కోమలి ప్రసాద్.. డాక్టర్ చదివి, యాక్టర్ అయ్యింది. సాగర నగరం విశాఖలో పుట్టిపెరిగిన ఈ అమ్మడు..
కొన్నాళ్లు వైద్యురాలిగానూ సేవలందించింది. నటనపై ఆసక్తితో.. ‘నేను సీతాదేవి’ అంటూ టాలీవుడ్లోకి ఎంట్రీ ఇచ్చింది. అందం, అభినయంతో తెలుగు ప్రేక్షకులను మెప్పించింది. ఏడాది తర్వాత ‘నెపోలియన్’ సరసన తళుక్కున మెరిసింది. ఆ సినిమా అంతగా ఆడకపోవడంతో.. ‘అనుకున్నది ఒకటి అయినది మరొకటి’ అనుకొని, ‘రౌడీ బాయ్స్’తో జత కట్టింది. ఆ తర్వాత వరుసగా ‘హిట్’ మీద ‘హిట్’ కొట్టి.. ఇండస్ట్రీలో పాతుకుపోయింది. తాజాగా, ‘శశివదనే’గా వచ్చి..అభిమానులను మరోసారి అలరించింది. ఈ సందర్భంగా.. తన మనసులోని మాటలను ఇలా పంచుకున్నది.
మాది విశాఖపట్నం. చదువులో చురుకుగా ఉండేదాన్ని. చిన్నప్పటి నుంచీ యాక్టర్ అవ్వాలని ఉండేది. సినిమాల్లోకి వస్తానంటే నాన్న మొదట ఒప్పుకోలేదు. ‘డాక్టర్ పట్టా చేతికి వచ్చాకే.. ఏదైనా!’ అన్నారు. అందుకే.. మెడిసిన్ పూర్తి చేసి, కొన్నిరోజులు డెంటిస్ట్‌గా ప్రాక్టీస్ కూడా చేశాను. ఆ తర్వాతే ఇండస్ట్రీలోకి వచ్చాను.
నేను డాక్టర్, యాక్టర్‌ను మాత్రమే కాదు.. జాతీయస్థాయి అథ్లెట్‌ను కూడా. ఖోఖో, బ్యాడ్మింటన్ క్రీడల్లో బంగారు పతకాలు కూడా అందుకున్నా! నాకు క్లాసికల్ నృత్యం కూడా వచ్చు.
నేను వైట్కోట్లో ఉన్న ఫొటో ఒకటి ఇటీవల సోషల్ మీడియాలో తెగ చెక్కర్లు కొట్టింది. యాక్టింగ్‌ను వదిలేసి.. మళ్లీ డాక్టర్‌గా పనిచేస్తున్నట్లు కొందరు అసత్య ప్రచారం చేశారు. ఆ వార్తలు చూసి చాలా బాధపడ్డా! ఎన్నో కష్టాలు పడి ఇండస్ట్రీలో ఈ స్థాయికి చేరుకున్నా. అలాంటి కెరీర్‌ను మధ్యలో వదిలేసే ప్రసక్తే లేదు.
పోలీస్‌గా నటించడం చాలాపెద్ద సవాల్. అలాంటి అవకాశం చాలా తక్కువమందికి వస్తుంది. అందులోనూ ఒకస్టార్ హీరోతో కలిసి ఖాకీ యూనిఫాంలో కనిపించడం చాలా పెద్ద విషయం. అందుకే, ‘హిట్’ ప్రాంఛైజీలో సహాయ నటి పాత్ర అయినా ఒప్పుకొన్నా. సినిమాలు హిట్ కావడంతోపాటు నేను పోషించిన ఎస్పీ వర్షా పాత్ర.. నాకు మంచి గుర్తింపు తీసుకొచ్చింది. ఎంతోమందికి దగ్గర చేసింది.
కథల ఎంపికలో చాలా జాగ్రత్తగా వ్యవహరిస్తుంటా. అందుకే.. తక్కువ సినిమాల్లో కనిపిస్తున్నా. త్వరలోనే కొత్త ప్రాజెక్టులతో అభిమానుల ముందుకొస్తా.