బడి తెరుస్తూనే కొత్త బాక్సులూ తెరుస్తారు పిల్లలు. పాత తరహా బోరింగ్ క్యారేజీలను వీళ్లు అస్సలు ఇష్టపడరు. అలాగని ఆకర్షణీయంగా ఉన్నాయి కాబట్టి, ఏవో ఒక రంగుల ప్లాస్టిక్ డబ్బాలూ కొనలేము. అటు వాళ్లను ఆకట్టుకునేలా, ఇటు చక్కగా పనికివచ్చేలా మార్కెట్లో కొన్ని లంచ్, స్నాక్ బాక్సులు దొరుకుతున్నాయి. వాటిని మీరూ ఓ లుక్కేయండి!
స్కూల్ పిల్లలు అందరూ కలిసి భోజనం చేస్తారు. అలాంటప్పుడు వాళ్ల బాక్సు వాళ్ల కోసమే ప్రత్యేకంగా తయారు చేసినట్టు కనిపిస్తే అదో ఆనందం. అందుకోసమే ఇప్పుడు కస్టమైజ్డ్ లంచ్ బాక్సులు దొరుకుతున్నాయి. స్టెయిన్లెస్ స్టీల్‌తో తయారు చేసిన వీటి మీద పిల్లల పేరులోని మొదటి అక్షరం, వాళ్లకు నచ్చిన కార్టూన్ లేదా ఫుట్‌బాల్, కార్లాంటి బొమ్మలు అచ్చేసి ఇస్తున్నారు. అలా కాకుండా వాళ్ల పూర్తి పేరు, ఫొటో కూడా వేసినవీ ఉంటున్నాయి. ఇక, ఈ బాక్సులకు జోడీగా కర్రీబాక్స్, వాటర్ బాటిల్, స్పూను, ఫోర్క్లాంటివీ కస్టమైజ్డ్గా వస్తున్నాయి. మన ఇష్టాన్ని బట్టి నచ్చినవి సెట్‌గా తీసుకోవడమే. అమెజాన్‌లాంటి వివిధ వెబ్సైట్లు ఇలాంటి కస్టమైజ్డ్ సేవలను అందిస్తున్నాయి.
ఐదారు తరగతుల పిల్లలు.. అందులోనూ ఆడప్లిలలైతే బొమ్మలతో ఆడుతుంటారు. వాటిని వెంట పెట్టుకుని తిరగడం, వాటితోనే నిద్రపోవడంలాంటివీ చేస్తుంటారు. బొమ్మల రంగులు, ఆకృతులు వాళ్లను అంతలా కట్టిపడేస్తాయి. అందుకే చూడగానే అచ్చం బొమ్మలా అనిపించే లంచ్ బాక్సులూ వస్తున్నాయి. పైన హై గ్రేడ్ ప్లాస్టిక్‌తో తయారైన వీటిని తెరిస్తే లోపల స్టెయిన్లెస్ స్టీల్ బాక్సులు ఉంటాయి.
టెడ్డీబేర్, తేనెటీగ, కుక్కపిల్లలాంటి వివిధ రకాల బొమ్మల ఆకృతుల్లో దొరుకుతున్నాయి. అవి కాకుండా మన దగ్గర ఒకదానిలో ఒకటి ఉండే కొండపల్లి బొమ్మల తరహాలో కనిపించే బెంటో బాక్సులూ ఈ రకంలో ఆకట్టుకుంటున్నాయి. రోజువారీ అవసరం కోసమే అయినా ఇలాంటి బాక్సులు కొంటే కానుక అందుకున్నంత ఆనంద పడతారు పిల్లలు.
ఆహారం వేడివేడిగా ఉంటే, ఓ పట్టుపట్టాలనిపిస్తుంది. పిల్లలైనా సరే, చల్లారిన దానితో పోలిస్తే వేడి అన్నాన్ని ఒక ముద్ద ఎక్కువే తింటారు. అందుకే వాళ్లు తినాలనుకున్నప్పుడు అన్నం, కూరల్ని వేడి చేసుకోగలిగేలా ఎలక్ట్రిక్ లంచ్ బాక్సులు తయారవుతున్నాయి. మామూలు బాక్సుల్లాగే వీటిలో అన్నం కూరల్ని సర్దవచ్చు. భోజనం చేయడానికి పదిపదిహేను నిమిషాల ముందు ప్లగ్‌కి కనెక్ట్ చేస్తే చాలు అన్నం, కూరలు చక్కగా వేడివేడిగా మారిపోతాయి. మరీ వేడవడం, మాడిపోవడంలాంటివి లేకుండా ఆటోకట్ తరహాలో పనిచేసే ఇవి, గబుక్కున పట్టుకున్నా షాక్ కొట్టకుండా షాక్ప్రూఫ్గానూ తయారవుతున్నాయి. కాబట్టి పెద్దలతో పాటు, పిల్లలకూ ఇవి మంచి ఆప్షనే!
చిన్న పిల్లలు కుదురుగా తినలేరు. వాటిని పట్టుకుని అటూఇటూ తిరుగుతూ, ఆడుతూ కిందా మీదా పోసుకుంటూ తింటుంటారు. అలాంటి సమస్య రాకుండా పిల్లలు ఆడుతూనే హాయిగా స్నాక్స్ తినేందుకు తయారు చేసినవే ఫింగర్ ట్రాప్ స్నాక్ కంటెయినర్ లేదా కప్‌లు. కప్పులా పట్టుకోగలిగేలా ఉండే వీటి లోపల స్నాక్స్ వేసి మూత పెట్టొచ్చు. ఆ మూత తెరిస్తే పిల్లలు లోపల చెయ్యి పెట్టి తీసుకునేందుకు వీలుగా వంగే ప్లాస్టిక్‌తో చేసిన చిన్న పొర ఉంటుంది. అంటే కేవలం చెయ్యి లోపల పెట్టి మాత్రమే పిల్లలు తినుబండారాలు తీసుకోగలుగుతారు. అలా కాకుండా అటూ ఇటూ తిప్పుతూ ఆడినా లోపల వేసినవి కింద పడిపోవు.