హిమగిరుల మధ్యనున్న లద్దాఖ్ ఓ అద్భుతం. చైనా, పాకిస్థాన్ సరిహద్దులు పంచుకున్న లద్దాఖ్‌లో ఎల్లలు లేని సౌందర్యం కనిపిస్తుంది. చుట్టూ ఉన్న కొండలు.. ఏడాదిలో సింహభాగం దట్టమైన మంచుతో ఉంటాయి. ఏప్రిల్ ఎంట్రీతో ఇక్కడి గిరులన్నీ మంచువీడి రంగురాళ్ల గుట్టల్లా దర్శనమిస్తాయి. అందులోనూ ఓ ఆకర్షణ ఉంటుంది. లోయల వెంట సింధు, జన్స్కర్ నదులు పరవళ్లు తొక్కుతూ ప్రవహిస్తుంటాయి.ఎన్నెన్నో ప్రత్యేకతలు ఉన్న లద్దాఖ్ 1974 తర్వాత ట్రావెలోకంలో ప్రవేశించి అందరి మజిలీ అయింది.
లద్దాఖ్అంటే.. కనుమల (రెండు పర్వతాల మధ్య నుంచి వెళ్లే దారులు) నిలయం అని అర్థం. కేంద్రపాలిత ప్రాంతంగా ఉన్న లద్దాఖ్ రాజధాని లేహ్. భిన్న సంస్కృతుల సమాహారంగా దర్శనమిస్తుంది ఈ నగరం. శ్రీనగర్ నుంచి 434 కిలో మీటర్ల దూరంలో ఉంటుంది. లేహ్ పరిసరాల్లో బౌద్ధ ఆరామాలు కోకొల్లలు. హిందూ ఆలయాలూ కనిపిస్తాయి. ఇక్కడి కొండలపై శతాబ్దాల కిందట నిర్మించిన ఆవాసాలు చూడొచ్చు. లేహ్ ప్యాలెస్, బౌద్ధ ఆరామాల నిర్మాణశైలి ఆశ్చర్యం కలిగిస్తుంది. షాపింగ్‌కు కూడా లేహ్ ప్రసిద్ధి. టిబెటన్ కళాకారులు రూపొందించిన లోహాకృతులు, లద్దాఖీ మహిళలు తీర్చిదిద్దిన కళాత్మక వస్తువులు వేటికవే మేటిగా ఆకర్షిస్తాయి. కార్పెట్లు, శాలువలు.. లద్దాఖ్ పర్యాటకుల తిరుగు ప్రయాణంలో చోటు దక్కించుకుంటాయి. లేహ్‌లో అడ్వెంచర్ క్లబ్బులు ఎన్నో ఉన్నాయి. ట్రెక్కింగ్ సామగ్రి కూడా తక్కువ ధరలో లభిస్తుంది.
చుట్టుపక్కల బోలెడు
లేహ్‌లో వీధులు, నివాసాలు చూడముచ్చటగా ఉంటాయి. రాళ్లు, మట్టితో నిర్మించిన గోడలు, భారీ గృహాలు గమ్మత్తుగా అనిపిస్తాయి. నగరంలోని లేహ్ ప్యాలెస్, శివాలయం, శాంతి స్తూపం, మైత్రేయ ఆరామం ప్రత్యేక ఆకర్షణలు. లద్దాఖ్‌లోని మిగిలిన పర్యాటక కేంద్రాలు విహరించాలంటే ఇన్నర్‌లైన్ పర్మిట్ (ప్రత్యేక అనుమతి) తప్పనిసరి. నగరంలోని డిప్యూటీ కమిషనర్ కార్యాలయంలో దరఖాస్తుతోపాటు వ్యక్తిగత ధ్రువీకరణ పత్రం నకలు ఆందజేసి, రూ.400 రుసుం కడితే అనుమతి లభిస్తుంది. https://www.lahdclehpermit.in/ వెబ్‌లింక్ ద్వారా కూడా అనుమతి పొందొచ్చు.
లేహ్‌కు 160 కి.మీ. దూరంలో ఉంటుంది ప్యాంగాంగ్ సరస్సు. హిమాలయాల మధ్య, సముద్రమట్టానికి సుమారు 14,280 అడుగుల ఎత్తులో ఉప్పునీటి సరస్సు ఉండటం ఆశ్చర్యం కలిగిస్తుంది. దాదాపు 600 చ.కి.మీ. విస్తరించిన ఈ సరస్సులోని కొంత భాగం భారత్‌లోనూ, కొంత భాగం టిబెట్‌లో ఉంటుంది. ప్యాంగాంగ్ సరస్సు… హిమాలయాలు ఏర్పడటానికి కన్నా పూర్వం నుంచి ఉందని చెబుతారు. లద్దాఖ్ ప్రాంతంలో ఉండే మరో అద్భుతమైన సరస్సు త్సో మొరీరి. చంగ్లింగ్ పీఠభూమిలో ఉండే ఈ భారీ తటాకం సూర్యుడి గమనం ఆధారంగా రంగులు మారుస్తుంటుంది.
సాహసాల విందు
లద్దాఖ్ వచ్చే పర్యాటకులు ఉత్సాహాన్ని రెట్టింపు చేసేలా ఇక్కడ ఎన్నో సాహసక్రీడలు అందుబాటులో ఉన్నాయి. ట్రెక్కింగ్: చాదర్ ట్రెక్, స్టాక్ కాంగ్రీ, జన్స్కర్ నది, మొరీరి సరస్సు, నుబ్రా లోయ, షామ్ లోయ, సింధు లోయ ట్రెక్కింగ్ జోన్లుగా ప్రసిద్ధి చెందాయి.రివర్ రాఫ్టింగ్: సింధు, జన్స్కర్ నది పరివాహక ప్రాంతాల్లో రాఫ్టింగ్ అవకాశం ఉంది. చిన్న చిన్న నదీపాయల్లోనూ రాఫ్టింగ్ నిర్వహిస్తుంటారు.
క్యాంపులు: ఇక్కడి కొండల్లో, లోయల్లో నైట్ఫైర్ క్యాంప్‌లు పర్యాటకులకు వినోదాన్ని పంచుతాయి.
రెండు దారుల్లో..
లేహ్‌కు రెండు దారుల్లో చేరుకోవచ్చు. శ్రీనగర్ నుంచి కార్గిల్ మీదుగా (434 కి.మీ.) వెళ్లొచ్చు. హిమాచల్‌ప్రదేశ్‌లోని మనాలి నుంచి లేహ్ (473 కి. మీ.) చేరుకోవచ్చు. ఈ రెండు దారులూ నవంబరు నుంచి ఏప్రిల్ వరకు మంచుతో పేరుకుపోయి ఉంటాయి. ఏప్రిల్ చివరి వారం గానీ, మే మధ్య వారంలో గానీ తెరుచుకుంటాయి. అప్పటినుంచి ఈ రహదారులపై వాహనాల జోరు పెరుగుతుంది. బైకులు దూసుకుపోతుంటాయి. కార్లు షికారుకెళ్తుంటాయి. బస్సుల్లోనూ పర్యాటకులే! బైక్ రైడర్లు చాలామంది మనాలి నుంచి లేహ్ వెళ్లడానికి ఇష్టపడతారు. ఎత్తయిన కనుమల మీదుగా సాగే ప్రయాణం ఆద్యంతం సాహసోపేతంగా ఉంటుంది.