Kiara Advani | ‘భరత్ అనే నేను’ సినిమాతో టాలీవుడ్లోకి ఎంట్రీ ఇచ్చిన బ్యూటీ కియారా అడ్వాణీ. బాలీవుడ్లో వరుస సినిమాలతో రాణిస్తున్న ఈ భామ తెలుగులో మాత్రం అంతగా ఆకట్టుకోలేకపోయింది. ‘వినయ విధేయ రామ’ సినిమా ఆశించిన ఫలితం ఇవ్వకపోవడంతో కొన్నాళ్లు టాలీవుడ్‌కు దూరమైంది. తాజాగా మెగాపవర్ స్టార్ రామ్‌చరణ్, డైరెక్టర్ శంకర్ దర్శకత్వంలో వచ్చిన ‘గేమ్‌ఛేంజర్’ సినిమాతో మరోసారి తెలుగు ప్రేక్షకుల ముందుకొచ్చింది. పెండ్లి తర్వాత కూడా కెరీర్లో సక్సెస్‌ఫుల్‌గా రాణిస్తున్న కియారా పంచుకున్న కబుర్లు..
సినిమాలు చేయడం ఒక పెద్ద కమిట్మెంట్. కథల ఎంపికలో చాలా జాగ్రత్తగా ఉంటాను. ఒక ప్రేక్షకురాలిగానే కథ వింటాను. తెర వెనక ఎంతోమంది పెట్టుబడి, కష్టం, కృషి ఉంటుంది. వాటన్నిటినీ దృష్టిలో పెట్టుకొని సినిమాలు చేయాలి. ఆ సినిమా ఫలితం ఎలా ఉన్నా దాన్ని ఒక అనుభవంగానే భావిస్తాను.
సినిమాల్లోకి రాకముందు కొన్నిరోజులు అమ్మ హెడ్‌మిస్ట్రెస్‌గా ఉన్న స్కూల్లో టీచర్గాపనిచేశాను. నా అసలు పేరు అలియా అడ్వాణీ. నిజానికి అమ్మవాళ్లు నాకు కియారా అనే పేరు పెడదామనుకుని.. ఎందకనో పెట్టలేదట. అందుకే సినిమాల్లోకి వచ్చాక నా పేరునుకియారా అడ్వాణీగా మార్చుకున్నా.
శరీరాన్ని ఫిట్‌గా ఉంచుకోడానికి నిత్యం వ్యాయామం చేస్తా. డ్యాన్స్ అన్నా, స్విమ్మింగ్ అన్నా ఇష్టం. మసాలాలు ఎక్కువగా ఉన్న ఫుడ్ తినను. నచ్చిన ఆహారం ఏదైనా తినేస్తా! అలాగనిఎక్కువగా తినడంగాని, ఉపవాసాలు ఉండటంగాని అస్సలు చేయను.
ఇండస్ట్రీకి వచ్చిన కొత్తలో కథలు ఎంచుకోవడం చాలా కష్టం అనిపించేది. అందువల్ల ఎన్నో విమర్శలను ఎదుర్కొన్నాను. ఏది చేసినా కొంచెం భిన్నంగా ఉండాలనే తత్వం నాది. ‘లస్ట్ స్టోరీస్’, ‘కబీర్ సింగ్’ సినిమాలు అలా ఎంచుకున్నవే. ఆ చిత్రాల్లోని నా పాత్రలకు ప్రశంసలతోపాటు విమర్శలు కూడా వచ్చాయి. కానీ, నటనపరంగా ఈ పాత్రలు నాకు ఎంతో సంతృప్తిని ఇచ్చాయి.
నాతో కలిసి పని చేయాలనుకునే వారిని, నన్ను దృష్టిలో పెట్టుకొని స్క్రిప్ట్‌ను సిద్ధం చేసుకుంటున్న వారిని కలిసినప్పుడు చాలా ఆనందంగా ఉంటుంది. ఇప్పటివరకూ చాలా మారాయి. కానీ మొదటినుంచి సినిమాల పట్ల నేను తీసుకుంటున్న నిర్ణయాల విషయంలో ఎలాంటి మార్పు లేదు.
పెండ్లికి ముందు నుంచే సిద్ధార్థ్.. నేను మా బంధాన్ని కాపాడుకోవాలని అనుకున్నాం. కానీ, ఇప్పుడు నటీనటులుగా మాకున్న గుర్తింపును కాపాడుకోవడంపై దృష్టిపెట్టాం. సినీరంగంలో మాకంటూ ఓ మంచి స్థానాన్ని సంపాదించుకున్నాం. దీనికోసం మేము చాలా కష్టపడ్డాం. మా వ్యక్తిగత జీవితంపై దృష్టి పెట్టి ప్రేక్షకుల అభిమానానికి దూరంగా ఉండాలనుకోవట్లేదు. మాపై వారికున్న ప్రేమ ఎప్పటికీ అలాగే ఉండాలని ఆశిస్తున్నాను.