Clearwater Beach | అమెరికాలోని ఈ బీచ్ స్పెషాలిటీ ఏంటంటే..
Clearwater Beach | అమెరికా, ఫ్లోరిడా రాష్ట్రంలోని టాంపా డౌన్‌టౌన్ నుంచి 40 కి.మీ. దూరంలో ఉంటుంది క్లియర్ వాటర్ బీచ్. టాంపా అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి 30 కి.మీ. ప్రయాణిస్తే ఈ బీచ్‌కు చేరుకోవచ్చు
Clearwater Beach | ‘నార్వేలోని నార్తర్న్ లైట్స్’ ఆకాశంలోని అద్భుతమైతే.. ఫ్లోరిడా రాష్ట్రంలోని ‘క్లియర్ వాటర్ బీచ్’ భూమ్మీది మహాద్భుతంగా నిలుస్తుంది. కనుచూపు మేర నీలం, ఆకుపచ్చ వర్ణాల్లో మెరిసిపోతూ.. అక్కడి సముద్రతీరం అబ్బుర పరుస్తుంది. పాల నురగల్లాంటి అలలు.. నిశ్చలంగా సవ్వడి చేస్తుంటే, బీచ్ నిండా మెరిసే తెల్లటి ఇసుక.. పర్యాటకుల మనసులు దోచేస్తుంది.
అమెరికా, ఫ్లోరిడా రాష్ట్రంలోని టాంపా డౌన్‌టౌన్ నుంచి 40 కి.మీ. దూరంలో ఉంటుంది క్లియర్ వాటర్ బీచ్. టాంపా అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి 30 కి.మీ. ప్రయాణిస్తే ఈ బీచ్‌కు చేరుకోవచ్చు. ఫ్లోరిడా తీరంలో నాలుగు మైళ్ల దాకా బీచ్ అందాలు కనువిందు చేస్తాయి. ఇక్కడి ఇసుక తెల్లని మంచులా మృదువుగా ఉంటుంది. ఈ ఇసుకలో ఎంతసేపు ఆడినా.. అలసట అనిపించదు. సముద్రంలోని నీళ్లు.. నీలం, ఆకుపచ్చ వర్ణాల్లో ప్రకాశిస్తూ.. పర్యాటకుల మనసులను దోచేస్తాయి. ఆ నీటిలో మునకలేస్తూ ఉంటే.. సమయమే తెలియదు.

సూర్యాస్తమయం చూడాల్సిందే
క్లియర్ వాటర్ బీచ్‌లోని మరో విశేషం.. ఇక్కడి సూర్యాస్తమయం. అప్పటిదాకా నీలం, ఆకుపచ్చ రంగుల్లో కనువిందు చేసే సముద్రం.. సాయంసంధ్యలో భానుడి కిరణాలు పడి స్వర్ణ వర్ణంలోకి మారిపోతుంది. ఆకాశంలోని మబ్బులు ఎరుపు, పసుపు రంగులమిళితమై అద్భుతంగా కనిపిస్తాయి. సూర్యోదయంలోనూ దాదాపు ఇలాంటి వాతావరణమే ఉంటుంది.

ఆటలు.. అద్భుతాలు
ఇక్కడికి వచ్చేవారంతా సన్‌బాత్, స్విమ్మింగ్ చేస్తూ కాలాన్ని మరచిపోతారు. వాటర్ గేమ్స్‌కు ఈ బీచ్ పెట్టింది పేరు. పారా సెయిలింగ్, జెట్ స్కీలు, బోటు షికార్లు.. పర్యాటకులకు వినోదాన్ని పంచుతాయి. స్వచ్ఛమైన నీటిలో బోటు విహారంచేస్తూ డాల్ఫిన్లను చూడటం.. ఓ మంచి అనుభూతి. ఆక్వా మ్యూజియం, అలిగేటర్ – వైల్డ్‌లైఫ్ మ్యూజియంలోకి అడుగుపెడితే.. సముద్రజీవుల ప్రపంచమంతా కండ్ల ముందు కదలాడుతుంది.

ర్యాంకుల పంట..
ర్యాంకింగ్‌ల ప్రకారం.. అమెరికాలోని టాప్-25 బీచ్‌లలో అత్యధికం ఫ్లోరిడాలోనే ఉన్నాయి. తర్వాత స్థానం హవాయిది. యునైటెడ్ స్టేట్స్‌లోని అత్యుత్తమ బీచ్‌లలో ప్రముఖమైంది.. క్లియర్ వాటర్ బీచ్. అంతేకాకుండా, ‘ట్రిప్ అడ్వైజర్’ ర్యాంకింగ్‌లలో ప్రపంచంలోని ఆరో ఉత్తమ బీచ్గానూ నిలిచింది. మేం టాంపాలో ఉన్నపుడు ఈ బీచ్‌ను సందర్శించాం. మాటలకు అందని అనుభూతులను మదిలో నింపుకొన్నాం. జీవిత పర్యంతం నెమరు వేసుకునే జ్ఞాపకాలతో వెనుదిరిగాం. సముద్ర దర్శనం ప్రతిసారీ కొత్తగానే అనిపిస్తుంది. ఓ కొత్త మిత్రుడితో సంభాషిస్తున్న భావన కలుగుతుంది. ఫ్లోరిడా బీచ్ నా సరికొత్త నేస్తం!

విందులు.. వినోదాలు
ప్రపంచ పర్యాటకుల స్వర్గధామం.. క్లియర్ వాటర్ బీచ్. నిత్యం వేలసంఖ్యలో ఈ బీచ్‌ను సందర్శిస్తుంటారు. వారాంతాల్లోనైతే.. ఇసుకేస్తే రాలనంత జనంతో బీచ్ నిండిపోతుంది. అద్భుతమైన సముద్రం ఓవైపు, విందులు, వినోదాలు మరోవైపు.. ఈ బీచ్ పర్యటనను మరో స్థాయికి తీసుకెళ్తాయి. బీచ్ పక్కనే చాలా రెస్టారెంట్లు ఉన్నాయి. పసందైన వంటకాలతో పర్యాటకులను ఆహ్వానిస్తుంటాయి. షాపింగ్ ఇష్టపడేవారికైతే పండుగే! బీచ్ పొడవునా.. రకరకాల నగల షాపులు, బహుమతుల దుకాణాలు.. ఎన్నో కొలువుదీరి కనిపిస్తాయి. ఇక్కడి వీధి ప్రదర్శనలు, సంగీత కార్యక్రమాలు ప్రతి ఒక్కరినీ అలరిస్తాయి. స్థానిక కళాకారులు రూపొందించిన వస్తువులతో రాత్రిపూట ఏర్పాటు చేసే ‘ఎగ్జిబిషన్’ మరో విశేషం. ప్రతి వస్తువూ కొనాలని పించేలా ఉంటుంది.
– పంతంగి శ్రీనివాస రావు
Read Today's Latest Sunday News in Telugu and Telugu News
- Tags
- Clearwater Beach
- Tour
- travel
RELATED ARTICLES
తాజా వార్తలు
Palamuru Rangareddy Lift Irrigation | కాంగ్రెస్ సర్కార్ అలసత్వం.. పాలమూరు- రంగారెడ్డి మోటార్లు బంద్
Riteish Deshmukh | రామ్ పోతినేని ‘RAPO 23’ టీంలోకి రితేశ్ దేశ్‌ముఖ్
Amazon Jobs | ఆ చట్టం అమల్లోకి వస్తే.. అమెజాన్‌లో మళ్లీ ఉద్యోగాల కోత.. ?
smit machchhar | ఆ విషయం నాకు నిజంగా తెలియదు : కెప్టెన్ స్మిత్ మచ్చర్
Congress Leaders | బతుకమ్మ పండుగ వేళ.. కాంగ్రెస్ నేతల డిష్యుం డిష్యుం
ట్రెండింగ్ వార్తలు
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం
Watch: చర్చిలో మరణం గురించి మాట్లాడిన ఫాదర్.. ఆయన తలపై సిలువ పడటంతో మృతి
Samsung Galaxy F70 5G | రూ.17,999కే శాంసంగ్ 5జీ ఫోన్.. 50MP కెమెరా, 5000mAh బ్యాటరీతో వచ్చేసింది!
Black Deer | కుర్సియాంగ్ అడవుల్లో మరో నల్లజింక ప్రత్యక్షం.. పరవశించిన పర్యాటకులు..!
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!

