బాత్రూంలోకి అడుగు పెట్టగానే రంగు రంగుల ద్రాక్ష గుత్తులు, ఎర్రటి స్ట్రాబెర్రీ ఆకృతులు, అందమైన హృదయకారాలు వేలాడుతూ కనువిందు చేస్తే … ఏ గులాబీల పరిమళమో, లావెండర్ సువాసనో ఇట్టే చుట్టేస్తే.. ఎంత బాగుంటుందో కదూ! సరికొత్తగా మార్కెట్లోకి వస్తున్న హ్యాంగింగ్ సోప్‌లు స్నానానికి కొత్త అనుభూతిని జోడిస్తున్నాయి. సబ్బు అంటే శరీరాన్ని శుభ్రం చేయడమే కాదు మంచి రిఫ్రెష్మెంట్ కూడా ఇస్తాయని నిరూపిస్తున్నాయి.
ఉదయం నిద్రలేవగానే మన శరీరానికి, మనసుకు ఆహ్లాదాన్ని, సరికొత్త ఉత్సాహాన్ని పంచే ప్రక్రియల్లో స్నానం ముఖ్యమైనది. అందుకోసం మనం ఎప్పుడూ చతురస్రాకారంగానో, గుండ్రంగానో ఉండే సబ్బులనే వాడతాం. అందుకు భిన్నంగా కాస్త కొత్తగా కనిపించేవే ఈ వేలాడే సబ్బులు. స్నానానికి కొత్త ట్విస్ట్ ఇచ్చే వీటితో ప్రత్యేక ఉపయోగాలు కూడా ఉన్నాయి. ఈ రకం సబ్బులను సబ్బు పెట్టెలో పెట్టకుండా వేలాడదీయడం వల్ల వాడిన తర్వాత సబ్బు త్వరగా ఆరిపోతుంది. నీటిలో నానకుండా ఉండటంతో వృథా తగ్గుతుంది.
ఈ సబ్బుల తయారీ కోసం చర్మంపై సున్నితంగా వ్యవహరించే గ్లిజరిన్‌ను బేస్‌గా ఉపయోగిస్తారు. దానివల్ల సబ్బులు గాజులా పారదర్శకంగా కనిపిస్తాయి. గ్లిజరిన్‌ను చిన్న ముక్కలుగా కత్తిరించి తక్కువ వేడి మీద కరిగిస్తారు. అందులో పూలు పండ్ల సువాసనలు కలిగిన ఎసెన్షియల్ ఆయిల్స్‌ను కలుపుతారు. అలాగే ఏ పండు ఆకృతిలో చేయాలి అనుకుంటే దానికి తగ్గట్టు ఎరుపు, ఆకుపచ్చ… ఇలా ఆర్గానిక్ రంగులు కలుపుతారు. ఇప్పడు ఈ సువాసనల మిశ్రమాన్ని చిన్న చిన్న పండ్లు లేదా గుండె ఆకారాల్లో ఉండే సిలికాన్ అచ్చులలో పోస్తారు. ఒక విలక్షణమైన పద్ధతిలో బలమైన జనపనార తాడును ఈ అచ్చుల గుండా వెళ్లేలా అమర్చి సబ్బులు గట్టి పడేదాకా కొన్నిగంటల పాటు ఉంచుతారు. అంతా పూర్తయిన తర్వాత అచ్చుల నుంచి విడదీస్తే ఎంతో అందమైన రంగు రంగుల గుత్తిలాంటి సబ్బు మన కళ్ల ముందు ఉంటుంది. వీటిల్లో గ్రేప్, బెర్రీ, లైమ్లాంటి పండ్లతో పాటు రోజ్, జాస్మిన్, ల్యావెండర్లాంటి పూల పరిమళాలున్నవి దొరుకుతున్నాయి. అలాగే చర్మ సంరక్షణ కోసం గ్రేప్ సీడ్ ఆయిల్, విటమిన్-ఇ కలిపిన సోప్స్ కూడా మార్కెట్లో లభిస్తున్నాయి.
హ్యాంగింగ్ సోప్స్ కేవలం ఉపయోగకరమైనవే కాదు, బాత్రూం డెకర్లోనూ భాగమవుతున్నాయి. రంగురంగుల డిజైన్లు, విభిన్న ఆకారాలు, సహజ రంగులతో తయారైన ఈ సబ్బులు స్నానాలగదికి ప్రత్యేక అందాన్ని తీసుకొస్తాయి. వీటిని బాత్రూంలో షవర్ పైపునకు లేదా గోడకు ఉన్న హుక్ కు తగిలించడం వల్ల దానికి లగ్జరీ లుక్ వస్తుంది. బాత్రూం అలంకరణలో ఇవీ ఒక భాగంగా మారిపోతాయి. ఇక, వీటిని వార్డ్రోబ్ ఫ్రెష్నర్లుగానూ వాడొచ్చు. అక్కడ వేలాడదీయడం వల్ల బట్టలు సువాసనలు వెదజల్లుతూ ఉంటాయి. ఆధునిక జీవనశైలికి అద్దం పట్టే ఇవి అటు పెద్దలకూ ఇవి పిల్లలకూ ఎంతగానో నచ్చుతున్నాయి.