ఆలూమగల మధ్య గొడవలు తలెత్తడం మామూలే! పొద్దున రేగే కలహాలు చాలావరకు సాయంత్రానికి సద్దుమణుగుతాయి. పరాకుగా పలికే మాటలు చిరాకు స్థాయిని దాటినప్పుడు ఇంటి పెద్దలు సర్ది చెబుతారు. అనుమాన బీజం రేకెత్తినప్పుడు.. కులపెద్దలు కలగజేసుకుంటారు. చాలా సందర్భాల్లో అందరికీ ఆమోదయోగ్యమైన ఫైసలా చేసి.. ఆ కాపురాన్ని నిలబెట్టే ప్రయత్నం చేస్తారు. అంతగా పొసగదు అనుకుంటే… న్యాయస్థానాన్ని ఆశ్రయిస్తే సరిపోతుంది! రచ్చబండ దగ్గరో, కోర్టు గుమ్మంలోనో పరిష్కారమయ్యే సమస్య.. టీవీ చర్చల్లోకి వచ్చాక హీనంగా మారిపోయింది. ఏదోరకంగా కలవడానికి వచ్చిన భార్యాభర్తల గతాన్ని తవ్వడమే సదరు ‘జట్కా బండి’ రౌతులు పనిగా పెట్టుకుంటున్నారు. గోటితో పోయేదాన్ని గొడ్డలిదాకా తెచ్చి ఆ జంటను వీలైనంత ఎక్కువగా అభాసుపాలు చేయాలని కంకణం కట్టుకున్నట్టు కనిపిస్తారు వాళ్లు. ఈ క్రమంలో వెండితెరను ఉద్ధరించి.. బుల్లితెరను సంస్కరించడానికి నయా అవతారం దాల్చిన ఆడ సెలెబ్రిటీల దురుసుతనం ‘హవ్వ!’ అనిపిస్తుంటుంది.
బుల్లితెరను వీలైనంత భ్రష్టుపట్టించిన ‘టక్కుటమారాల బండి’ ఇప్పుడు అడ్డూ అదుపూ లేకుండా దూసుకుపోతున్నది. కాపురాలు నిలబెట్టడానికి కాదు సుమా! కొడిగడుతున్న బంధాన్ని ‘ఉఫ్..’మని ఊదేయడమే ధ్యేయంగా ఈ రచ్చ కొనసాగుతున్నది. చర్చలని చెప్పుకొనే ఈ రచ్చ అంతా స్క్రిప్టెడ్ అనే టాక్ బలంగా ఉంది! లేని వ్యక్తులను సృష్టించి, వివాహేతర సంబంధాలను ఆపాదించి, చేయని కాపురాన్ని కూల్చి పైశాచిక ఆనందం పొందుతున్నారు క్రియేటర్లు. ఓ అనామక మనోవైజ్ఞానిక నిపుణుడు ఈ రచ్చకు తనకు తోచిన విచిత్ర పరిష్కారం చూపుతాడు. ఈ శల్య పరీక్షలో వినిపించే బూతులు వింటే కర్ణభేరి భోరుమంటుంది. ఈ వికృత చర్చనంతా రీల్స్ రూపంలో సోషల్ మీడియాలో పోస్టు చేసే దందా వేరొకరిది. సామాజిక మాధ్యమాల్లో విశృంఖలంగా వైరల్ అవుతున్న ఈ అనైతిక వ్యవహారం.. పచ్చటి కాపురాల్లోనూ అగ్గి పుట్టిస్తున్నది! టీవీలో తగ్గుముఖం పట్టిన ఈ తెగులు.. ఇప్పుడు సామాజిక మాధ్యమాల్లో దావానలంలా విస్తరిస్తుండటం విధి వైపరీత్యమే! ‘ఏందయ్యా ఈ రచ్చ’ అని ఆ రీల్స్‌ను స్కిప్ చేయడం క్షణంలో పని! కానీ, అర నిమిషం పాటు అందులో జాలువారే పదజాలం, భావజాలం బుర్రకెక్కితే… ఎవరి బతుకైనా గతుకుల పాలయ్యే ప్రమాదం లేకపోలేదు! తస్మాత్ జాగ్రత్త!
– కోబ్రా