కిడ్నాపైన పిల్లలందరినీ రక్షించిన ఇన్స్పెక్టర్ రుద్రకు.. ‘దమ్ముంటే పట్టుకోరా రుద్ర.. పట్టుకొంటే వదిలేస్తా నీ డొక్కు ఫ్యామిలీ సిండికేట్’ అంటూ సైకో రవి సవాల్ విసిరాడు. దీంతో తన కుటుంబసభ్యులకు ఏమయ్యిందోనన్న కంగారుతో ఆగమేఘాలమీద ఇంటికి వచ్చాడు రుద్ర. టెన్షన్‌తో ఇంట్లోకి పరిగెత్తాడు. అయితే, రుద్ర తల్లి రూప వంట చేస్తుండగా, తండ్రి రాజశేఖర్ ఏదో పుస్తకం చదువుతున్నాడు. కొడుకు ముఖంపై పట్టిన చెమటను గమనించిన రాజశేఖర్.. ఏమైందంటూ ప్రశ్నించాడు. ఏమీలేదంటూ గదిలోకి వెళ్లి తలుపు వేసుకొన్నాడు రుద్ర.
ఇంతలో రుద్ర మొబైల్ ఫోన్ రింగయ్యింది. లిఫ్ట్ చేశాడు. ‘ఏరా రుద్రా.. టెన్షన్ పడ్డావా? ఇంకా మీ డొక్కు సిండికేట్ ఫ్యామిలీని ఏం చేయలేదులే. సరేగానీ.. నేను ఎన్ని ట్రిక్కీ క్వశ్చన్లు అడిగినా సులభంగా ఆన్సర్ చేస్తున్న నువ్వు.. నన్ను పట్టుకోలేకపోవడం ఏంటిరా? ఇది నీ ఓటమి కాదా? అయినా.. నీ బద్ధకం వల్ల నాకు చాలా బోర్ వస్తుంది. అందుకే, నీకు ఒక బంపర్ ఆఫర్ ఇస్తున్నా..’ అంటూ సైకో ఆగిపోయాడు. సైకో మళ్లీ ఏదో చేయబోతున్నాడని గమనించిన రుద్ర భయంతో ఏమీ మాట్లాడకుండా మౌనంగా ఉండిపోయాడు. దీంతో చిర్రెత్తుకొచ్చిన సైకో ‘ఊ.. అంటావా? అలాగే దెయ్యంలా ఉంటావా?’ అంటూ రుద్రను గద్దించాడు. ముఖానికి పట్టిన చెమటను తుడుచుకొంటూ భయంతో ‘ఊ..’ అన్నాడు రుద్ర. ‘నన్ను పట్టుకోవడం మీ వాళ్లకు సాధ్యమయ్యేపనిలా కనిపించడంలేదు గానీ.. నేను ఇక చివరిసారిగా నిన్ను 5 క్వశ్చన్లు అడుగుతా రా.. ముందటి టాస్క్లాగే ఒక్కో ప్రశ్నకు ఐదు సెకండ్లలోపు కరెక్ట్ ఆన్సర్ చెప్పాలి. ఒకవేళ, ఏ ఒక్క ప్రశ్నకు తప్పు ఆన్సర్ చెప్పినా.. నీ ఇల్లు మొత్తం పేల్చేస్తా. దీంతో నీతోపాటు ఇంట్లో వంట చేసుకొంటున్న నీ తల్లి, ఐఏఎస్ ఎగ్జామ్‌కి ప్రిపేర్ అవుతున్నట్టు బిల్డప్ ఇస్తున్న నీ తండ్రి బూడిదైపోతారు. ఒకవేళ, అన్ని ప్రశ్నలకు కరెక్ట్ ఆన్సర్ చెప్పావో.. నన్ను నేను బాంబులతో పేల్చేసుకొంటా. ఏమంటావ్?’ అంటూ ప్రశ్నించాడు సైకో.
‘మమ్మల్ని చంపినా.. నువ్వు చనిపోయినా.. నీకు ఏం వస్తుంది చెప్పు’ అంటూ దీనంగా సైకో రవిని అడిగాడు రుద్ర. ‘ఎదవ సెంటిమెంట్ డైలాగ్‌లు కొట్టకు. నోరు మూస్కొని చెప్పింది చెయ్యి.. నాకు గనుక తిక్కరేగిందో.. గేమ్ ఆప్షన్ కూడా ఇవ్వకుండా ఇంటిని పేల్చేస్తా. ఎలాగో నన్ను పట్టుకోవడంలో ఫెయిలయ్యావ్ కాబట్టే నేను నీ ఇల్లు పేల్చేశానని నాకు నేను సాటిస్ఫై అయిపోతా..’ అంటున్న సైకో మాటలతో ఆలోచనలోపడ్డాడు రుద్ర. ఇలాంటి సైకోతో ఇవేమీ కుదరవని మనసులో అనుకొన్న రుద్ర గేమ్‌కు సరేనన్నాడు. గేమ్‌ను స్టార్ట్ చేశాడు సైకో రవి.
‘మొదటి ప్రశ్న.. బుధవారం, శుక్రవారం, ఆదివారం పేర్లు వాడకుండా వరుసగా వచ్చే మూడు రోజుల పేర్లు చెప్పు? యువర్ టైమ్ స్టార్ట్ నౌ.. ఫైవ్, ఫోర్ ..’ ఇంతలో రుద్ర సమాధానం చెప్పాడు. రెండో ప్రశ్న.. ఏనుగు అంత పెద్దగా ఉండాలి. బరువు మాత్రం ఏమీ ఉండొద్దు. దేన్ని తీసుకొస్తావ్? యువర్ టైమ్ స్టార్ట్ నౌ.. ఫైవ్..’ ఇంతలో రుద్ర సమాధానం చెప్పాడు. మూడో ప్రశ్న.. పట్టపగలు రద్దీగా ఉన్న ఓ రోడ్డు మీద రాంగ్ రూట్లో ఓ ట్రక్కు డ్రైవర్ వెళ్తున్నాడు. పది మంది ట్రాఫిక్ పోలీసులు గుడ్లప్పగించుకొని చూస్తున్నారు తప్ప వాడిని పట్టుకోలేదు. ఎందుకు? యువర్ టైమ్ స్టార్ట్ నౌ.. ఫైవ్, ఫోర్, త్రీ, టూ..’ రుద్ర సమాధానం చెప్పాడు. నాలుగో ప్రశ్న.. అది నీ సొంతం.. అయితే, దాన్ని నీ కంటే ఇతరులే ఎక్కువగా వాడుతారు? ఏంటది? యువర్ టైమ్ స్టార్ట్ నౌ.. ఫైవ్..’ ఇంతలో రుద్ర ఆన్సర్ చేశాడు. ఐదో ప్రశ్న.. ఇది నువ్వు కరెక్ట్‌గా చెప్తే అందరినీ వదిలిపెడ్తా, నేను సూసైడ్ చేసుకొంటా.. తప్పుగా చెప్పావో..’ అంటున్న సైకో మాటలను ఆపుతూ.. ‘వెధవ బిల్డప్‌లు ఆపి ముందు క్వశ్చన్ ఏంటో అడుగురా.. సైకో నా కొడకా..’ అంటూ ఫైర్ అయ్యాడు రుద్ర. దీంతో అంతే కోపంతో ఆఖరి ప్రశ్నను అడిగాడు సైకో.. ‘100 నుంచి 10ని ఎన్నిసార్లు తీసివేయగలవు?? తీసివేయడమంటే.. నీ వెధవ తెలివితేటలతో.. తీసి మళ్లీ వేయడం ఏమీకాదు. తీసివేయడమంటే మైనస్ చేయడం.. ఇప్పుడు ఆన్సర్ చెప్పరా రుద్రగా.. యువర్ టైమ్ స్టార్ట్ నౌ.. ఫైవ్, ఫోర్, త్రీ, టూ, వన్..’ ఇంతలో రుద్ర సమాధానం చెప్పాడు. ఫోన్‌లైన్ డిస్కనెక్ట్ అయ్యింది.
రెండు సెకండ్ల తర్వాత.. రుద్ర పక్కింట్లోని బేస్మెంట్లో భారీ పేలుడు శబ్దం వినిపించింది. చుట్టుపక్కల వారందరూ కంగారుగా బయటికి వచ్చారు. సైకో రవి అక్కడే ఓ గదిని కిరాయికి తీసుకొని ఓ నెట్‌వర్క్‌ను ఏర్పాటు చేసుకొన్నట్టు రుద్ర తెలుసుకొన్నాడు. తన ఆచూకి, సిగ్నల్స్ తెలియకుండా జామర్లు వాడినట్టు గుర్తించాడు. రాడార్లకు కూడా దొరకని మైక్రో డ్రోన్ కెమెరాలతో ఇంట్లో, స్టేషన్లో, బయట ఇలా తాను ఎక్కడికి వెళ్తే అక్కడ సైకో ఫాలో అయినట్టు తెలుసుకొన్నాడు. ఇగోకు పోయి మంచి భవిష్యత్తును నాశనం చేసుకొని బాంబులతో ఛిద్రమైన సైకో రవి మృతదేహాన్ని అధికారులు హాస్పిటల్‌కు తరలించారు. ఇన్నాళ్లూ తమ మధ్యలోనే ఓ సైకో ఉన్నా.. ఎవరం కనిపెట్టలేకపోయామని చుట్టుపక్కలవారందరూ గుసగుసలాడుకొన్నారు. కిడ్నాపైన పిల్లలను తన తెలివితేటలతో కాపాడిన రుద్రను పొగడ్తలతో ముంచెత్తారు. కుమారుడిని అందరూ పొగుడుతుండటంతో రుద్ర తల్లిదండ్రులు ఎంతో మురిసిపోయారు. అదిపక్కనపెడితే.. సైకో అడిగిన ఐదు ప్రశ్నలకు మీరు సమాధానాలు కనిపెట్టారా?
సమాధానం : మొదటి సమాధానం.. నిన్న, నేడు, రేపు; రెండో సమాధానం.. ఏనుగు నీడ; మూడో సమాధానం.. ట్రక్కు డ్రైవర్ లారీలో వెళ్లడంలేదు.. నడుస్తూ వెళ్తున్నాడు; నాలుగో సమాధానం.. నీ పేరు; ఐదో సమాధానం.. 100 నుంచి 10ని ఒకేసారి తీసివేయగలం.. ఎందుకంటే ఒకసారి తీసివేసాక 100 అనేది 90గా మారుతుంది.