1960-70 ప్రాంతంలో చేతిలో ‘నటరాజ్ పెన్సిల్’ ఉండటాన్ని ఓ స్టేటస్ సింబల్‌గా భావించేవారు. లేటెస్ట్ ఐఫోన్ మాదిరిగానే.. నటరాజ్ పెన్సిల్ వాడేవాళ్లు ‘వేరే లెవెల్’గా ఫీలయ్యేవారు. ఇదంతా నిన్నమొన్నటి తరంలో.. మరి ఇప్పుడు? కాన్వెంట్ పిల్లాడు కూడా సొంత ల్యాప్‌టాప్, ట్యాబ్‌లోనే చదువుకుంటున్నాడు. మాములు పెన్సిల్ బదులుగా.. టచ్ స్క్రీన్‌పై రాసే ఇ-పెన్సిల్ వాడేస్తున్నాడు. ఇలాంటి తరానికి కూడా నాణ్యమైన పెన్సిల్స్ అందిస్తూ, వారి చేతిరాతతోపాటు జీవితాన్నీ అందంగా తీర్చిదిద్దుతున్నది..
Nataraj Pencils | హిందుస్థాన్ పెన్సిల్స్ సంస్థ. దేశంలోని దాదాపు ప్రతి విద్యార్థి చేతినీ అలంకరించిన నటరాజ్ పెన్సిల్‌ను తయారుచేసింది ఒక స్కూల్ డ్రాపవుట్. మధ్యలోనే చదువు ఆపేసినా, తన పెన్సిల్స్తోనే తన నుదుటన అదృష్ట రేఖలు గీసుకున్న ఆ వ్యాపారవేత్త.. బి.జె.సాంగ్వి. అందరూ ప్రేమతో ‘బాబూ భాయ్’గా పిలుస్తారు. తన మిత్రులు.. రామ్‌నాథ్ మెహ్రా, మన్సుంకానీతో కలిసి ‘నటరాజ్ పెన్సిల్స్’కు అంకురార్పణ చేశాడు. ఎన్ని కష్టాలు ఎదురైనా ఆత్మవిశ్వాసంతో ముందుకు సాగి.. వేలకోట్ల సామ్రాజ్యాన్ని నిర్మించాడు.
బాబూ భాయ్.. 1958 ప్రాంతంలో హై స్కూల్‌తోనే చదువు ఆపేశాడు. ఇంజినీరింగ్ చదవాలన్న ఆసక్తి ఉన్నా.. కుటుంబ పరిస్థితుల వల్ల చదువుకు దూరమయ్యాడు. రకరకాల పనులు చేశాడు. సొంతంగా ఏదైనా వ్యాపారం చేయాలని అనుకునేవాడు. ఆ సమయంలో నాణ్యమైన పెన్సిల్స్ అందరికీ దొరికేవి కాదు. కొద్దిమందికి మాత్రమే ఖరీదైన విదేశీ పెన్సిల్స్ అందుబాటులో ఉండేవి. స్కూల్లో చదువుకునేటప్పుడు.. తాను ఈ విషయాన్ని క్షుణ్నంగా గమనించాడు. దాంతో.. ‘నాణ్యమైన పెన్సిల్’ తయారీనే ఉపాధిగా మార్చుకోవాలని అనుకున్నాడు. మిత్రులు రామ్‌నాథ్ మెహ్రా, మన్సుకానీతో తన ఆలోచన పంచుకున్నాడు. వారూ ‘సరే’ అన్నారు.
‘హిందుస్థాన్ పెన్సిల్స్ ప్రైవేట్ లిమిటెడ్’ పేరుతో వ్యాపారం మొదలుపెట్టిన ఈ ముగ్గురు మిత్రులకూ.. ప్రారంభంలో అన్నీ కష్టాలే ఎదురయ్యాయి. ఆ రోజుల్లో పెన్సిల్ తయారీ యంత్రాలు విదేశాల్లోనే ఉండేవి. దాంతో ముగ్గురూ జర్మనీ వెళ్లి.. నాణ్యమైన పెన్సిల్ తయారీపై శిక్షణ పొందారు. నైపుణ్యం అయితే వచ్చింది కానీ.. పెన్సిల్స్ తయారీకి అది మాత్రమే సరిపోదు. ముడి పదార్థాలు కావాలి. బరువు తక్కువగా ఉండే నాణ్యమైన కర్ర, గ్రాఫైట్ కావాలి. దాంతో, ముగ్గురు మిత్రులూ అడవిబాట పట్టారు. స్వయంగా అన్వేషించి తక్కువ బరువు, ఎక్కువ నాణ్యత కలిగిన కర్రను తక్కువ ధరలోనే అందించే చెట్లను దొరకబుచ్చుకున్నారు. అప్పటి వరకు పెన్సిల్ తయారీకి ఉపయోగించే కలపను అమెరికా నుంచి దిగుమతి చేసుకునేవారు. దాంతో వాటి ఖరీదు ఎక్కువగా ఉండేది. బాబూ భాయ్ బృందం.. అనేక నెలలపాటు పలు రాష్ర్టాల్లోని అడవుల్లో స్వయంగా కలపను పరిశీలించి, ప్రయోగాలు చేసి.. చివరకు పాపులర్ ఉడ్ సరైనదని నిర్ణయించుకున్నారు. వాటితోనే పెన్సిల్స్ తయారీని మొదలుపెట్టారు. ప్రస్తుతం ఈ చెట్లను ప్రత్యేకంగా పెంచుతున్నారు.
ఓవైపు వ్యాపారం పుంజుకుంటున్న సమయంలోనే చిన్నచిన్న సమస్యలతో ఇద్దరు మిత్రులు పక్కకు తప్పుకొన్నారు. బాబూ భాయ్ మాత్రం.. పెన్సిల్స్లోనే తన అదృష్ట రేఖలు దాగి ఉన్నాయని గట్టిగా నమ్మాడు. రెట్టించిన ఉత్సాహంతో పనిచేసి.. 1970 నాటికి భారత మార్కెట్లో ‘నటరాజ్ పెన్సిల్’ జెండా పాతాడు. అప్పటివరకు విద్యార్థుల కోసం పెన్సిల్స్ తయారుచేసిన ‘హిందుస్థాన్ పెన్సిల్స్’.. ఇతర వృత్తుల వారిపైనా దృష్టి పెట్టింది. బొమ్మలు వేసే ఆర్టిస్ట్‌లు, ఆఫీస్ వర్క్ చేసుకునేవారి కోసం మరింత నాణ్యతతో ‘అప్సర పెన్సిల్’ను తీసుకొచ్చింది. 1970లో మార్కెట్లోకి వచ్చిన ఈ బ్రాండ్ కూడా సక్సెస్‌ఫుల్‌గా అమ్ముడైంది.
పెన్సిల్ తయారీరంగంలో అప్పటిదాకా ఏకఛత్రాదిపత్యం సాగించిన ‘హిందుస్థాన్ పెన్సిల్’ సంస్థకు.. 1991లో వచ్చిన ఆర్థిక సంస్కరణలతో పోటీ మొదలైంది. అయితే, మార్కెట్‌ను ముందుగానే అంచనా వేసిన బాబూ భాయ్ సంస్థ.. విదేశీ కంపెనీల రాకకుముందే టీవీలు, ఇతర మీడియాల్లో ప్రకటనల ద్వారా ఇంటింటికీ చేరింది. పెన్సిల్స్ తయారీకి మాత్రమే పరిమితం కాకుండా.. పెన్నులు, రంగు రంగుల పెన్సిల్స్, అన్ని రకాల స్టేషనరీ రంగంలోకి ప్రవేశించింది.
చిన్నగా మొదలైన హిందుస్థాన్ పెన్సిల్స్ ప్రైవేట్ లిమిటెడ్ సంస్థను వందల కోట్ల కంపెనీగా తీర్చిదిద్దారు బాబూ భాయ్. 2024లో సంస్థ.. రూ.1,480 కోట్ల ఆదాయాన్ని సంపాదించింది. బాబూ భాయ్ తదనంతరం అతని కుటుంబమే కంపెనీని నిర్వహిస్తున్నది. అతని కొడుకులు హరేంద్ర సాంగ్వి, కీర్తి సాంగ్వి మేనేజింగ్ డైరెక్టర్లుగా ఉన్నారు. ప్రతిరోజు 85 లక్షల పెన్సిల్స్ తయారు చేస్తున్నారు. వీటిని ప్రపంచవ్యాప్తంగా 50 దేశాలకు ఎగుమతి చేస్తున్నారు. మన దేశంలోని పిల్లల చేతుల్లోనే కాదు.. ఆసియా, మిడిల్ ఈస్ట్, యూరప్ దేశాల్లోని పిల్లలూ వీరి పెన్సిల్స్తోనే అక్షరాలు దిద్దుతున్నారు.
-బుద్దా మురళి
98499 98087