తిరస్కారం.. విజయానికి మెట్లుగా మలచుకుందాం!
తిరస్కారం ఎదుర్కోవడమనేది జీవితంలో అత్యంత బాధాకరమైన, మానసికంగా కుంగదీసే అనుభవాలలో ఒకటి. ఇది ఉద్యోగ ఇంటర్వ్యూలో కావచ్చు, ప్రేమలో కావచ్చు, లేదా స్నేహితులు, సమాజంలో కావచ్చు. ప్రతి ఒక్కరూ తమ జీవితంలో ఎప్పుడో ఒకప్పుడు తిరస్కారాన్ని ఎదుర్కొంటూనే ఉంటారు. అయితే, దీని వెనుక ఉన్న మనస్తత్వాన్ని అర్థం చేసుకుంటే, దీనిని విజయానికి మెట్లుగా మలచుకోవడం సులభమవుతుంది.
మన్తరంగం
మన మెదడు పరిణామ క్రమంలో సాంఘిక జీవిగా రూపుదిద్దుకుంది. పురాతన కాలంలో ఒక గుంపు లేదా సమాజం నుంచి బహిష్కరణకు గురవడం అంటే ప్రాణాపాయం అని భావించే పరిస్థితి. అందుకే మన మెదడు తిరస్కారాన్ని కేవలం ఒక భావోద్వేగంగా కాకుండా, భౌతిక నొప్పి లాగానే భావిస్తుంది. మెదడులోని ‘యాన్టీరియర్ సింగ్యులేట్ కార్టెక్స్’ అనే భాగం శారీరక గాయాలైనప్పుడు, ఎవరైనా మనలను తిరస్కరించినప్పుడు ఒకే రకమైన సంకేతాలను ఇస్తుంది. తిరస్కారానికి గురైనప్పుడు మనుషులు సాధారణంగా మూడు రకాల మానసిక దశలను అనుభవిస్తారు.
అపనమ్మకం, షాక్: ‘ఇది నిజం కాకూడదు’ అనే భావన.
ఆత్మన్యూనత: ‘నేనే ఎక్కడ తప్పు చేశాను?’, ‘నాలో లోపం ఉందా?’ అని స్వయంగా ప్రశ్నించుకోవడం.
కోపం, నిరాశ: ఇతరులపై కోపం పెంచుకోవడం లేదా పూర్తిగా వెనక్కి తగ్గిపోవడం.
తిరస్కారం మాములే..
ప్రపంచంలో విజయం సాధించిన ప్రతి ఒక్కరూ తమ జీవితంలో భారీ తిరస్కారాలను ఎదుర్కొన్నవారే. ఒక వ్యక్తి లేదా సంస్థ మిమ్మల్ని తిరస్కరించారంటే, మీ విలువ పడిపోయినట్లు కాదు. కేవలం ఆ సమయానికి మీ అర్హతలు లేదా ఆలోచనలు వారి అవసరాలకు సరిపోలేదు అంతే. తిరస్కారానికి కారణాలు చాలావరకు ఇతరుల పరిస్థితులు, ప్రాధాన్యాలు లేదా పరిమితులపై ఆధారపడి ఉంటాయి, మీపై కాదు. సాధ్యమైనచోట నిర్మాణాత్మకమైన ఫీడ్‌బ్యాక్ తీసుకుని, మీ నైపుణ్యాలను మెరుగుపరచుకోవడానికి దానిని ఉపయోగించండి. విఫలమైనప్పుడు మిమ్మల్ని మీరు తిట్టుకోవడం మానేసి, కష్ట సమయంలో ఒక మంచి స్నేహితుడు మిమ్మల్ని ఓదార్చినట్లుగా మీతో మీరు సానుకూలంగా మాట్లాడుకోండి.
థెరపీ ఇలా..
తిరస్కారం వల్ల కలిగే మానసిక వేదనను, ఆత్మవిశ్వాస లేమిని అధిగమించడానికి ఆధునిక మనస్తత్వశాస్త్రంలో అనేక ప్రభావవంతమైన చికిత్సా విధానాలు అందుబాటులో ఉన్నాయి. ఈ పద్ధతులు వ్యక్తులు తమ భావోద్వేగాలను నియంత్రించుకోవడానికి, తిరస్కారాన్ని ఒక అవకాశంగా మలుచుకోవడానికి సహాయపడతాయి.
1. కాగ్నిటివ్ బిహేవియరల్ థెరపీ (సీబీటీ)
తిరస్కారాన్ని ఎదుర్కోవడానికి అత్యంత ప్రాచుర్యం పొందిన, శక్తిమంతమైన పద్ధతి సీబీటీ. దీనిలో ప్రధానంగా ‘ఆటోమేటిక్ నెగెటివ్ థాట్స్’ను గుర్తించి మార్చడం జరుగుతుంది. తిరస్కారానికి గురైనప్పుడు మన మెదడు ‘నేను దేనికీ పనికిరాను’, ‘అందరూ నన్ను పక్కన పెడుతున్నారు’ అనే ఆలోచనలను సృష్టిస్తుంది. సీబీటీ ద్వారా ఈ ఆలోచనలను తార్కిక ప్రశ్నలతో బేరీజు వేసి, వాస్తవాలను గుర్తించడం నేర్చుకుంటారు.
2. రేషనల్ ఎమోటివ్ బిహేవియర్ థెరపీ (ఆర్ఈబీటీ)
ఆల్బర్ట్ ఎల్లిస్ ప్రతిపాదించిన ఈ సిద్ధాంతం ప్రకారం మనల్ని బాధించేది ‘ఘటన’ కాదు. ఘటన గురించి మనం నమ్మే విధానం. ఇంటర్వ్యూలో సెలెక్ట్ కాకపోవడం, ‘ఇది నాకు తీరని అవమానం, నా జీవితం వ్యర్థం’ అనే అహేతుక నమ్మకం.
దాని పర్యవసానంగా తీవ్రమైన నిరాశ, డిప్రెషన్. ‘ఇది ఒక్కటే నా జీవితం కాదు కదా?’ అని ఆ నమ్మకాలను ప్రశ్నించడం. సానుకూల దృక్పథం, మానసిక ప్రశాంతత ఏర్పడటం. తిరస్కారం వల్ల కలిగే సంక్షోభాన్ని హేతుబద్ధమైన ఆలోచనలతో అధిగమించడానికి ఆర్ఈబీటీ సహాయపడుతుంది.
3. ఆక్సెప్టెన్స్ అండ్ కమిట్మెంట్ థెరపీ (ఏసీటీ)
చాలామంది తిరస్కారాన్ని మర్చిపోవడానికి లేదా ఆ బాధను అణచివేయడానికి ప్రయత్నిస్తారు. కానీ, ఏసీటీ దీనికి భిన్నంగా ‘స్వీకరణ’పై దృష్టి పెడుతుంది. తిరస్కారం కలిగించే బాధను, నిరాశను అలాగే అంగీకరించడం. బాధను తప్పుపట్టకుండా, దానిని ఒక సాధారణ మానసిక అనుభవంగా భావించడం. ఆ బాధతోనే రాజీపడి, మన జీవిత విలువలకు అనుగుణంగా ముందుకు సాగడానికి ఈ థెరపీ ప్రేరేపిస్తుంది.
4. సెల్ఫ్ -కంపాషన్ థెరపీ
తిరస్కారానికి గురైనప్పుడు మనుషులు తమను తాము ఎక్కువగా విమర్శించుకుంటారు. దీనివల్ల మానసిక ఆరోగ్యం మరింత దిగజారుతుంది. డాక్టర్ క్రిస్టిన్ నెఫ్ ప్రతిపాదించిన సెల్ఫ్-కంపాషన్ పద్ధతి ఇక్కడ ఎంతో సహాయపడుతుంది. తిరస్కారం వల్ల కలిగే నొప్పిని ఎలాంటి తీర్పులు లేకుండా, తటస్థంగా గమనించడం, కష్టకాలంలో ఒక స్నేహితుడిని ఓదార్చినట్లుగా, మనల్ని మనం ప్రేమగా ఓదార్చుకోవడం. ‘ఇది అందరికీ జరిగేదే, నేను ఒంటరిగా లేను’ అని భావించడం ఈ థెరపీ నేర్పుతుంది.
5. మైండ్ రీఫ్రేమింగ్
తిరస్కారాన్ని ఒక ‘అపజయంగా’ కాకుండా, ఒక ‘ఫీడ్‌బ్యాక్’ (సమాచారం) గా మార్చుకోవడాన్ని మైండ్ రీఫ్రేమింగ్ అంటారు. ఒత్తిడిని తట్టుకుని, ఎంతటి ఇబ్బందికర పరిస్థితిలోనైనా మళ్లీ కోలుకునే శక్తిని పెంపొందించే వ్యూహాలు, చిన్న చిన్న లక్ష్యాలను పెట్టుకోవడం, భావోద్వేగ నియంత్రణ పద్ధతులు నేర్చుకోవడం జరుగుతుంది.
చివరిగా, తిరస్కారం అనేది మీ ప్రయాణానికి ముగింపు కాదు, కేవలం ఒక మలుపు మాత్రమే. ప్రతి తిరస్కారం మిమ్మల్ని మరింత బలంగా, మరింత తెలివిగా మారుస్తుంది. దీనిని ఒక విఫలతగా కాక, సరికొత్త పాఠంగా స్వీకరించాలి.
బి. కృష్ణ, సీనియర్ సైకాలజిస్ట్
ఇగ్నిషియో చైల్డ్ డెవలప్మెంట్ సెంటర్,
హైదరాబాద్, 99854 28261
Read Today's Latest Sunday News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Viral News | అనారోగ్యంతో ఉన్న అమ్మకోసం కేంద్ర మాజీ మంత్రి వేణుగానం..!
Watch: 8 ఏళ్ల బాలుడి దారుణం.. క్లాస్‌లో యూకేజీ బాలికపై రాయితో దాడి, చిన్నారి పరిస్థితి విషమం
Brothers Lifestyle Upgrade | సోదరుల జీవనశైలిలో ఆకస్మిక మార్పు.. ఇంట్లో దాచిన డ్రమ్ముల్లో కోట్లలో డబ్బు చూసి పోలీసులు షాక్
Viral News | ఇంజక్షన్ చూడగానే పక్షవాతం పరార్.. లేచి పరుగందుకున్న బెగ్గర్.. Video
El Nino | భారత్‌ను తీవ్రంగా దెబ్బకొట్టనున్న ఎల్‌నినో.. మార్చి నాటికి 55 వేల మరణాలు..!

