ఇన్స్పెక్టర్ రుద్రా.. ఏ తరహా కేసునైనా చిటికెలో సాల్వ్ చేస్తావటగా.. అయితే, నీకు ఇదే నా చాలెంజ్. నేను సిటీలో నలుగురిని చంపబోతున్నా. ఆ మర్డర్స్ నువ్వు ఆపాలనుకొంటే.. ఎన్టీ ఆర్ గార్డెన్స్‌లో అంబేద్కర్ స్టాట్యూ కనిపించని చోటుకు వెళ్లి వెదుకు.. ఫస్ట్ క్లూ దొరుకుతుంది. రేపు పొద్దున 10 గంటలకు వెళ్లు’.. రాత్రి పదకొండు గంటలకు ఇంట్లోకి వస్తూనే డోర్ దగ్గర ఉన్న ఈ చీటీ చదివి నిర్ఘాంతపోయాడు రుద్ర.‘
వాచ్మెన్.. ఈ చీటీ ఎవరు ఇక్కడ పెట్టారు?’ ప్రశ్నించాడు. తాను భోజనం చేయడానికి బయటికి వెళ్లానని, ఎవరు పెట్టారో తనకు తెలియదని చెప్పాడు వాచ్మెన్. దీంతో గేట్ దగ్గర ఉన్న సీసీటీవీ ఫుటేజీని పరిశీలించాడు రుద్ర. ఆశ్చర్యం.. ఓ తొమ్మిది-పదేండ్ల చిన్నారి ఒంటినిండా బుర్ఖా వేసుకొని వచ్చి ఈ చీటీని అక్కడ పడేసి వెళ్లినట్టు రుద్రకు ఫుటేజీలో కనిపించింది. ఆ చీటీ మళ్లీ చదివాడు రుద్ర. చీటీలో.. ‘నేను కొన్ని క్రైమ్స్ చేయబోతున్నా..’ అనే వాక్యం దగ్గర రుద్ర దృష్టిపడింది. వెంటనే మళ్లీ కంట్రోల్ రూమ్‌కు కనెక్ట్ అవుతూ.. ‘ఏమైనా మిస్సింగ్ కేసులు నమోదయ్యాయా?’ అంటూ ఆరా తీశాడు. ఆ రోజు 15 మిస్సింగ్ కేసులు రికార్డయ్యాయని, అయితే, 9 మంది తిరిగొచ్చారని, ఇంకో ఇద్దరి ఆచూకీ కూడా తెలిసిందని సమాధానం వచ్చింది. ‘మరి.. మిగతా నలుగురు?’ చెమటలు తుడుచుకొంటూ ప్రశ్నించాడు రుద్ర. ‘వెదుకుతున్నాం సార్’ అటునుంచి సమాధానం. వెంటనే మిస్సింగ్ వ్యక్తుల వివరాలు తనకు పంపించాల్సిందిగా ఆదేశించాడు రుద్ర. తర్వాత డీసీపీ సత్యనారాయణకు పరిస్థితిని వివరించాడు
అర్ధరాత్రి 12 గంటలకు ఎన్టీఆర్ గార్డెన్స్‌కు చేరుకొన్నాడు రుద్ర. సెక్యూరిటీ గార్డుకు చెప్పి గేట్లు ఓపెన్ చేయించి తన టీమ్‌తో పార్కు మొత్తం జల్లెడపట్టించాడు. ఎక్కడా ఎలాంటి క్లూ లభించలేదు. దీంతో చీటీలోని ‘రేపు పొద్దున 10 గంటలకు వెళ్లు’ అనే రాతలు రుద్రకు గుర్తొచ్చాయి. వెంటనే ఇద్దరు కానిస్టేబుల్స్‌ను అక్కడే కాపలా ఉండమని చెప్పిన రుద్ర.. పార్కు ఎంట్రెన్స్, ఎగ్జిట్, లోపల ఇలా అన్ని కీలకమైన ప్రదేశాల్లో సీసీటీవీ కెమెరాలు పని చేస్తున్నాయో లేదో చెక్ చేసి ఇంటికి బయల్దేరాడు. ఇంతలో తప్పిపోయిన వారి పేర్ల జాబితా మెసేజ్‌గా వచ్చింది. శిశిర (19), హనీ (20), వసంత (19), మిల్కీ (20) అని అందులో ఉంది.
తప్పిపోయిన వాళ్లందరూ అమ్మాయిలే. మిస్సింగ్లలో ఇద్దరిది 20 ఏండ్ల వయసు కాగా మరో ఇద్దరిది 19 ఏండ్ల వయసు. చీటీ క్లూగా విడిచిపెట్టింది ఓ బాలిక. అసలేం జరుగుతున్నదో రుద్రకు అర్థంకావట్లేదు. బుర్ర తిరిగిపోతున్నది. పొద్దున ఏ న్యూస్ వినాల్సి వస్తుందోనని ఒకింత ఆందోళనతోనే తనకు తెలియకుండానే నిద్రలోకి జారుకొన్నాడు.
ఉదయం కండ్లుతెరిచే సమయానికి గడియారంలో సమయం 9.30 కావస్తున్నది. చీటీలో విషయం గుర్తొచ్చి త్వరగా రెడీ అయిన రుద్ర.. వాయువేగంతో ఎన్టీఆర్ గార్డెన్స్‌కు చేరుకొన్నాడు. అప్పటికే హెడ్‌కానిస్టేబుల్ రామస్వామి సహా మరో పదిమంది వరకూ సిబ్బంది ఉన్నారు. ‘సార్.. పార్క్ అంతా జల్లెడ పట్టాం. ఏ క్లూ దొరకలేదు. సీసీటీవీ ఫుటేజీలో కూడా ఎవరూ పార్కులోకి వచ్చినట్టు ఏమీ రికార్డు కాలేదు’ అంటూ రామస్వామి చెప్పాడు. దీంతో నిరుత్సాహపడ్డ రుద్ర.. మళ్లీ జేబులోంచి ఆ చీటీని తెరిచి చదువసాగాడు. ‘ఎన్టీఆర్ గార్డెన్స్‌లో అంబేద్కర్ స్టాట్యూ కనిపించని చోటుకు వెళ్లి వెదుకు.. ఫస్ట్ క్లూ దొరుకుతుంది. రేపు పొద్దున 10 గంటలకు వెళ్లు’ అని బయటకు చదివాడు రుద్ర. ‘సార్.. పది గంటలు అల్రెడీ అయిపోయింది’ అన్నాడు రామస్వామి. ‘అదే బాబాయ్.. ఎన్టీఆర్ గార్డెన్స్‌లోనే అంబేద్కర్ స్టాట్యూ ఉంది. అంతపెద్ద విగ్రహం కనిపించని చోటు ఈ పార్కులో ఎక్కడ ఉంటుంది? అదే అర్థం కావట్లేదు’ దీర్ఘంగా నిట్టూరుస్తూ అన్నాడు రుద్ర. ఇంతలో.. ‘సార్.. దొరికింది’ అంటూ గట్టిగా అరిచాడు రామస్వామి. ఏమిటన్నట్టు కనుబొమ్మలెగరేశాడు రుద్ర. ‘సార్.. నేను ఇంగ్లీష్ డిటెక్టివ్ రిడిల్స్‌లో చదివాను.. ప్యారిస్‌లో ఈఫిల్ టవర్ కనిపించని చోటు ఏంటంటే’ అంటూ రామస్వామి సగం చెప్పాడో లేదో.. రుద్ర కండ్లు మెరిశాయి. వెంటనే ఆగంతక వ్యక్తి చీటీ ఎక్కడ దాచాడో సరిగ్గా ఆ ప్రదేశంలోకి వెళ్లారు రుద్ర అండ్ కో. అక్కడ వాళ్లకు మరో చీటీ కనిపించింది.
దాన్ని తెరిచి భయంతోనే చదవడం ఆరంభించాడు రుద్ర. ‘వెల్డన్ రుద్రా! మొత్తానికి ఈ చీటీ చదువుతున్నావంటే.. తొలి రౌండ్లో నువ్వు గెలిచినట్టే. కంగ్రాట్స్. ఇక, నీకు రెండో రౌండ్. నేను కిడ్నాప్ చేసిన నలుగురు అమ్మాయిల్లో ముందు ఎవర్ని చంపబోతున్నానో నువ్వు కరెక్ట్‌గా చెప్తే.. ఆ అమ్మాయిని వదిలిపెడ్తా. నీకు ఇస్తున్న క్లూ ఏంటంటే..’ అంటూ వణుకుతూ ఆగిపోయాడు రుద్ర. ‘సర్.. ఏంటి ఆ క్లూ??’ భయపడుతూ ప్రశ్నించాడు రామస్వామి. ‘బాబాయ్.. ముందు ఆ ఆగంతకుడు ఇక్కడికి ఎలా వచ్చాడు? ఎవరూ ఎందుకు గమనించలేకపోయారు? సీసీటీవీ ఫుటేజీలో ఏం రికార్డయ్యింది.. ఇలా మొత్తం వివరాలు పది నిమిషాల్లో నాకు కావాలి’ అంటూ ఆదేశించాడు రుద్ర.
పది నిమిషాల తర్వాత వచ్చిన రామస్వామి.. ‘సార్.. సీసీటీవీలో ఓ చిన్నారి బుర్ఖా వేసుకొని వచ్చి చీటీ అక్కడ పడేసి వెళ్లినట్టు ఉంది. తెల్లవారుజామున ఇది రికార్డయ్యింది. అయితే, ఆ పాప ఎలా వచ్చిందో మనవాళ్లకు కూడా అర్థం కావట్లేదట’ అంటూనే.. కాస్త ఆగి, ‘సార్.. చీటీలో క్లూ ఏంటి?’ అని అడిగాడు. దీంతో రెండో చీటీని పూర్తిగా చదివాడు రుద్ర. ‘నీకు ఇస్తున్న క్లూ ఏంటంటే.. ‘ఈ ప్రకృతిలో ఎన్ని రుతువులు మారినా.. అస్సలు పాడవ్వని తినే పదార్థాన్ని అమాంతం మింగేస్తా..’ ఈ క్లూలోనే ఆ అమ్మాయి పేరు ఉంది.. ఈరోజు ఉదయం 11 గంటలలోపు నీ పక్కనే ఉన్న ఫోయిల్ బెలూన్ ఇంగ్లీష్ లెటర్స్ సాయంతో నా చేతిలో చనిపోబోయే అమ్మాయి పేరును అక్కడే గ్యాస్ బెలూన్‌కు కట్టి స్టాట్యూ మీద నుంచి ఎగరేయి. పేరు తప్పుగా ఎగురవేసినా.. ఉదయం 11 గంటలకు ఒక్క సెకను ఆలస్యమైనా.. ఆ అమ్మాయి శవం హుస్సేన్‌సాగర్‌లో తేలుతుంది. జాగ్రత్తా!’ అంటూ చీటీలో ఉన్న వార్నింగ్‌ను చదువుతూ ఆగిపోయాడు రుద్ర.
టైమ్ అప్పటికే 10.50 కావొస్తున్నది. రుద్ర ఒళ్లంతా చెమటలతో తడిసిముద్దయ్యాడు. రామస్వామి సహా కానిస్టేబుల్స్ అందరూ వణికిపోతున్నారు. ఇంతలో రుద్ర మనసులో ఏదో తట్టింది.. ఏ మాత్రం ఆలస్యం చేయకుండా స్టాట్యూ మీదికి ఎక్కిన రుద్ర.. ఫోయిల్ బెలూన్ లెటర్స్‌ను దగ్గరికి చేర్చి.. చనిపోబోయే అమ్మాయి పేరేంటో కరెక్ట్‌గా పేర్చి గ్యాస్ బెలూన్ సాయంతో ఎగురవేశాడు. అంతే.. నెక్లెస్‌రోడ్డు మీద దూరంగా కారులోంచి ఓ అమ్మాయిని బయటకు దింపేసి ఆ కారు స్పీడ్‌గా వెళ్లిపోవడాన్ని స్టాట్యూ నుంచి చూస్తూ ఉండిపోయాడు రుద్ర. ఇంతకూ.. రెండో క్లూ చీటీ స్టాట్యూలోనే ఉందని రుద్ర ఎలా కనిపెట్టాడు? చనిపోబోయే అమ్మాయి పేరును అంత కరెక్ట్‌గా రుద్ర ఎలా చెప్పాడు??
సమాధానం
ఈఫిల్ టవర్ చాలా ఎత్తయినది. పారిస్‌లో ఎక్కడినుంచైనా అది క్లియర్‌గా కనిపిస్తుంది. ఆ టవర్ కనిపించని చోటు ఏదైనా ఉందంటే అది ఆ ఈఫిల్ టవర్ లోపలి ప్రాంతమే. ఇదే రిడిల్ను రామస్వామి చెప్పబోయాడు. వెంటనే పసిగట్టిన రుద్ర.. రెండో క్లూ చీటీ.. అంబేద్కర్ స్టాట్యూ లోపలే ఉందని కనిపెట్టి అక్కడికి వెళ్లాడు. ఇక, కిడ్నాపర్ ‘ఈ ప్రకృతిలో ఎన్ని రుతువులు మారినా.. అస్సలు పాడవ్వని తినే పదార్థాన్ని అమాంతం మింగేస్తా..’ అంటూ క్లూ ఇచ్చాడు. ఈ ప్రకృతిలో ఎన్నేండ్లయినా పాడవ్వని ఏకైక తినే పదార్థం తేనె. దాన్ని ఇంగ్లీష్‌లో హనీ అంటారు. అంటే కిడ్నాపర్ తొలి టార్గెట్ హనీ. దీన్ని అర్థం చేసుకొన్న రుద్ర.. 11 గంటలు కాకముందే ఫోయిల్ బెలూన్స్ లెటర్స్‌తో హనీ పేరును ఎగురవేశాడు. గడువు కంటే ముందే సరైన సమాధానం చెప్పడంతో కిడ్నాపర్ హనీని వదిలిపెట్టాడు. కాగా, మిగిలిన ముగ్గురు అమ్మాయిలు, కిడ్నాపర్‌ను పట్టుకునే పనిలో మునిగిపోయాడు రుద్ర….?
-రాజశేఖర్ కడవేర్గు