– ఎం. వసుంధర, కొండగట్టు.
ఊరికి తూర్పున – ఉత్తరాన కొండలు ఉంటే.. ఊరికి అభివృద్ధి ఉండదు. అయితే, ఎంత దూరంలో ఆ కొండలు ఉన్నాయి అనేది ఇక్కడ ప్రాధాన్యాంశం అవుతుంది. దూరాన్ని బట్టి విషయం మారుతుంది. కొన్ని ఊర్లలో కొండ అంచున పొలాలు ఉండి, వాటికి దగ్గరలో ఇండ్లు ఉంటాయి. కొందరు కొండ అంచునుబట్టే గృహాల లేఅవుట్లు చేస్తుంటారు. ఇక్కడ లెక్కించదగ్గ అంశం ఏమిటంటే.. ఆ కొండల ఎత్తును అంచనావేసి, దానికి మూడు రెట్లు దూరంగా ఇంటి నిర్మాణాల లేఅవుట్లు వేసుకోవడం మంచిది. అలాకాకుండా, కొండలకు దగ్గరగా ఊర్లు వెలిస్తే, వాటి అభివృద్ధి, ఆరోగ్యస్థితి ప్రశ్నార్థకం అవుతుంది. ఒక లేఅవుట్ వెయ్యి సంవత్సరాల ఆయుష్షును కలిగి ఉంటుంది. అంటే, పది – పన్నెండు తరాలు పూర్వించాల్సింది. కానీ, పరిసరాల దోషంతో ఇలాంటి ఊర్లు ఎన్నో ఇబ్బందులు పడుతుంటాయి.

– కె. వీణాపాణి, పటాన్చెరువు.
ఏ స్థలంలో అయినా.. నాలుగు వైపులా కొలతలు చూసి, తక్కువ కొలత దిశను చూసి, దాన్ని ప్రమాణంగా చేసుకొని, మిగతా వాటిని సరిచేసుకోవాలి. దక్షిణం 30 అడుగులు ఉంటే, దానికి ఎదురుగా ఉన్న ఉత్తరం ఫేసును 30 అడుగులకు తగ్గించాలి. అలా తూర్పు – పడమర – దక్షిణం – ఉత్తరం సరిచేసుకొని, వచ్చిన స్థలంలో మీరు మంచి వాస్తు గృహం కట్టుకోండి. ఉత్తరం వీధి కాబట్టి, మీ స్థలానికి తప్పకుండా మంచి ఇల్లు కట్టుకునే అవకాశం ఉన్నది. అంతేకాదు, దక్షిణం – ఉత్తరం సమకొలతలు చేశాక, దానికి తూర్పుభాగం ఇంటిలో కలుపుకొన్నట్లయితే, తూర్పు – ఈశాన్యం పెరుగుతుంది. ఆ విధంగా ప్రహరీ కట్టుకొని, ఇల్లు నిర్మించండి. స్థలం వృథాకాదు. శాస్త్రం పోదు.

– కె. అనుపమ, మెదక్.
ఆలయాలు, ఇండ్లు కలిసి ఉండటం, అంటుకొని ఉండటం ఎప్పుడూ దోషమే! మీ స్థలం అమ్మవారి గుడికి ఎదురుగా ఉంది అంటున్నారు. దాని వైశాల్యం పెద్దదిగా ఉంటే.. సరైన విభజనతో నిర్మాణం చేసుకోవచ్చు. ఆలయం ఎదురుగా ఉన్న స్థలాన్ని ముందు వేరుచేయండి. అంటే.. ఆలయం వెడల్పును చూసి స్థలాన్ని కట్చేయండి. ఇక మిగిలిన భూమిలో ఇల్లు పట్టేటట్టు అయితే.. అందులో ముందు ఉత్తరంలో, దక్షిణ – పడమరలో కాంపౌండు కట్టండి. దక్షిణంలో లేదా ఆగ్నేయంలో గేటు పెట్టుకొని, అందులో ఇల్లు కట్టుకోవచ్చు. దుర్గాలయం వెడల్పు ఎంత ఉందో.. అంత మాత్రమే స్థలం ఉన్నట్లయితే.. దానిని యథావిధిగా వదిలేయండి. లేదా ఆ స్థలం ఆ గుడికి ఇవ్వండి. అంతేకానీ, అందులో వట్టి నిర్మాణం చేయడం మంచిదికాదు. అమ్మవారి గుడికి ఎదురుగా ఉండే గృహం యోగించదు. జాగ్రత్తగా పరిశీలించి, నిర్ణయం తీసుకోండి.

– బి. శ్రీలత, కొల్లూరు.
పండ్ల రసం మంచిదే! అయినా, అతిగా తీసుకుంటే విరేచనాలు కలుగుతాయి. అతి ఏదైనా.. విరుద్ధమే! ప్రతి అంశంలోనూ ఒక కొలత ఉంటుంది. ఒక పరిధి అనేది చాలా అవసరం. భూమి కూడా తన పరిధిలోనే ఉండి తిరుగుతుంది. తన హద్దు మారినా.. తన భ్రమణ వేగం సెకండులో వెయ్యోవంతు ఆగినా.. భూమిమీద ఉన్నవన్నీ అనంతంలో కలిసిపోతాయి. అది ఒక నియతి. దానినే పరిధి, హద్దు అంటుంది శాస్త్రం. ఈశాన్యం అనగానే.. అదేదో బంగారు నిధి అన్న భావన జనంలో ఉండిపోయింది.

అది అన్ని దిశలలాగే గొప్పది. దానికున్న ప్రత్యేకత సూర్యోదయం. ఈశాన్యం దిక్కు లేని ఏ స్థలం ఉండదు. ఇల్లూ ఉండదు. అలాగని ఈశాన్యంలో ఎంతో భూమిని వదిలి ఇల్లు కడితే.. కట్టే ఇల్లు నీచ స్థానంలోకి వెళ్తుంది. ముక్కు అందంగా, ఎంత గొప్పగా ఉన్నా.. దానికి రంధ్రాలు ఉంటేనే అది యోగ్యత కలిగింది అవుతుంది. శ్వాస ఆడని ముక్కు.. ఉంటే ఎంత? లేకుంటే ఎంత? ఈశాన్యం ఇంటికి ఎంత కావాలో.. అంతే కావాలి. దానికి అంటూ ఒక కొలత ఉంటుంది. అన్నీ సరిచూసుకొని ఇల్లు కట్టుకోండి.
-సుద్దాల సుధాకర్ తేజ
suddalavasthu@gmail.com
Cell: 98492 78143