తేనీటిలో విభిన్న రకాలు ఉన్నట్టుగానే, టీ ఆరాధకుల్లోనూ విచిత్రమైన వ్యక్తులు తారసపడతారు. ఏకాక్షరి కోసం ఎంతకైనా తెగించే రకాలన్నమాట వీళ్లు! అదేదో సినిమాలో మిఠాయీలపై మోజుతో కూతురుకు అస్తమానం పెండ్లిచూపులు ఏర్పాటుచేసే తండ్రిలా ఉంటుందన్నమాట ఈ టీ లవర్స్ వ్యవహారం. పెందరాళే ఇంట్లో పెద్దగ్లాసుడు టీతో వీళ్ల ఆకలి తీరదు. ‘వాకింగ్‌కు వెళ్లొస్తాను’ అని అలా నాలుగు అడుగులు వేసి వీధి మలుపులో ఉన్న టీ కొట్టు దగ్గర తిష్ఠవేస్తారు.
ఓ గంట దినపత్రికలు తిరిగేస్తూ మరో టీ లాగించేసి ఇంటిబాట పడతారు! అక్కడితో సంతృప్తి పడతారా అంటే నో చాన్స్!! ఇంటికి వచ్చీరావడంతోనే బయట టీ తాగిన సంగతి తెలియకుండా.. ‘రెండోసారి టీ గొంతు దిగనిదే ప్రకృతి ధర్మం పట్టు తప్పుతుంద’ని చురచుర చూస్తున్న శ్రీమతిని బతిమాలినట్టుగా ఇంకో చాయ్ అడుగుతారు. అలా ఎనిమిది దాటేలోపు మూడు టీలు జుర్రేసిన పెద్దమనిషి మరో అవకాశం కోసం ఎదురు చూస్తుంటాడు. స్నానాదికాలు పూర్తయి, టిఫిన్ చేశాక ‘కోడలమ్మా! కొబ్బరి చట్నీ అచ్చం మా అమ్మలా చేశావు తల్లీ’ అని ఉన్నపళంగా ఆమెను ములగచెట్టు ఎక్కించేసి.. ‘ఆ చేత్తోనే మామయ్యకు మంచి టీ పట్టుకురామ్మా!’ అని వినమ్రుడై విన్నవించుకుంటాడు.
మామగారి మాటల మత్తులో ఉన్న సదరు కోడలు పిల్ల.. ఆయనకు షుగర్ ఉందన్న సంగతీ మర్చిపోయి చక్కెర వేసిన చిక్కటి టీ పెట్టిస్తుంది. ‘ఆహా అమృతం!’ అని మరో కితాబిచ్చి వరండాలోని వాలు కుర్చీలో కూర్చొని పుస్తకాలు తిరిగేస్తుంటాడు. మరో రెండు గంటలు దాటాక.. ‘రావోయి అనుకోని అతిథి..’ అని లీలగా ఆలపిస్తూ వీధి వంక చూస్తూ ఉంటాడు. అదృష్టం బాగుండి ఎవరైనా ఆ ఇంటికి విచ్చేస్తే ఎగిరి గంతేసినంత పనిచేస్తాడు. ఆ వచ్చిన అతిథి ‘నేను తేనీటిని కాశీలో వదిలేశాను మహాప్రభూ!’ అని మొత్తుకున్నా ఆయనగారి అకౌంట్లో ఈయనగారు టీ తాగేస్తాడు. ఈ పెద్దమనిషి మాత్రమే కాదు, చాలామంది ఇలా టీ కోసం తపనపడుతుంటారు. అందుకే కాబోలు, ఓ ప్రముఖ తేయాకు సంస్థ దాదాపు ఇలాంటి కాన్సెప్ట్‌తోనే ప్రకటన విడుదల చేసింది. కాస్త ఆలోచిస్తే మీకూ గుర్తొస్తుంది!
‘టీ’కా తాత్పర్యం ఇంటిపట్టునే విహార సమాహారం చేయాలంటే టీ ఆస్వాదిస్తే చాలు!
– ఎలిస్ వాకర్అమెరికన్ రచయిత్రి
వైట్ టీ కావలసినవి: వైట్ టీ బ్యాగ్: ఒకటి, నీళ్లు: ఒక కప్పు, తేనె: ఒక టేబుల్ స్పూన్
తయారీ: గిన్నెలో నీళ్లు పోసి బాగా మరిగించాలి. ఒక కప్పులో తేనె వేసి ఉంచాలి. మరిగిన నీటిని కప్పులో పోసుకొని తేనె కరిగేలా కలుపుకోవాలి. చివరిగా టీ బ్యాగ్ వేసి రెండు నిమిషాలు బాగా ఆడిస్తే సరి వైట్ టీ సిద్ధం. చర్మకణాల రక్షణకు సాయకారిగా పనిచేస్తుంది. వాపులను తగ్గిస్తుంది.
ఈ సంచికపై మీ అభిప్రాయాలను మాకు తెలియజేయండి.