగుడూ వచ్చి సరసాలాడితె… పక్క పక్కకి తప్పుకున్నది… పొద్దుగూకితే గజగజ వణికేది… చేయి తగిలితే బోరున ఏడ్చేది’ దాంపత్య జీవితం మల్లెకు భయాన్ని కలుగజేసింది. పగలైతే చెట్ల నీడకు పోయేది. తోటి పిల్లలతో గోటీలు ఆడేది. రాళ్లతో అల్ల నేరేడు పళ్లు కొట్టుకు తినేది. బుజ్జి కోడిపిల్లతో ఆడుకునేది. అత్తమామలకు ఇవేవీ నచ్చవు. అంట్లు తోమలేదని, ఇంటి పనులు చేయలేదని అత్త సాధించేది.
పాపం… ఒకనాడు మల్లి కోసం తన అన్నలు ఇంటికి వచ్చారు. పుట్టింటికి తీసుకుపోతామన్నారు. పంపడానికి అత్త నిరాకరించింది. అప్పటికే మల్లి ఏడు నెలల గర్భిణి. పనితో నీరసించింది. ఓదార్చే వారు లేరు. చివరికి తనకు తానే అర్థం కాకుండా మిగిలిపోయింది. కానికాలంలో కానుపు వచ్చింది. నెత్తురు చాలక మరణించింది. అందుకే ‘పసి మొగ్గలను చిదమకండి… పసికందులను కోయకండి… ఏ చిన్నబిడ్డకు పెళ్లి చేసినా… ఏ చిట్టితల్లికి పారాణి పెట్టినా… మల్లి జ్ఞాపకం పాకి రావాల… మీ గుండెలనే తాకి పోవాల’ అంటూ పిల్లలందరూ ప్రాధేయపడుతూ సమాజానికి విజ్ఞప్తి చేశారు.
పాత్రధారులందరూ ఆ వయసు పిల్లలే కావడం వల్ల ప్రేక్షకులు ఈ ప్రదర్శనకు త్వరగా కనెక్ట్ అయ్యారు. తెలియకుండానే వారి కళ్లు చెమ్మగిల్లాయి. ప్రేక్షకుల మనసుని ద్రవింపజేసింది. మన బిడ్డలకు ఆ విధంగా పెళ్లి చేయకూడదనే నిర్ణయానికి వచ్చేలా చేసింది, చేస్తోంది ఈ నాటకం. మార్చి 8 అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని ఐక్యరాజ్య సమితి మహిళా సాధికారతకు బాలికా వికాసాన్ని జోడించాలనే నినాదాన్ని ఇచ్చింది. ఇప్పుడు మల్లె మొగ్గ ప్రదర్శన మరింత సందర్భోచితమైంది.
‘ధర్మో రక్షతి రక్షితః’ అన్నారు. అలాగే ‘వృక్షో రక్షతి రక్షితః’ అనే మరో హితోక్తి మనకు తెలుసు. అంతే సమానంగా మూడు దశాబ్దాల కిందట మరో నినాదం ఉద్భవించింది. అదే ‘బాలికో రక్షతి రక్షితః’. ఈ నినాదం బాలికలను, ఆడ శిశువులను కాపాడుకోవాల్సిన అవసరాన్ని చాటుతుంది. ఒకప్పుడు ఆడ శిశువుల భ్రూణహత్యలు ఎక్కువగా ఉండేవి. ఆ రోజుల్లో ఎదిగే పిల్ల గుండెల మీద కుంపటని కొంతమంది తల్లిదండ్రుల భావన. వాళ్లు చిన్న వయసులోనే ఆడ పిల్లలకు బాల్య వివాహాలు చేసేవాళ్లు.
ఆ విష ఫలాలు ఇప్పుడూ సమాజం అనుభవిస్తున్నది. అనేక సామాజిక వర్గాలు వధువులు దొరక్క ఇబ్బందిపడుతున్న సంగతి తెలిసిందే. ఈ రుగ్మత ఇంకా కొనసాగడం, నాలుగో వంతు వివాహాలు బాల్య వివాహాలే కావడం ఎంత దుర్మార్గం..? ఈ దుర్మార్గంపై ఎక్కుపెట్టిన అస్త్రమే ‘మల్లె మొగ్గ’ గేయ రూపకం. కేవలం ఇరవై నిమిషాల పాటు సాగే ఈ లఘు రూపకం ముప్పై ఏళ్లుగా ప్రదర్శితమవుతున్నది. వందలాది దళాలు (పాఠశాల బాలికలు) వేలాది ప్రదర్శనలు ఇచ్చాయంటే అతిశయోక్తి కాదు.
రూపకం: మల్లె మొగ్గ
రచన: పి.ఎ. దేవి
డిజైన్: టి.జె. రామనాథం
ప్రదర్శకులు: జీవన, పవిత్ర, హర్షిత, అక్షిత తదితరులు (జిల్లా పరిషత్ హైస్కూల్, సాహెబ్ నగర్, హైదరాబాద్)
నిర్వహణ: దారుణ్య సంధ్యా వందన
సారథ్యం: లైట్, వివేకానంద విద్యావికాస్, జాగృతి అభ్యుదయ సంఘం
– శాంతారావు
రంగస్థల నటుడు, విశ్లేషకుడు