మనిషి ఎంతైనా సంపాదించవచ్చు. ఏదైనా సాధించవచ్చు. తన ఎదుగుదలను, విజయాలను చూసి పొంగిపోవచ్చు. కానీ ఆరోగ్యం దెబ్బతిన్నప్పుడు మాత్రం… అన్నింటికన్నా ముఖ్యం తను క్షేమంగా ఉండటమే అనిపిస్తుంది. ఆరోగ్యంగా ఉంటేనే… ఏదైనా! మనకి ఇష్టమైన పదార్థాలు ఆస్వాదించాలన్నా, నచ్చిన మనుషులతో గడపాలన్నా, సంతృప్తిగా జీవించాలన్నా… ముందు ఆరోగ్యంగా ఉండాల్సిందే. అందుకే పెద్దల దగ్గరికి వెళ్లి ఆశీర్వాదం తీసుకుంటే ‘ఆయురారోగ్యాలతో చల్లగా ఉండమ’ని దీవిస్తారు. సంపద కోసం వెంపర్లాడుతుంటే ఆరోగ్యమే మహాభాగ్యం అని హెచ్చరిస్తారు. అందుకే ఎప్పటికప్పుడు మన చుట్టూ పొంచి ఉన్న ముప్పులను గమనించుకోవాలి. ఇది భయం కోసం కాదు… అభయం కోసమే! ఇంతకీ ఇప్పుడు ఇదంతా ఎందుకూ అంటే… ఆగస్టు 1న ఊపిరితిత్తుల క్యాన్సర్ దినోత్సవం కాబట్టి. క్యాన్సర్‌తో కలిగే మరణాలలో లంగ్ క్యాన్సరే ప్రధాన ముద్దాయి. 2022లో ఏకంగా 18 లక్షల మంది దీని కోరలకు బలైనట్టు అంచనా. దురదృష్టం ఏమిటంటే… ఊపిరితిత్తుల క్యాన్సర్‌ను తప్పించుకునేందుకు, తొలి దశలో గుర్తించి జాగ్రత్తపడేందుకు ఉన్న అవకాశాల గురించి అంతగా అవగాహన లేకపోవడం. ఈ లంగ్ క్యాన్సర్ డే సందర్భంగా అయినా ఆ రక్కసిని తప్పించుకునే మార్గాలను తెలుసుకుందాం.
మన శరీరంలో ప్రతికణానికీ ఓ ప్రణాళిక ఉంటుంది. కణ విభజన నుంచి దాని జీవితకాలం వరకూ ప్రతీదీ నిర్దిష్టంగా జరిగిపోవాల్సిందే. ఆ ప్రయాణంలో ఏ చిన్నమార్పు వచ్చినా కష్టమే. కణానికి బ్లూప్రింట్లాగా ఉపయోగపడే జన్యువులు దెబ్బతిన్నప్పుడు… కణాల తీరు కూడా మారుతుంది.
విచ్చలవిడి విభజన, కాలం తీరినా మనుగడలో ఉండటం లాంటివి జరుగుతాయి. ఓ చిన్న కణంతో మొదలయ్యే విధ్వంసం… ఆయువు మీదకే తెస్తుంది. ఇంత జరిగినా కూడా ప్రతి కణితి క్యాన్సర్‌గా మారదు. కొన్నింటిని తొలగిస్తే సరిపోతుంది. మరికొన్ని మాత్రం ‘మాలిగ్నెంట్’ అంటే వ్యాపించే
లక్షణంతో ఉండి, ఎన్నిసార్లు తొలగించినా తలెత్తుతూనే ఉంటాయి. అవే ప్రమాదకరం. జన్యువులు దెబ్బతినడానికి ఎన్నో కారణాలు ఉంటాయి. కానీ ఊపిరితిత్తుల విషయంలో… మన అజాగ్రత్తే ముఖ్య కారణంగా కనిపిస్తుంది!
లంగ్ క్యాన్సర్ అనగానే చాలామందికి గుర్తుకువచ్చేది పొగాకే. ఇది కనీసం 15 రకాల క్యాన్సర్లకు దారితీయగలదని వైద్యుల మాట. అందులో ఊపిరితిత్తులు ఒకటి. సిగరెట్లలో దాదాపు అయిదువేల రసాయనాలు ఉంటాయనీ, వాటిలో కనీసం 70 వరకూ కార్సినోజెన్స్… అంటే క్యాన్సర్ కారకాలు అని చెబుతారు. ఊపిరితిత్తుల డీఎన్ఏ మీద సిగరెట్ల ప్రభావం ఎంత తీవ్రంగా ఉందో గమనించేందుకు ఓ అయిదువేల మంది మీద పరిశోధన చేశారు. రోజుకు ఓ పెట్టెడు సిగరెట్లు తాగేవారిని పరిశీలించినప్పుడు… వారి ఊపిరితిత్తులలో డీఎన్ఏ దెబ్బతినే అవకాశం ఏడాదికి 150సార్లు ఉందని తేలింది. పొగ కేవలం డీఎన్ఏని మాత్రమే దెబ్బతీయదు. ఏదన్నా సమస్య వస్తే తట్టుకునే రోగనిరోధక శక్తిని కూడా బలహీనపరుస్తుంది. అంతేకాదు! అసలు కణాలు దెబ్బతినే సమయానికే ఊపిరితిత్తులను పీల్చిపిప్పి చేసి… వినాశనానికి సిద్ధంగా ఉంచుతుంది. కేవలం పొగ తాగడమే కాదు… పొగాకును ఏరకంగా తీసుకున్నా అది ప్రమాదమే. అందుకే 80 శాతానికి పైగా ఊపిరితిత్తుల క్యాన్సర్‌కు కారణం, పొగాకే అని తేల్చారు.
ఒకప్పుడు పొగాకును వదిలించుకోవడం కాస్త కష్టంగానే ఉండేది. మానేయాలని తీర్మానించుకోవడం, అలాంటి సందర్భాలకు దూరంగా ఉండటం, నలుగురికీ చెప్పి మానేయడం, కొంచెం కొంచెంగా తగ్గించుకోవడం… లాంటి సూచనలన్నీ వినడానికి బాగున్నా దీర్ఘకాలికంగా ఆ పట్టును ఎంతవరకు నిలబెట్టుకోగలరన్నదే అనుమానం. ఎందుకంటే నికోటిన్ అనేది ఓ వ్యసనం. అది అంత తేలికగా లొంగేది కాదు. కానీ కొన్ని మార్పులు వస్తున్నాయి. వాటి వల్ల ప్రయోజనం ఉందనే ఆశ కనిపిస్తున్నది.
నికోటిన్ రీప్లేస్మెంట్ థెరపీ: సిగరెట్లలో ఉండే నికోటిన్ అనే పదార్థమే దానివైపు పదేపదే లాక్కునే ఆకర్షణ. అందుకే అదే నికోటిన్‌ను చిన్నపాటి శాతంలో… అది కూడా సిగరెట్ ద్వారా కాకుండా అందించే ప్రయత్నమే ఇది. బబుల్గమ్ నుంచి ఇన్హేలర్స్ వరకూ రకరకాలుగా దీన్ని ఉపయోగిస్తుంటారు. పొగాకు వ్యసనాన్ని ఇది 55 శాతం వరకూ తగ్గించగలదని పరిశోధనలు తేల్చాయి.
డీ అడిక్షన్ హెల్ప్లైన్లు: పొగాకు ఓ సమస్యగా మారిందని చుట్టుపక్కల వాళ్లు చెబుతున్నా, దాన్ని ఒప్పుకొనేందుకు అహం అడ్డు వస్తుంది. అయితే ప్రభుత్వం, స్వచ్ఛంద సంస్థలు నడిపే హాట్ లైన్ నెంబర్లకు ఫోన్ చేసి సమస్యను చెప్పుకోవచ్చు. దాని నుంచి బయటపడేందుకు ఎలాంటి మార్గాలు ఉన్నాయి, ఎలా ఎదుర్కోవచ్చు అన్న సాయం అటు నుంచి వచ్చి తీరుతుంది.
మందులు: వ్యసనాలను వదిలించేందుకు మందులు ఉండటం అదృష్టమే. ఈమధ్యకాలంలోనే ప్రచారంలోకి వచ్చిన కొన్ని మందులు పొగాకు వ్యసనాన్ని ఆపడమే కాకుండా, దాన్ని అకస్మాత్తుగా మానేయడం వల్ల కలిగే దుష్ఫలితాలను, మళ్లీ తీసుకోవాలనే కోరికను కూడా నియంత్రిస్తాయి. కానీ, వీటిని తీసుకునేముందు మాత్రం కచ్చితంగా వైద్యుడిని సంప్రదించాల్సిందే! కౌన్సెలింగ్లాంటి మిగతా పద్ధతులతో పోలిస్తే ఈ మందుల వాడకం 24-33 శాతం వరకూ ఎక్కువ ప్రభావవంతం అని కొన్ని గణాంకాలు చెబుతున్నాయి.
ఆన్లైన్ కోర్సులు: ఆన్లైన్ కేవలం వినోదానికే కాదు, ఇలాంటి పరిస్థితులను ఎదుర్కొనేందుకు కూడా ఉపయోగమే. పొగాకు వ్యసనాన్ని అంచెలవారీగా ఎదుర్కొనేందుకు చాలా ఆన్లైన్ కోర్సులు ఉన్నాయి. యూడెమీ లాంటి ప్రముఖ సంస్థలు కూడా వీటిని అందిస్తున్నాయి. క్విట్ష్యూర్ (quitsure) లాంటి యాప్స్ నిపుణుల పర్యవేక్షణలో మీ వ్యసనాన్ని వారంలోగా తగ్గిస్తామని హామీ ఇస్తున్నాయి.
ఒకప్పుడు ఊపిరితిత్తుల క్యాన్సర్ అంటే కేవలం పొగ తాగేవారికి మాత్రమే పరిమితం అనుకునేవారు. కానీ, ఇప్పుడు జీవితంలో ఎన్నడూ పొగాకు జోలికి పోనివారిలో కూడా క్యాన్సర్ కణాలు పెరుగుతున్నాయి. పొగాకు తాగేవారి ఊపిరితిత్తులలో ఏర్పడే కణుతులకీ, తాగనివారిలో ఏర్పడే కణుతులకీ తేడా ఉంటుంది కాబట్టి… ఈ విషయాన్ని సులభంగా కనిపెట్టగలం. పొగాకు తాగేవారిలో ఊపిరితిత్తుల పొరల మీద కణాలు దెబ్బతింటాయి (squamous cell carcinoma), తాగనివారి క్యాన్సర్‌లో కఫాన్ని ఉత్పత్తి చేసే కణజాలంలో మార్పు ఉంటుంది (adenocarcinoma). మరొక విచిత్రం ఏమిటంటే… పొగతాగనివారిలో క్యాన్సర్ ఎలాంటి లక్షణాలూ లేకుండా పెరుగుతూ ఉంటుంది. మూడు లేదా నాలుగో స్టేజ్‌లోనే లక్షణాలు కనిపించే అవకాశం ఎక్కువ. దీనికి కారణాలు ఏమిటో తెలుసుకుంటే… దాన్ని ఎదుర్కొనే అవకాశం ఎక్కువగా ఉంటుంది!
EGFR అనే జన్యువులో మార్పు ఇందుకు కారణం కావచ్చు. ఇది జన్యుపరంగా సహజంగా ఏర్పడే సమస్య. మరీ ముఖ్యంగా ఆసియాలో ఈ ప్రమాదం ఎక్కువని చెబుతున్నారు. అదృష్టవశాత్తు ఇప్పుడు దీనికి మంచి మందులు వచ్చాయి. ఒక 20 ఏళ్ల క్రితం ఈ క్యాన్సర్ నుంచి బయటపడిన తర్వాత ఏడాదికి మించి పేషెంట్ జీవితానికి భరోసా కల్పించలేకపోయేవారు. కానీ, ఇప్పుడు పదేళ్లు దాటినా బ్రహ్మాండంగా కాలం గడిపేయవచ్చని చెబుతున్నారు. కొన్ని జాగ్రత్తలు మనవైపు నుంచి కూడా తీసుకోవాలి.
ఇప్పుడంతా నగరీకరణదే జీవితం. మారిన పరిస్థితులను బట్టి, దాన్ని తప్పించుకోలేం. అక్కడి కాలుష్యానికి కూడా మనం అలవాటుపడిపోయాం. కానీ, అది చేసే నష్టాన్ని అంచనా వేయలేకపోతున్నాం. ఉదాహరణకు పొగాకు తర్వాత ఊపిరితిత్తుల క్యాన్సర్‌కు కారణమవుతున్న అతి పెద్ద కారణం కాలుష్యమే అని మనం గ్రహించడం లేదు. PM2.5గా పిలుచుకునే సూక్ష్మమైన ధూళికణాలు, ఊపిరితిత్తులలోకి చాలా సులభంగా చేరిపోగలవు. అక్కడ ఉన్న కణాలను నాశనమూ చేయగలవు. ఇవి ఊపిరితిత్తుల క్యాన్సర్‌కు దారితీయవచ్చని లండన్‌లోని ప్రముఖ బయో మెడికల్ రీసెర్చ్ సంస్థ ఫ్రాన్సిస్ క్రిక్ ఇన్స్టిట్యూట్ తేల్చింది. కేవలం బయటి కాలుష్యం మాత్రమే కాదు…. కట్టెల పొయ్యి, మెకానిక్ షెడ్, ట్రాఫిక్ పక్కనే నివాసం, పరిశ్రమలు… ఇలా సన్నటి పొగను వెలువరించే ఎలాంటి పరిస్థితుల్లో అయినా ఈ PM2.5 కణాలు దాడికి సిద్ధంగా ఉంటాయి. చెప్పుకోవడానికి కాస్త బాధగానే ఉన్నా… ఈ ధూళి కాలుష్యం పిల్లల డీఎన్ఏను సైతం దెబ్బతీస్తున్నదని తేలింది. మరి దాన్ని దాటడం ఎలా!
మద్యం వ్యసనం నుంచి తప్పించే ఆల్కహాలిక్స్ అనానిమస్ కొన్ని లక్షలమంది జీవితాలను మార్చేసింది. అదే స్ఫూర్తితో ఓ నలభై ఏళ్ల క్రితం మొదలైన సంస్థే నికొటిన్ అనానిమస్. తన వ్యక్తిగత వివరాలను వెల్లడించాల్సిన పని లేకుండానే ఈ సంస్థలో చేరవచ్చు. ఓ 12 నిబంధనలను పాటించడం ద్వారా… నికొటిన్ వ్యసనం నుంచి దూరం కావచ్చు అంటుందీ సంస్థ. వ్యసనానికి బాధితుడినని ఒప్పుకోవడం, తోటి సభ్యుల నైతిక ైస్థెర్యంతో దాని నుంచి దూరమయ్యే ప్రయత్నం చేయడం, అదే సమస్యతో బాధపడే ఇతరులకు సాయపడటం… లాంటి సూచనలే ఈ 12 నిబంధనలు. ఇప్పటివరకూ కొన్ని వేలమంది ఈ నికొటిన్ అనానిమస్ ద్వారా ఆ వ్యసనం నుంచి దూరమయ్యారు. nicotine-anonymous.org ద్వారా ఈ సంస్థ పనితీరు, అది మనకు సాయం చేసే విధానం లాంటి విషయాలు తెలుసుకోవచ్చు. ఆ సంస్థ సభ్యులు ఎక్కడికక్కడ నిర్వహించే జూమ్ సమావేశాల్లో పాల్గొనవచ్చు.
నేరుగా కనిపించే కాలుష్యం మాత్రమే కాదు! గ్రానైట్, పాలరాయి బొగ్గులాంటి పరిశ్రమల్లో పనిచేసేవారు కూడా అక్కడి సన్నటి ధూళిని తప్పించుకోవాల్సిందే. వీటికి మాస్క్ పెట్టుకుంటే లాభం ఉంటుంది. కానీ, గాలి కూడా విషపూరితం అయితే! పురుగుమందులు, బ్యాటరీలు, పెయింట్లు, ప్లాస్టిక్, స్టీల్ లాంటి పరిశ్రమల్లో పనిచేసేటప్పుడు… వాటి ఉత్పత్తి సమయంలో వెలువడే రసాయనాలు ఊపిరితిత్తుల క్యాన్సర్ కలిగించవచ్చు. అర్సెనిక్, బెరీలియం, కాడ్మియం, ఫార్మల్డీహైడ్, వినైల్ క్లోరైడ్… లాంటి సదరు రసాయనాలన్నీ క్యాన్సర్ కారకాలే. పీపీఇ కిట్స్, N95 లాంటివి ధరించడం వల్ల చాలావరకు హాని తగ్గుతుంది. అయితే ఈ పరిశ్రమల్లో ఉండే గడ్డు పరిస్థితులు, అక్కడ పనిచేసే పేద జనం వీటిని ధరించేంత జాగ్రత్తగా ఉంటారు అనుకోలేం. అయితే వారు పాటించదగ్గ ఇతర జాగ్రత్తలూ ఉన్నాయి.
పని పూర్తయిన వెంటనే చేతులు కడుక్కోవడం తప్పనిసరి.ఇంటికి వెళ్లిన వెంటనే శుభ్రంగా స్నానం చేయడం, సిగరెట్ లాంటి అలవాట్లకు దూరంగా ఉండటం, మంచి ఆహారం, వ్యాయామం లాంటి జాగ్రత్తలు తప్పనిసరి. నిజానికి ఇలాంటి రసాయనాల విషయంలో వ్యక్తిగత రక్షణకు సంబంధించి కఠినమైన చట్టాలు ఉన్నాయి. అవి కచ్చితంగా పాటిస్తే ఇవన్నీ చెప్పుకోవాల్సిన అవసరం ఉండేది కాదు. లేదు కాబట్టే ఈ జాగ్రత్తలు మనంతట మనం తీసుకోవల్సిన పరిస్థితి!