యోగర్ట్ పొట్ట ఆరోగ్యానికి ఎంతో మంచిదనే విషయం తెలిసిందే. అయితే ఇది మెదడు ఆరోగ్యానికీ మేలు చేస్తుందని ఓ పరిశోధనలో తేలింది. యూనివర్సిటీ ఆఫ్ వర్జీనియా చేసిన ఈ పరిశోధనలో యోగర్ట్, ఇతర పులిసిన పదార్థాల్లో ఉండే లాక్టోబాసిల్లస్ అనే బ్యాక్టీరియా శరీరం ఒత్తిడి నివారించుకునే దిశగా దోహదపడుతుందని వెల్లడైంది. ఇంకా ఆందోళన, కుంగుబాటు నివారణలో కూడా లాక్టోబాసిల్లస్ సహాయకారిగా ఉంటుందట. “ఆందోళన, కుంగుబాటుకు పరిష్కారాలను కనుక్కొనే దిశగా మా పరిశోధన కొత్తబాటలు వేస్తుంది” అంటారు ఆల్బన్ గాట్లియెర్ అనే పరిశోధకుడు. కాగా ఈ పరిశోధనను ప్రయోగశాలలో ఎలుకలపై నిర్వహించారు.
కీటో డైట్… చాలా తక్కువ కార్బొహైడ్రేట్లు, ఎక్కువ కొవ్వులు ఉండే ఆహారం. ఈ రకమైన ఆహారం తినడం వల్ల శక్తి కోసం శరీరం కొవ్వులను కరిగిస్తుంది. అయితే అమెరికన్ కాలేజ్ ఆఫ్ కార్డియాలసీ వార్షిక సమావేశంలో వెల్లడించిన ఓ అధ్యయనం ప్రకారం… రోజువారీగా తినే ప్రామాణిక ఆహారంతో పోలిస్తే కీటో డైట్ అనుసరించే వాళ్లు గుండెకు సంబంధించిన సమస్యల బారినపడే ముప్పు ఎక్కువగా ఉందట. వీరిలో ఛాతీలో నొప్పి, ధమనుల్లో అవరోధాలు, గుండెపోటు, స్ట్రోక్ లాంటి గుండె రక్తనాళాల సమస్యల ముప్పు రెండు రెట్లు ఎక్కువగా ఉంటుందట. కాబట్టి, ఆహార విధానంలో ఏ మార్పు చేసుకున్నా నిపుణుల సూచనల మేరకే చేసుకోవడం మంచిది.
చిన్నతనంలో దుర్భాషలు, తిట్లు, దెబ్బలు తిన్న పిల్లలు వారికి పదిహేడేండ్లు వచ్చేసరికి ఇతరులతో పోలిస్తే మూడున్నర రెట్లు మానసిక సమస్యలు ఎదుర్కొంటారట. నేచర్ మెంటల్ హెల్త్ అనే జర్నల్‌లో ప్రచురితమైన ఓ అధ్యయనం ఈ విషయం తెలిపింది. ఈ అధ్యయనం కోసం పరిశోధకులు యునైటెడ్ కింగ్డమ్కు చెందిన పదివేల మంది పిల్లల నుంచి సమాచారం సేకరించారు. పిల్లలు ఆరోగ్యకరంగా పెరిగి పెద్దవడానికి ఇంటా బయటా సాటి మనుషుల పట్ల నమ్మకం కలిగించే వాతావరణం ఉండేలా చూడాలని పరిశోధకులు తెలిపారు. ముఖ్యంగా బడిలో ఆరోగ్యకరమైన వాతావరణం ఉండాలని సూచించారు.
ఇప్పటి పిల్లలు పిజ్జాలు, బర్గర్లు, చిప్స్ తదితర జంక్ఫుడ్స్ తెగ లాగించేస్తున్నారు. ఆరోగ్యకరమైన ఆహారం ఉన్నా వీటికే ఓటేస్తున్నారు. అయితే, జంక్‌ఫుడ్ పిల్లల ఆరోగ్యం మీద తీవ్రమైన దుష్ప్రభావాలు చూపుతుందట. కాలేయానికి సంబంధించిన ఫ్యాటీ లివర్ డిసీజ్ మొదలుకుని జీవక్రియల రుగ్మతల వరకు జంక్‌ఫుడ్ కలిగించే అనర్థాలు అనేకం. అందువల్ల తల్లిదండ్రులు తమ పిల్లలకు ఆరోగ్యకరమైన ఆహారం ప్రాధాన్యం వివరించాలని నిపుణులు హెచ్చరిస్తున్నారు.